సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రేమద్దులలో యువ కమ్యూనిస్టుల సమ్మేళనం
నవతెలంగాణ -పానగల్
మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. భగత్‌సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దులలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యువ కమ్యూనిస్టుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి జాన్‌వెస్లీ హాజరై భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగత్‌సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఊయలగా మార్చుకున్న గొప్ప త్యాగమూర్తి అని కొనియాడారు. చిన్న వయసులోనే విప్లవోద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. అలాంటి మహానుభావుల త్యాగాలను మరిచిపోయిన బీజేపీ మతోన్మాద ప్రభుత్వం దేశంలో కుల, మతాల మధ్య చిచ్చురేపి రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు.
ప్రపంచంలో అమెరికా పెత్తనం చేస్తూ యుద్దాలకు ఉసిగొల్పుతోందని, పలు దేశాల్లోని ఆర్థిక, చమురు నిల్వలను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్రలు పన్నుతోందని అన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశం ఇతర దేశాల పరస్పర ఒప్పందాలను గౌరవిస్తూ స్నేహశీలిగా ఉండాల్సింది పోయి అమెరికాకు వంత కాగటం సరైన చర్య కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నాయక్, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదరి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి.బాల్ రెడ్డి, ఎం.రాజు, మండల కార్యదర్శి బాల్య నాయక్, రేమద్దుల గ్రామ సర్పంచ్ నిరంజన్, తేల్లరాలపల్లి సర్పంచ్ జమ్ములయ్య, నాయకులు జి.వెంకటయ్య, భగత్, భాస్కర్, ఎం.వెంకటయ్య, మల్లేష్, కాజా, శేఖర్, ప్రజానాట్యమండలి నాయకులు కాకం ఆంజనేయులు పాల్గొన్నారు.



