Friday, November 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసంస్కరణల ప్రతిపాదనలపై జాతీయ స్థాయి రెఫరెండం

సంస్కరణల ప్రతిపాదనలపై జాతీయ స్థాయి రెఫరెండం

- Advertisement -

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై 17న తీర్పు

ఢాకా : దేశంలో అమలు చేయాల్సిన సంస్కరణల ప్రతిపాదనలపై జాతీయ స్థాయిలో రెఫరెండం నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్‌ చీఫ్‌ అడ్వైజర్‌ మహ్మద్‌ యూనస్‌ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయని, స్వేచ్ఛగా, సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై చార్టర్‌గా పిలిచే ఈ సంస్కరణలు దేశ రాజకీయాలను, సంస్థలకు తిరిగి ఒక రూపం ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే గతేడాది హసీనా పదవీచ్యుతికి దారి తీసిన తిరుగుబాటుకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపును ఇవ్వాలని కోరుతోంది. అక్టోబరులో మెజారిటీ రాజకీయ పార్టీలు ఈ సంస్కరణల పత్రంపై సంతకాలు చేశాయి. అయితే గతేడాది ఉద్యమనేతలు ఏర్పాటు చేసిన నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ (ఎన్‌సిపి), నాలుగు వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపే పార్టీలు మాత్రం ఈ పత్రాన్ని బహిష్కరించాయి. సంస్కరణల పత్రంలో పేర్కొన్న హామీల అమలుకు ఎలాంటి చట్టబద్ధమైన పరిధి లేదా యంత్రాంగం కొరవడిందని, అందుకే తాము బహిష్కరిస్తున్నామని ఎన్‌సిపి తెలిపింది.

ట్రిబ్యునల్‌ తీర్పు 17న
మానవాళికి వ్యతిరేకంగా పలు నేరాలకు పాల్పడిన కేసులో పదవీచ్యుతులైన ప్రధాని షేక్‌ హసీనాపై తీర్పును బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ (ఐసిటి) ఈ నెల 17న వెలువరించనుంది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ట్రిబ్యునల్‌ ఈ తీర్పును ఇస్తుందని ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన జర్నలిస్టు తెలిపారు. హసీనాను, హోం మంత్రి అసదుజ్‌మన్‌ ఖాన్‌ కమల్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ చౌదరి అబ్దుల్లా అల్‌ మమున్‌లను ట్రిబ్యునల్‌లో విచారించారు. హసీనా, కమల్‌ పరారీలో వున్నారని కోర్టు ప్రకటించడంతో వారి పరోక్షంలోనే విచారణ సాగింది. అప్పటి పోలీసు చీఫ్‌ ఒక్కరే విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఆయన అప్రూవర్‌గా మారిపోయారు. గతేడాది తిరుగుబాటుసమయంలో తన పాత్రను, తన సహ నిందితులైన ఇద్దరి పాత్రను ఆయన వివరించారు. తమ నేతల విచారణను నిరసిస్తూ పూర్వపు పాలక పార్టీ అవామీ లీగ్‌ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపివ్వడంతో గురువారం బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా రవాణా స్తంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -