Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంవిదేశీ దరఖాస్తులకే కొత్త ఫీజు

విదేశీ దరఖాస్తులకే కొత్త ఫీజు

- Advertisement -

ఎఫ్‌-1, ఎల్‌-1 వీసాదారులకు వర్తించదు : అమెరికా నిర్ణయం
న్యూఢిల్లీ :
భారతీయులు సహా ప్రస్తుతం అమెరికా వీసాలు ఉన్న వారందరికీ ఊరట కలిగిస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇతర వీసాలు ఉండి, హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఇటీవల ప్రకటించిన విధంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) దీపావళి పండుగ వేళ తీపి కబురు అందించింది. ఈ మేరకు సోమవారం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం…ఎఫ్‌-1 వీసాలు ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్‌-1 వీసాలు ఉన్న నిపుణులు హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాలు ఉన్న వారిని సైతం వాటి నవీకరణ సమయంలో ఈ ఫీజు నుంచి మినహాయించారు. మరో మాటలో చెప్పాలంటే ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారు పెంచిన ఫీజు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చే దరఖాస్తులకే ఆ ఫీజు వర్తిస్తుంది. సెప్టెంబర్‌ 20వ తేదీన జారీ చేసిన ఆదేశం ద్వారా ట్రంప్‌ కొత్తగా లక్ష డాలర్ల ఫీజు నిబంధనను ప్రవేశపెట్టారు. సెప్టెంబర్‌ 21 నుంచి హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత యూఎస ్‌సీఐఎస్‌ అనేక మార్గదర్శకాలు నిర్దేశించింది. ప్రస్తుతం వీసాలు ఉన్న వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది కానీ ప్రత్యేకంగా వివరాలేవీ ఇవ్వలేదు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకంలో దీనిపై స్పష్టత ఇచ్చింది. గతంలో జారీ చేసిన లేదా ప్రస్తుతం చెల్లుబాటవుతున్న హెచ్‌-1బీ వీసాలకు, సెప్టెంబర్‌ 21వ తేదీకి ముందు సమర్పించిన దరఖాస్తులకు ఈ ఫీజు వర్తించదని తెలియజేసింది. అంటే ట్రంప్‌ ఆదేశం వెలువడిన సెప్టెంబర్‌ 21 నాటికి అమెరికాలో ఉన్న వారు కొత్త ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులకే ఈ ఫీజు వర్తిస్తుంది. అంతేకాక హెచ్‌-1బీ వీసాలు ఉన్న వారు లేదా వారి విదేశీ లబ్దిదారు దరఖాస్తుల అనుమతి తర్వాత అమెరికాలోనూ, అమెరికా వెలుపల ప్రయాణించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -