– ఆయన జిమ్‌లో ఒక ఏడాది మెంబర్‌షిప్ తీసుకున్న సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌బ్రిట్టాస్
– మొదటి వంద మందికి ఉచిత సభ్యత్వం స్పాన్సర్ చేస్తా : సామాజిక కార్యకర్త అవీ దండియా
– ఆర్థిక సాయానికి ముందుకొస్తున్న నెటిజన్లు
– ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలంటూ సూచనలుడెహ్రాడూన్ : హిందూత్వ శక్తుల వేధింపుల ఘటనలో ఒక ముస్లిం దుకాణదారుడికి మద్దతుగా నిలబడి, తనను ‘మహ్మద్ దీపక్’గా పరిచయం చేసుకున్న ఉత్తరాఖండ్‌కు చెందిన జిమ్ యజమాని దీపక్ కుమార్‌కు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయనకు అండగా ‘మేమున్నాం’ అంటూ పలువురు ముందుకొ స్తున్నారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, నెటిజన్లు కూడా ఉన్నారు. రిపబ్లిక్‌డే నాటి ఘటన తర్వాత ఆయన జిమ్ సభ్యత్వాలు భారీగా తగ్గిపోవడంతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య, కూతురు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనారోగ్యానికి గురయ్యారు.
రిపబ్లిక్‌డే నాటి ఘటనకు ముందు దీపక్ నిర్వహిస్తున్న ‘హల్క్’ జిమ్‌కు ముందుగా సుమారు 150 మంది సభ్యులు ఉండేవారు. అది ఇప్పుడు 15-20 మందికి పడిపోయింది. జిమ్ బయట పోలీసులు నిరంతరం ఉంటున్నారనీ, దీంతో సభ్యులు భయపడుతున్నారని దీపక్ చెప్పాడు. దీపక్‌కు దేశవ్యాప్తంగా అనేక మంది సంఘీభావం తెలుపుతున్నారు.
సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆయన జిమ్‌కు ఒక సంవత్సరం సభ్యత్వం తీసుకున్నారు. దేశంలో మతసారస్యానికి ఉదాహరణగా నిలిచిన దీపక్‌ను ఆయన ఆదివారం కలిశారు. ఎక్స్, ఇన్‌స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వందలాది మంది దీపక్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇందుకు ఆయన బ్యాంకు ఖాతా వివరాలను పలువురు నెటిజన్లు కోరుతున్నారు. కొందరు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని దీపక్‌కు సూచిస్తున్నారు. నటి స్వర భాస్కర్ ఆ ఆలోచనకు మద్దతు తెలిపారు. జైపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త అవీ దండియా మొదటి వంద మందికి ఉచిత సభ్యత్వాన్ని స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. సభ్యులు తగ్గినా.. దీపక్ ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే జిమ్‌కు చేరుకుంటు న్నాడు. అక్కడ ఉండే జిమ్ పరికరాలను శుభ్రం చేస్తూ, తన జిమ్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే ఆశాభావంతో ఉన్నాడు.
ఏం జరిగింది?
రిపబ్లిక్‌డే రోజు ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్‌లో నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న ‘బాబా స్కూల్ డ్రస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ అనే దుకాణంపై వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు దుకాణ యజమాని వకీల్ అహ్మద్(71) మతాన్ని ప్రస్తావిస్తూ పేరు మార్చాలని ఒత్తిడి తెచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి వచ్చిన దీపక్ కుమార్ కలుగజేసుకున్నాడు. ఆయనకు మద్దతుగా నిలిచాడు. ‘నువ్వు ఎవరు?’ అని ప్రశ్నించిన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలకు ‘మేరా నామ్ మహ్మద్ దీపక్’ అని చెప్పాడు. దీంతో దీపక్ చెప్పిన ఆ ఒక్క మాటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా దీపక్‌కు మద్దతు పెరిగిపోయింది. నెటిజన్లంతా దీపక్ చర్యను సమర్థిస్తున్నారు. మతోన్మాద హిందూత్వ శక్తులకు ఆయన సరైన సమాధానం చెప్పాడని కొనియాడుతున్నారు.



