నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాల, పట్టణంలోని లిల్లీపుట్, శ్రీ భాషిత పాఠశాలలో ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ పాఠశాల అకడమిక్ కోఆర్డినేటర్ రమేష్ , లిల్లీపుట్, శ్రీ భాషిత పాఠశాలల కరస్పాండెంట్లు రామకృష్ణ ,పోలపల్లి సుందర్ లు మాట్లాడుతూ, గణితం కేవలం పాఠ్యాంశమే కాకుండా జీవిత సమస్యలను పరిష్కరించడానికి మౌలిక ఆధారం అని తెలిపారు. సూత్రాలను కంఠస్థం చేయడం కన్నా, వాటిని ప్రాయోగికంగా అర్థం చేసుకుని వినియోగించడమే నిజమైన విద్య అని విద్యార్థులకు సూచించారు. అతి సాధారణ నేపథ్యం నుంచి ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేత్తగా ఎదిగిన రామానుజన్ గారి జీవితం విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. 1918లో ఆయన రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికై భారతదేశానికి గర్వకారణమయ్యారని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు గణిత ప్రాజెక్ట్ ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేశారు.ఈ పోటీల్లో విద్యార్థులు వివిధ గణిత అంశాలపై రూపొందించిన చార్టులు, మోడల్స్, పోస్టర్ల ద్వారా గణిత ప్రాజెక్ట్ లను వివరించడంతో పాటు, గణితం రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఉత్తమంగా ప్రదర్శించిన విద్యార్థులను ఎంపిక చేసి మొదటి మరియు రెండో బహుమతులు అందజేశారు. కార్యక్రమములో ప్రపంచ ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



