* వరుస కథనాలతో యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ‘నవతెలంగాణ’
* స్పందించిన మున్సిపల్, ఆర్టీసీ అధికారులు
* రోడ్డుపై వ్యాపారాల తొలగింపు.. ఊపిరి పీల్చుకున్న వాహనదారులు
* పత్రికా సామాజిక బాధ్యతపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణ కేంద్రంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యపై ‘నవతెలంగాణ’ చేపట్టిన అక్షర పోరాటం ఫలించింది. బస్టాండ్ మలుపు వద్ద ఆక్రమణల కారణంగా నిండు ప్రాణం బలికావడం, వాహన చోదకులు నిత్యం పడుతున్న ఇబ్బందులపై ఈ పత్రిక వరుసగా ప్రచురించిన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. మున్సిపల్ ,ఆర్టీసీ అధికారులు శనివారం భారీ బందోబస్తు మధ్య రంగంలోకి దిగి రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను పూర్తిగా తొలగించారు.
అక్షరానికి లభించిన విజయం..
పరకాల బస్టాండ్ సెంటర్లో తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారాలు ప్రధాన రహదారిని చుట్టుముట్టడంతో రాకపోకలు నరకప్రాయంగా మారాయి. గత నెల 31న ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటనను ‘నవతెలంగాణ’ అత్యంత ప్రాధాన్యతతో ప్రచురించింది. “అడ్డంగా తోపుడు బండ్లు.. మృత్యువై వచ్చిన బస్సు” అంటూ ప్రమాదానికి గల మూల కారణాలను ఎండగట్టింది. దీనికి ముందే మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, పత్రికా కథనాల ఒత్తిడితో అధికారులు క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించారు
రంగంలోకి అధికార యంత్రాంగం..
మున్సిపల్ కమిషనర్ ఎస్. అంజయ్య, ఆర్టీసీ డీఎం ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం నుండే బస్టాండ్ పరిసరాలను జల్లెడ పట్టారు. రహదారికి ఇరువైపులా, మలుపుల వద్ద అడ్డంగా ఉన్న తోపుడు బండ్లను, షెడ్లను తొలగించారు. “ఇకపై రోడ్లపై వ్యాపారాలు చేస్తే సామాగ్రి జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం” అని మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
ప్రజల హర్షం..
రోడ్డు ఆక్రమణలు తొలగిపోవడంతో పరకాల బస్టాండ్ సెంటర్ ఇప్పుడు విశాలంగా కనిపిస్తోంది. బస్సుల రాకపోకలకు ఆటంకం కలగకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్లు, సామాన్య ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కదిలించి, సామాన్యుల సమస్యకు పరిష్కారం చూపేలా వరుస కథనాలు రాసిన ‘నవతెలంగాణ’ పత్రికను పట్టణ ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇదే పట్టుదలతో భవిష్యత్తులోనూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ మార్పును శాశ్వతం చేయాలని కోరుతున్నారు.



