Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'నవ'చైతన్యంతో...

‘నవ’చైతన్యంతో…

- Advertisement -

‘పత్రిక అంటే ప్రచారకుడే కాదు.. ఆందోళనకారుడు కూడా’ అన్నారు రష్యా విప్లవకారుడు లెనిన్‌. అందుకు సజీవ సాక్ష్యం నవతెలంగాణ. ఎందుకంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించాక ఎన్నో ఒడిదుడుకులు, కక్షసాధింపు ధోరణులను ఎదుర్కొని పోరాడి నిలబడిన పత్రిక ఏదైనా ఉందంటే అది నవతెలంగాణ. ప్రజా సమస్యలను నిరంతరం సాక్షాత్కరించే ఈ పత్రికను ఛాంపియన్‌ను చేసింది పౌర సమాజం. దీనికి పెట్టుబడిదారులు లేరు. జనమే వారసత్వం, ప్రజాస్వామ్యమే పునాది. నిఖార్సయిన జర్నలిజం, నిబద్ధతతో కూడిన సిబ్బంది, విలేకర్ల అంకితభావం పత్రికకు కొండంత ధైర్యం. అందుకే ఎవరికీ భయపడకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొగ్గకుండా తెలంగాణ ప్రజల మౌలిక అవసరాలపై కూడు, గూడు, నీడపై కేంద్రీకరించి నిరంతరం పేదల పక్షాన అక్షర సమరం చేస్తున్నది. అనుదినం..జనస్వరంతో పది వసంతాలు పూర్తిచేసుకుని సగర్వంగా పదకొండో వసంతంలోకి అడుగుపెట్టింది.
కాలంతో పాటు ఫ్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఎన్నో మార్పులొచ్చాయి. యూట్యూబ్‌ ఛానళ్లు పెరిగాయి. సోషల్‌ మీడియాలో ఎవరికి వారే నచ్చింది రాసుకుంటున్నారు. అవసరమే కావచ్చు. కానీ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన పత్రికలు బడాబాబులకు కొమ్ముకాస్తున్న పరిస్థితిని కూడా గమనించాలి. ప్రజలచేత ఎన్ను కోబడిన పాలకులు వారి బాగోగులు పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తే తట్టిలేపాల్సిన బాధ్యత పత్రికలది. కానీ దాన్నే విస్మరిస్తే ప్రజల బాధలు ఎవరికి చెప్పుకోవాలి?వారి జీవితాలు ఏం కావాలి? అవును..ప్రశ్నిస్తే ప్రకటనలు ఇవ్వరేమోనని ఆందోళన. ‘జీ హుజూర్‌’ అంటూ వార్తలు రాస్తూ దిగజారుతున్న దుస్థితి. కానీ నవతెలంగాణ వంటి నిజాయితీ గల పత్రికకు ప్రజలతోనే పని, వారి సంక్షేమమే విధి. అందుకే సమాజంలో పెచ్చుమీరుతున్న కులవివక్ష, అణచివేత, అంటరానితనం, శ్రమదోపిడీ, మూఢత్వం, మతతత్వం, విద్వేషాలకు వ్యతిరేకంగా నిత్యం గళం విప్పుతున్నది. పాలకవర్గాలను ప్రశ్నిస్తున్నది. జనం గుండెచప్పుడును ప్రభుత్వాలకు వినిపిస్తున్నది.
దేశంలో ఉపాధి లేమి, నిరుద్యోగం, దారిద్య్రం పెల్లుబుకుతున్న తరుణంలో ప్రజాఉద్యమాలు పెరగడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో పాలకుల అణిచివేత రెట్టింపుస్థాయిలో ఉండేది కూడా అంతే నిజం! కానీ ప్రశ్నించకుండా ఉండగలమా? మనుషులు తమ సమస్యలకు పరి ష్కారం జన సమూహంలో తప్ప ఎక్కడా దొరకదు. సామాజిక, ఆర్థిక, రాజకీయాల్ని అర్థం చేసుకోవడం ద్వారానే అది మన హక్కుల్ని కాపాడు కుంటామనేది సత్యం. మరి అది ఎలా వస్తుంది? నిరంతరం ఆలోచనలు చైతన్యం ద్వారా వాళ్లు గ్రహించడం. ఆ గ్రహించిన దాన్ని తమ జీవిత ఆచరణలోకి తీసుకురావడం, కొత్త అంశాలపై చర్చకు పదును పెట్టడం, తద్వారా జరిగిన మార్పు చేర్పులను తిరిగి ఆచరణ ద్వారా సమాజానికి అందించడం. ఈ నిరంతర ఘర్షణ, నిత్య ఆచరణ మాత్రమే సామాజిక మార్పునకు, వ్యక్తి పరిపూర్ణ అర్థానికి తీసుకెళ్తుంది. నేడు ప్రశ్నించేవారిని శత్రువుగా చేసుకునే ధోరణి పెరిగింది. చాలామంది జర్నలిస్టులు, సాహితీ కారులు, హక్కుల కార్యకర్తలు అకారణంగా శిక్షలు అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది.ఇలాంటి సున్నితమైన, విపత్కర సమయంలో ప్రజల అప్రమత్తత మరింత పెరగాలి. మతం మాటున జరుగుతున్న అరాచకాల్ని, అధికార వ్యామోహాన్ని గమనించాలి. స్వేచ్ఛ కోసం నిజాంపై నిప్పులు చెరిగిన షోయబుల్లాఖాన్‌ రక్తం చిందిన నేల ఇది. ఆ చారిత్రక వారసత్వంతో ముందుకు సాగుతున్నది నవతెలంగాణ.
నేడు కులాల కుంపట్లు, మతాల మంటలు పెట్టి చలికాచుకునే రాజకీయం పెరిగింది. ఇది మనిషిని పూర్తిగా వ్యక్తి గత పరమాణువుగా చేస్తుంది. తాను అంటే తన కులమేనని, తాను అంటే తన మతమేనని స్థాయికి దిగజారుస్తుంది.ఈ పరిణామ క్రమంలోనే మనిషి స్వాభావికమైన ఆలోచన చైతన్యం మసకబారుతుంది. అలాంటప్పుడు మనుషుల మధ్య ఈ అంతరాల చీకట్లను తొలగించేందుకు దిక్సూచి లాంటి లాంతరు కావాలి. ఆ వెలుతురు నవ తెలంగాణ రూపంలో మీకు దారి చూపిస్తుంది. అంధకారం నుంచి మిమ్నల్ని బయటకు లాగుతుంది. అందుకే, బాధ్యతగల సమాజం కోసం నీవు తపిస్తే గనుక లక్షలాది సైన్యంగా నీవెంట నడుస్తుంది నవతెలంగాణ. అసమానతలు లేని అభ్యుదయం వైపు నీవుసాగితే నిత్యప్రేరణగా నిలుస్తుంది నవతెలంగాణ.

నమిలికొండ అజయ్‌ కుమార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -