జీవిత వైరుధ్యాలు ఎన్నో! మరెన్నో!! సమసమాజం, సమానత్వంకోసం పోరాడేచోటే అత్యంత క్రమానుగత శ్రేణి ఉన్నదా! కుల మత భేదాలు లేవని, మనమంతా ఒక్కటే అని భాషణలిచ్చే వారి సొంత కుటుంబంలో తన ముందు తరాలు కానీ తర్వాత తరాలలో కానీ ఏ ఒక్కరూ కులం దాటి పెళ్ళిళ్లు చెయ్యని వైనం ఉన్నదా!! కుటుంబ వారసత్వాలు లేవని, మనది వసుధైక కుటుంబం అని లేవనెత్తే గొంతు వెనుక తనని దాటి ఎప్పుడూ ఎవ్వరికీ మేలు చేయని మర్మం ఉన్నదా!!! వృత్తి ధర్మం, సమాజానికి మేలు చేసే ధర్మం అంటూ ఎవరికి చిక్కకుండా తిరిగే పలాయనవాదం ఉన్నదా! ఇటువంటి గాథలు ఎన్నో! మరెన్నో!! మరైతే ఈ గాథలన్నింటికి భిన్నంగా, అరుదుగా ఒక కథ ఉంది. అదే మా అమ్మమ్మ కథ. తాను కట్టుబడ్డ సిద్ధాంతాలకు, విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప మానవతావాది. తన సొంత కుటుంబమే కాదు పార్టీలో తనతో కలిసి పనిచేసిన, తన వల్ల ప్రభావితం అయిన ఎన్నో కుటుంబాలు దానికి నిదర్శనం. తన జీవితంలో స్వేచ్ఛ, స్వీయ గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడని వ్యక్తి మా అమ్మమ్మ. ఎటువంటి విషయాన్నైనా చాలా ముక్కుసూటిగా, నొచ్చుకోకుండా అలవోకగా చెప్పగలిగే గుణం ఆవిడది. తను పార్టీ పరంగా కానీ, సొంత జీవితంలో కానీ తను పెట్టుకున్న సూత్రాలకు, తన నిజ జీవితానికి వ్యత్యాసం లేకుండా ఒక సమతుల్యమైన జీవితం గడిపారు.
ఐద్వా ఆఫీసులో నా చిన్నప్పటి నుండి చూసిన దృశ్యాలు ఎప్పటికీ మరచిపోలేను. మామూలుగా రకరకాల పనుల్లో బిజీగా ఉంటూ గజిబిజిగా ఉండే ఆఫీసు కాస్తా అమ్మమ్మ వచ్చిన రోజు మాత్రం అందరి ముఖాలు వెలిగిపోయేవి. అందరూ ఆవిడ చుట్టూ చేరి తను తెలంగాణ యాసలో చాలా క్యాజువల్‌గా వేసే జోకులకి నవ్వుతూ, తనతో కలిసి లంచ్ షేర్ చేసుకుంటూ భలే సరదాగా, సందడిగా ఉండేది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా తను మంచి అనుకున్న దాన్ని అందరికీ పంచి సంతోషపడే గొప్ప వ్యక్తిత్వం ఆవిడది. అది సినిమాలు అయినా, షికార్లు అయినా, తిండి అయినా, ఆఖరికి తను కట్టిన చీర అయినా. ఆవిడ ఆలోచనా విధానం, సాంస్కృతిక, సామాజిక అలవాట్లలో తన టేస్ట్, టైమ్‌కి తగ్గట్టు సమకాలీనంగా, అత్యాధునికంగా, ఉన్నతంగా ఉండేవి.
అందరి బంధువు అన్న మాటకి సరైన నిర్వచనం మా అమ్మమ్మ. తనను దాటి ఒకరికి సాయపడదా, తోటి కార్యకర్తల వ్యక్తిగత ఇబ్బందుల్ని, మనోభావాల్ని అర్థం చేసుకుంటూ వారి సొంత మనిషిగా నిలబడ్డ ఆత్మస్థైర్యం ఆవిడ గొప్పతనం. పార్టీలో ఒకరికి అమ్మగా, మరొకరికి అమ్మమ్మగా, ఐద్వాలో ప్రియమైన ఆంటీగా, పెద్దమ్మగా, అత్తగా, జేజమ్మగా ఇలా ఆవిడ పెనవేసుకున్న బంధాలు ఎన్నో. అలా అల్లుకున్న బంధమే నాదీ, మా అమ్మమ్మది. నా జీవితంలో ఒక అమ్మమ్మ (ఎన్.ఎస్. లక్ష్మిదేవమ్మ)గా తను తీసుకున్న బాధ్యత, పాత్ర, తాను ఇచ్చిన స్ఫూర్తి, నేర్పిన విలువల గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాలి. అక్షరాంజలితో
కె. సమత
(నేడు లక్ష్మిదేవమ్మ ప్రథమ వర్థంతి)
మా అమ్మమ్మ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES