Thursday, January 8, 2026
E-PAPER
Homeఖమ్మంనీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం..

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం..

- Advertisement -

కూలిపోయిన రాపల్లి మైనర్ కల్వర్టు 
దాన్యం, మిర్చిపై పడిన సాగర్ నీళ్లు 
తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోసుకుంటున్న అన్నదాతలు 
నీటిపారుదల శాఖ అధికారులపై రైతుల ఆగ్రహం
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని రాపల్లి మైనర్ కాలువ కల్వర్టు సీతానగరం వద్ద మంగళవారం అర్ధరాత్రి కూలిపోయింది. దీంతో సాగర్ నీళ్లు పక్కనే గల ధాన్యం మిర్చి పై పడ్డాయి. బుధవారం ఉదయం పొలాలకు వెళ్ళగా కల్లాలలో ఉన్న దాన్యం, మిర్చి తడిసిపోయి ఉంది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటూ నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాపల్లి మైనర్ సీతానగరం గ్రామం ప్రక్కనుంచి వెళ్తుంది. ఈ రాపల్లి మైనర్ వైరా మండల పరిధిలో నుంచి వస్తుంది. అయితే వైరా మండల పరిధిలో వరకు రాపల్లి మైనర్ కాలువ మరమ్మత్తు పనులు వేసవికాలంలో నిర్వహించారు.

కానీ బోనకల్లు మండల పరిధిలోగల రాపల్లి మైనర్ కాలువ మరమ్మత్తు పనులు నిర్వహించలేదు. ఈ క్రమంలో పది రోజుల క్రితం రాపల్లి మైనర్ కు సీతానగరం వద్ద గండి పడింది. ఈ సమయంలో సాగర్ నీరు పక్కనే గల పంట పొలాలపై పడి కొంత వరకు నష్టం చేకూర్చింది. దీంతో ఆ గ్రామ సర్పంచ్ కొమ్మ గిరి బిక్షమయ్య మాజీ ఉపసర్పంచ్ మేకల శరత్ బాబు ఆ వెంటనే బోనకల్ నీటిపారుల శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే మరుసటి రోజు బోనకల్ సబ్ డివిజన్ డి ఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, సంబంధిత ఏఈ కలిసి రెండు రోజులలో గండిని పూడ్చారు. గండిని పూడ్చిన కేవలం పది రోజుల వ్యవధిలోనే అదే సీతానగరం సమీపంలో మరో కల్వర్టు కూలిపోయింది.

అనేక మంది రైతులు పొలాలలో కల్లాలు చేసుకొని ధాన్యం, మిర్చి పంట ఆరబెట్టుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి రాపల్లి మైనర్ కల్వర్టు కూలిపోయింది. దీంతో సాగర్ నీరు ఒక్కసారిగా కాలువ పక్కన గల కల్లాలో ఉన్న ధాన్యం, మిర్చి పంటపై పడింది. బొమ్మగాని నరసింహారావు, వేల్పుల మంగయ్య, వేల్పుల గటకయ్య లకు చెందిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. అదేవిధంగా చంగల ముత్తయ్య, గంజినబోయిన రామయ్య కు చెందిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. అయితే బుధవారం ఉదయం రైతులు తమకల్లాల వద్దకు వెళ్లగా ఆ కల్లాలలో సాగర్ నీరు చేరి ఉంది. దీంతో అన్నదాత లబోదిబోమంటూ నీళ్లల్లో తడిసిన ధాన్యాన్ని మరొక చోటకు తరలించారు. బొమ్మగాని నరసింహారావుకు చెందిన మూడు ఎకరాలు వేల్పుల మంగయ్యకి చెందిన ఎకరంన్నర, వేల్పుల గటక య్యకు చెందిన రెండు ఎకరాల ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. అదేవిధంగా గంజనబోయిన రామయ్యకు చెందిన రెండు ఎకరాల మిర్చి పంట, చంగల ముత్తయ్యకి చెందిన నాలుగు ఎకరాలు మిర్చి పంట కూడా తడిసిపోయింది అని తెలిపారు.

తడిసిపోయిన దాన్యం మిర్చి పంటను మరోచోటకు తరలించామని అయినా దాదాపు మొత్తం పంట తడిసిపోయిందని బాధిత రైతులు నరసింహారావు, మంగయ్య, ముత్తయ్య, రామయ్య, గటకయ్య తెలిపారు. అంతా మంచిగా ఉన్న పంటనే ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులు ఏదో ఒక కిరికిరి పెడుతున్నారని అలాంటప్పుడు తడిసిన పంట కొంటారో కొనరోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరా మండల పరిధి వరకు ఈ కాలువకు మరమ్మత్తులు పనిచేశారని, బోనకల్ మండల పరిధిలో కాలువకు మరమ్మతులు ఎందుకు చేయలేదని, దాని ఫలితంగానే ప్రస్తుతం చేతికి వచ్చిన మా పంటలు సాగర కాలువ పాలయాయాన్ని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయమే బోనకల్ నీటిపారుదల శాఖ అధికారులకు కాలువ కల్వర్టు కూలిపోయిన సమాచారాన్ని అందించామని అయినా బుధవారం సాయంత్రం వరకు నీటిపారుదల శాఖ అధికారులు రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాపల్లి మైనర్ కింద సీతానగరం గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులకు చెందిన 250 నుంచి 300 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేసామని రైతులు తెలిపారు. వారం రోజులుగా సాగర్ నీరు రావడంలేదని తెలిపారు. కూలిపోయిన కల్వర్టు మరమ్మత్తు పనులు వెంటనే చేయకపోతే సాగుచేసిన మొక్కజొన్న పంట మొత్తం సాగర్ నీరు రాకపోతే ఎండిపోయే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కాలువ కల్వర్టు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించకపోతే కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని సీతానగరం అన్నదాతలు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -