Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకం

15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకం

- Advertisement -

ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సమావేశంలో నిర్ణయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మరో పదిహేను రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్‌) ప్రారంభించాలని ఎంప్లాయిస్‌ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సమావేశం నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సీవీ ఆనంద్‌, మహేశ్‌ దత్‌ ఎక్కా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూలతో పాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నూతన హెల్త్‌ స్కీమ్‌కు ఉద్యోగుల బేసిక్‌ శాలరీలో 1.5 శాతం మొత్తాన్ని, ప్రభుత్వం తరఫున 1.5 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో అంగీకరించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేసి, ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం లు ప్రకటించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు.

ఈ సందర్భంగా ఈ నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం వివరాలను క్రిస్టీనా చొంగ్తూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. వీరిలో నాలుగవ తరగతి ఉద్యోగులు, నాన్‌ గెజిటెడ్‌, గెజిటెడ్‌, పెన్షనర్లు తమ బేసిక్‌-పేలో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదికి రూ.528 కోట్లు జమవుతాయనీ, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని వెల్లడించారు. ఈ ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్టు సీఈఓగా నియమిస్తారని తెలిపారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమనీ, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్‌ స్కీమ్‌ ఒక ముందడుగు అని చెప్పారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్‌ సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో టీఎన్‌జీఓ సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, టీజీఓ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ సెక్రటేరియేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌ దేవేందర్‌, పీఆర్‌టీయూకు చెందిన దామోదర్‌ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షులు వంగా రవీందర్‌ రెడ్డి, తెలంగాణ రిటైర్డ్‌ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షులు లక్ష్మయ్య, మహిళా అధ్యక్షురాలు ఉమా దేవి, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘానికి చెందిన నాగాంబ, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాస్య నాయక్‌, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షులు మోహన్‌ నారాయణ, కార్యదర్శి నర్స రాజు, తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర ట్రస్ట్‌చే నిర్వహణ : టీఎస్‌యూటీఎఫ్‌
ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పాల్గొని పలు సూచనలు చేశారు. ట్రస్ట్‌ స్వతంత్ర నిర్వహణలో ఉండాలనీ, నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగాలని కోరారు. ఉద్యోగుల వేతనాల స్థాయిని బట్టి వారి వాటా రూ.250 నుంచి రూ.1,000కి మించకుండా చూడాలని సూచించారు. దీర్ఘకాలిక రోగాలు, ప్రాణాపాయస్థితిలోకి నెట్టే వ్యాధుల విషయంలో ప్రత్యేక కేసుల్లో కవరేజీని పెంచేందుకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. మోడల్‌ స్కూల్స్‌, అన్ని రకాల గురుకులాలు, కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షా ఉద్యోగులతో సహా అన్ని క్యాటగిరీల వారు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ స్కీంను వర్తింంపజేయాలని సూచించారు. ఈ స్కీం వర్తించే ఆస్పత్రులు, కవరయ్యే ప్రొసీజర్ల వివరాలను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ఎంప్యానల్డ్‌ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ చికిత్సకు అవకాశం కల్పించాలనీ, సరిహద్దు జిల్లాల్లో ఉన్న లబ్దిదారులు అత్యవసర పరిస్థితిలో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందేందుకు వీలుండాలని కోరారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు : తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సెంట్రల్‌ అసోసియేషన్‌
రాబోయే 15 రోజుల్లో ఉద్యోగుల కోసం హెల్త్‌ స్కీంను అమలు చేయాలని నిర్ణయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సెంట్రల్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. సమావేశం అనంతరం అసోసియేషన్‌ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య సేవల కోసం అర్హత కలిగిన 515 ఆస్పత్రులను గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలీస్‌ శాఖకు ఆరోగ్య భద్రత స్కీం కింద, ఎక్సైజ్‌ శాఖకు సహాయత స్కీం కింద ఆరోగ్య పథకాలు అమల్లో ఉన్నాయనీ, భవిష్యత్‌లో ఆ శాఖల ఉద్యోగులను కూడా ఈహెచ్‌ఎస్‌ పథకంలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులకు వర్తింపజేయాలి : తరాల జగదీష్‌
ఈహెచ్‌ఎస్‌ను మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని పీఎంటీఏ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ”ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాల సిబ్బందికి పథకం ప్రారంభమైన తర్వాత ట్రస్టులో తీర్మానం చేసి వర్తింపజేస్తారు” అని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

నగదురహిత వైద్యం అందించాలి : టీఎస్పీటీఏ
ఉద్యోగుల వాటాతో నిమిత్తం లేకుండా పూర్తిగా నగదు రహిత వైద్యం అందించాలని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్పీటీఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, ఆర్‌.రోహిత్‌ నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల వాటాతో స్కీం అమలు చేసేందుకైతే 12 ఏండ్లు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -