యాదవ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
పిల్లి రామరాజు యాదవ్ పైన నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చేసిన దాడిని యాదవ ఐక్య కార్యచరణ కమిటీ (యాదవ జేఏసీ) తీవ్రంగా ఖండిస్తోందని, అతన్ని వెంటనే బిజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని యాదవ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమను “హిందువుల పార్టీ”గా ప్రచారం చేసుకునే బిజేపీ కార్యాలయంలోనే యాదవులపై దాడి జరగడం ఏమిటని, ఇదేనా బీజేపీ చెప్పుకునే సంస్కారం? ఇదేనా సమానత్వం? బీసీ వర్గాలకు చెందిన నాయకులపై ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న రెడ్డి ఆదిపత్య అహంకారానికి స్పష్టమైన ప్రతిరూపం.ఈ దాడియెన్నారు.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ, నాగం వర్షిత్ రెడ్డిని తక్షణమే బిజెపి నుండి సస్పెండ్ చేయాలన్నారు. దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బీసీలపై, ముఖ్యంగా యాదవులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై యాదవ సమాజం సహించదని,రెడ్డి ఆదిపత్య అహంకారం నశించాల్సిందేన్నారు. బాధితుడు పిల్లి రామరాజు యాదవ్ కు యాదవ జేఏసీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



