Tuesday, October 28, 2025
E-PAPER
Homeకరీంనగర్బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..

- Advertisement -

ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్…
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్..
సదరం శిబిరం పరిశీలన…
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

వైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని,  ఆసుపత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో  సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. రోగులకు మెరుగైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించడం వైద్యుల ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.

శిబిరానికి ఎందరు వచ్చారు?
దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరం నిర్వహిస్తుండగా, ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. సదరం రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, వివరాల నమోదు, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సౌకర్యాల తీరును ఆరా తీశారు. మొత్తం 50 మందికి ఆర్థోకి సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు.
సదరం శిబిరానికి రావడానికి మీరు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నారు? ఈరోజు శిబిరానికి రావాలని మా సిబ్బంది మీకు ఫోన్ చేశారా లేదా అని ఆరా తీశారు. శిబిరం నిర్వహణకు సంబంధించిన వివరాలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చే వారి కోసం గదిలో మౌలిక వసతులు కల్పించాలని, ఫర్నిచర్ ఇతర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీఓ శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -