ఐదు ఫ్రాంచైజీలు, 22 మ్యాచ్‌లు
ఫిబ్రవరి 7న ఫైనల్
నవీ ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) సీజన్-4కు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలో జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో ఈ సీజన్ ప్రారంభం కానుండగా.. ఐదు ఫ్రాంచైజీల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి ఒక్కో జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండేసిసార్లు తలపడనుండగా.. గ్రూప్ టాపర్ జట్టు నేరుగా ఫైనల్ బెర్త్ దక్కించుకోనుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లే-ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌కై ఫైనల్‌కు చేరిన జట్టుతో తలపడనుంది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్‌లలో ముంబయి ఇండియన్స్‌దే హవా. ఆ జట్టు ఏకంగా రెండుసార్లు(2023, 2025)లో టైటిళ్లను కైవసం చేసుకోగా.. 2024లో టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. గుజరాత్ జెయింట్స్, యుపి వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తొలి మూడు సీజన్‌లలో ఆడినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ముంబయి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, బెంగళూరు కెప్టెన్‌గా మంధాన, ఢిల్లీ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్, గుజరాత్ కెప్టెన్‌గా అస్టీ గార్డినర్, యుపి కెప్టెన్‌గా మెగ్ లానింగ్ వ్యవహరిస్తున్నారు.
మూడు సీజన్ల రన్నరప్ ఢిల్లీ..
డబ్ల్యుపిఎల్ లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌దే హవా. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్‌లలోనూ లీగ్ దశలో ఆ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఏకంగా మూడుసార్లు టాప్‌లో నిలిచి నేరుగా ఫైనల్‌కు చేరింది. కానీ తుది పోరులో ఓడి మూడుసార్లు రన్నరప్‌కే పరిమితమైంది. లీగ్ దశలో చెలరేగి ఆడే ఢిల్లీ.. తుది పోరులో బోల్తా పడడం ఆనవాతిగా వస్తోంది. ఈసారి ఆ ఫోబియోను అధిగమించి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2023, 2024, 2025 సీజన్ టాపర్‌గా ఢిల్లీ నిలిచిన ఢిల్లీ.. టైటిల్ పోరులో మూడుసార్లూ ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. ఈసారైనా టైటిల్ చేజిక్కించుకోవాలన్న కసితో ఆ జట్టు సిద్ధమైంది.



