ప్రముఖ రచయిత, అనువాదకుడు, ప్రగతిశీల మేధావి ముక్తవరం పార్థసారథి బుధవారం రాత్రి కన్నుమూశారు. వామపక్ష భావజాలంలోనూ విశ్వసాహిత్యంలోనూ విశేషపరిజ్ఞానం గల పార్థసారథి జీవితాంతం రచనలకూ అధ్యయానికే అంకితం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత రచనలను తెలుగులోకి తేవడానికి, తెలుగువారి పరిచయం చేయడానికి కడదాకా శ్రమిస్తూ వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి భువనగిరిలో 1944 జులై 7న పుట్టిన ముక్తవరం పార్థసారథి చిన్నతనంలోనే తన 17వ ఏట రచయిత చలంను కలిసి ఆయన ప్రేరణతో సాహిత్యపరిచయం చేసుకున్నారు. 1959లో గోల్కొండ పత్రికలో ఆయన తొలి రచన వచ్చింది. చలం సూచనపై వరవరరావు వెళ్లి ఆయను కలుసుకున్నారు. హైదరాబాదులో చదువుపూర్తి చేసి రిజర్వు బ్యాంకు ఉద్యోగంలో చేరి 2002లో ఉన్నతస్థాయిలో పదవీ విరమణ చేశారు. అప్పటికే నిరంతరాయంగా పుస్తకాలు రాస్తూ వచ్చిన పార్థసారథి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఒకేసారిఏడు నవలలు విడుదల చేసి సంచలనం సష్టించారు. దాదాపు 70 కిపై గా వైవిద్య భరితమైన రచనలు వెలువడ్డాయి. ఇంకా వివిధ ప్రచురణ దశల్లో వున్నాయి.
వామపక్ష ఉద్యమాభిమానిగా ముక్తవరం పార్థసారథి ప్రజాశక్తి సంస్థలకు కూడా సన్నిహితులు. ప్రజాశక్తి లో సీరియల్ వెలువడిన అనువాద రచన నరహంతలు ధరాధిపతులై అమెరికా సామ్రాజ్యవాదం రెడ్ ఇండియన్ తెగలను ఎలా వూచకోత కోసి పెరిగిందో గొప్పగా చెబుతుంది. నామచోమ్ స్కీ రచనల సారం కూడా అనువదించి ఇచ్చారు. నరహంతకుడి స్వగతం మరో నియంత ఆత్మకథ వంటిది. ప్రగతిశీల రచయితలు నోబెల్ గ్రహీతల రచనలు ఆయన నాలుక చివర వుండేవంటే అతిశయోక్తి కాదు. సాహితీ స్రవంతితో సహా వివిధ సంస్థలు నిర్వహించిన సదస్సులు, కార్యశాలల్లో ఆయన రిసోర్స్ పర్సన్గా సేవలందించారు. సాహిత్య ప్రస్థానంలో అనేక రచనలు చేస్తూవచ్చారు. ఇప్పుడు ప్రజాశక్తి బుక్ హౌస్ లో ఆయన కొన్ని రచనలు తుదిరూపం తీసుకోవడానికి సిద్ధంగా వుండగా తుదిశ్వాస విడిచారు.. శూన్యం, మిథ్య, కలల నీడలు, నువ్వూనేను చిన్నారావు తదితర నవలలు వెలువరించిన పార్థసారథి నవలాలోకం పేరిట దేశ దేశాల నవలలు పరిచయం చేస్తూ నాలుగు సంపుటాలు, దేశదేశాల కథలు, రచనా సమయం, బెస్ట్ సెల్లర్లు, నోబెల్ బహుమతి కథలు, మరెన్నో తెచ్చారు. ఉక్కుపాదం కూడా అనువదించారు. ప్రేమ పెట్టుబడి అనువాదం, మార్క్ సామాజిక శాస్త్రాలు, ఫాసిజం, గ్రాంసీ రచనలు, ప్రపంచ సాహితీ వేత్తలు, చైనా జానపదకథలు ఇలా ఆ జాబితా చాలా పెద్దది.
ఆయన భార్య వసంత చిత్రకారిణి. రాలిన ఆకులపై ఆమె గీసిన చిత్రాలు ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి. పత్రికల ముఖచిత్రాలుగా లోపలి కవర్లుగా ప్రచురితమైనాయి. ఆమె ఆయన భౌతికకాయాన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు అందిస్తున్నారు. వారి ఇద్దరు కొడుకులు అమెరికాలోవుంటున్నారు. ఆయన మరణవార్త తెలిసిన సాహిత్యలోకం ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ముక్తవరం పార్థసారథితో వ్యక్తిగతంగానూ రచనల ప్రచురనతోనూ సుదీర్ఘ పరిచయం గుర్తు చేసుకుంటున్నారు.
– తెలకపల్లి రవి



