కుల్సుమ్ షాదాబ్ వహాబ్… అప్పటి వరకు ఆమెకు పరిచయం లేని యాసిడ్ బాధితుల బాధ ఆమెను కదిలించి వేసింది. అలాంటి వారి కోసం ఏదో చేయాలనే తపన మొదలయింది. హోతూర్ ఫౌండేషన్ ఆమె తపనకు మద్దతు ఇచ్చింది. ఆమె స్థాపించిన మిలన్ ఫ్యాషన్ వీక్ ఇప్పుడు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇస్తోంది. యాసిడ్ దాడి బాధితులకు ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత కోసం, అవకాశాలను అందించడం కోసం వారికి మద్దతు ఇస్తుంది. ఇది మిలన్ ఫ్యాషన్ వీక్‌లో ఈ బాధితులకు సహాయం చేయడానికి ఫీనిక్స్ సర్కిల్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది.
2009లో బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ కారిడార్లలో వికలాంగ పిల్లల కోసం ఆర్ట్ థెరపీ సెషన్‌ను నిర్వహిస్తున్నప్పుడు కుల్సుమ్ షాదాబ్ వహాబ్ ఒక మహిళను చూశారు. ఆమె ముఖం భయంకరమైన హింసను మనకు చూపిస్తుంది. ఆమె యాసిడ్ దాడి బాధితురాలు. అయితే ఆ సమయంలో కుల్సుమ్‌కు ఆ పదంతో అసలు పరిచయమే లేదు. ‘ఆమెను చూసిన తర్వాత నేను చాలా అమాయకంగా ఉన్నాననిపించింది. అప్పటి వరకు యాసిడ్ దాడి అంటే ఏమిటో నాకు తెలియదు. నేను అక్కడి నర్సును అడిగాను, ‘అది ఏమిటి? అది ఎలా జరుగుతుంది?’ అని. ఈ ఘటన మేముంటున్న వెనుక ప్రాంగణంలోనే జరిగింది. కానీ దాని గురించి మాకు తెలియదు’ అంటూ కుల్సున్ పంచుకున్నారు.
తనదైన మార్గం
ఆసుపత్రిలో జరిగిన ఆ ఎన్‌కౌంటర్ ఇప్పుడు మిలన్ ఫ్యాషన్ వీక్‌లో ఒక ఉద్యమాన్ని రగిలించింది. భారతదేశం అంతటా 123 మందికి పైగా బాధితులకు సాధికారత కల్పిస్తోంది. యాసిడ్ దాడి బాధితుల న్యాయం, గౌరవం కోసం పోరాడుతున్న ప్రపంచ మిత్రుల సంఘాన్ని సృష్టించింది. కుల్సున్ భర్త 90ల ప్రారంభంలో హోతర్ ఫౌండేషన్ విద్య, వైద్య సహాయంతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. ఫౌండేషన్‌లో చేరిన తర్వాత కుల్సున్ తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. దేశమంతటా ‘కలర్స్ ఆఫ్ హోప్’ కేంద్రాలను ప్రారంభించారు. ఇది వైకల్యాలున్న పిల్లలను, వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన వారిని శక్తివంతం చేయడానికి కళను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది.
జీవితకాల మిషన్
ఫౌండేషన్ పనుల్లో భాగంగా ఆసుపత్రులను సందర్శించేటప్పుడు, శస్త్రచికిత్సలకు మద్దతు ఇస్తున్నప్పుడు, రోగులు దుర్బలత్వ క్షణాల్లో ఉన్నప్పుడు కుల్సున్ మొదటి బాధితురాలిని కలిశారు. ఆ మహిళ చాలా తీవ్రంగా కాలిపోయింది. తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని ఆమె ఎవరినీ కలవడానికి ఇష్టపడడంలేదు. ‘ఇలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని ఆమె నాకు చెప్పింది’ అని కుల్సున్ గుర్తుచేసుకున్నారు. ఇది జీవితకాల మిషన్‌కు ప్రారంభం మాత్రమే అని ఆమె భావించారు. ప్రారంభంలో వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుల్సున్ తన పనిని ప్రారంభించారు. ఎందుకంటే ఇటువంటి మహిళలకు జీవించడానికి, వారి కుటుంబాలను పోషించుకోడానికి ఎటువంటి మార్గాలు లేవు. కానీ ఆ డబ్బును ఆ మహిళల తాగుబోతు భర్తలు తీసుకుంటున్నారని, వారికి ఏమీ లేకుండా పోతుందని ఆమె అతి త్వరలోనే గ్రహించారు.
వేరే వ్యూహం అవసరం
‘యాసిడ్ బాధితులకు సమాజంలో ఎటువంటి గౌరవం లేదని గుర్తించాను. వారు అర్థం చేసుకుని, తమ కోసం తాము పనులు చేసుకునేందుకు, తమని తాము విలువైనవారిగా భావించే వేదికను నేను వారికి ఇవ్వాలి’ అని ఆమె చెప్పారు. మొదట్లో ఐదుగురు మహిళలతో కూడిన చిన్న సమూహంతో కుల్సున్ వారి నైపుణ్యాలను తెలుసుకునేందుకు చిన్న వర్క్‌షాప్‌లను ప్రారంభించారు. కొందరు గాజులు తయారు చేయడంలో, మరికొందరు బుట్టలను నేయడంలో తమ పని తనాన్ని చూపించారు. అలాగే కుష్టు వ్యాధి కాలనీలో పని చేస్తున్నప్పుడు, ఉపాధి కోసం సంచులను తయారు చేస్తున్నప్పుడు, కుట్టుపనిలో రాణించిన అనేక మందిని ఆమె గమనించారు.
బాధను అనుభవిస్తూనే…
ఒకసారి కుల్సున్ తన తలపాగాను కొన్ని స్క్రాప్ ఫాబ్రిక్‌తో టేబుల్‌పై ఉంచారు. మహిళలు దాన్ని అనుకరించారు. ఒక ఇటాలియన్ సందర్శకుడు అది గమనించాడు. త్వరలోనే 2019లో తన మొదటి సేకరణను ప్రదర్శించడానికి కెమెరా మోడా (మిలన్ ఫ్యాషన్ వీక్ కోసం)కి ఆమెకు ఆహ్వానం అందింది. 2019లో అరా లూమియర్ అనే ఫ్యాషన్ బ్రాండ్ పుట్టింది. ఇక్కడ ప్రతి కలెక్షన్ ఒక కథను చెబుతుంది. భయంకరమైన బాధను అనుభవిస్తున్న, నిరాదరణకు గురౌతున్న ఎన్నో చేతులు వీటిని రూపొందిస్తున్నాయి. దాని ఇటీవలి కలెక్షన్ ‘రివోవెన్ రెసిలెన్స్’. వందేండ్లకు పైగా మనుగడలో ఉన్న హెరిటేజ్ చీరలను తీసుకొని వాటిని అద్భుతమైన బ్లేజర్‌లుగా మార్చింది. ఈ కలెక్షన్ మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అమ్ముడైంది.
కొత్త మార్గాల కోసం…
ఈ ఉద్యమాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే సరసమైన లగ్జరీ బ్రాండ్ అయిన అరా ప్రెట్‌ను కూడా కుల్సున్ ఈ ఏడాది ప్రారంభించారు. ‘ప్రతి స్త్రీ కూడా అరా లూమియర్‌లో భాగం కాగలదని, ఈ ఉద్యమంలో భాగం పంచుకోగలదని, మానవత్వంలో భాగం కాగలదని నేను కోరుకుంటున్నాను’ అని ఆమె అంటున్నారు. గత నెల మిలన్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె ఒక సాయంత్రం ఫీనిక్స్ సర్కిల్‌ను ఆవిష్కరించారు. ఇది ఫ్యాషన్ పరిశ్రమలోని ప్రముఖులను ఒకచోటకు చేర్చింది. నేడు భారతదేశం అంతటా 123 మంది ప్రాణాలతో బయటపడిన యాసిడ్ బాధితులు అరా లూమియర్‌తో కలిసి పనిచేస్తున్నారు. కొందరు ఎంబ్రాయిడర్లు, మరికొందరు బటన్లు, కటింగ్‌ను నిర్వహిస్తారు. చాలామంది చేతులు, ఎముకలు లేకుండా వేళ్లను కదిలిస్తున్నారు. బతకడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి అనుమతించబడని వారికి కుల్సున్ వారి వద్దకే యంత్రాలను తీసుకువస్తారు.
నొప్పితో కూడిన జీవితం
‘మేము ఒక బ్లాక్ ప్రింటింగ్ యూనిట్‌ను కూడా ప్రారంభించాము. వారికి సాధికారత కల్పించడానికి, వారికి ఎందులో నైపుణ్యం ఉందో అందులో చురుగ్గా చేయడానికి వివిధ మార్గాలను కనుగొంటాము’ అని ఆమె చెప్పారు. ప్రాణాలతో బయటపడినా వారి జీవితం తరచుగా సుదీర్ఘమైన నొప్పితో ఉంటుంది. ఒక సంఘటన మరొకదాని కంటే వినాశకరమైనది. ముఖం మొత్తం కాలిపోయి, ఒక కన్ను పూర్తిగా పోయిన ఒక మహిళ గురించి కుల్సున్ మాట్లాడుతూ ‘మేము ఆమెకు పునర్నిర్మాణ శస్త్రచికిత్సలకు సహాయం చేశాము. ఆమె బ్యూటీషియన్, మోడల్ కావాలనే తన కల గురించి మాతో పంచుకుంది. శస్త్రచికిత్సలు పూర్తయిన తర్వాత ముంబైలో ఒక ప్రదర్శన కోసం మేము ఆమెను ర్యాంప్‌పైకి నడిపించాము. ఆమె ఇప్పుడు బ్యూటీషియన్ కూడా. అనేక ఇబ్బందులు రావడంతో ఆమె దాన్ని వదులుకోవాలనుకుంది. కానీ నేడు ఆమె ఒక సెలూన్ నడుపుతోంది. మేము ఆమెకు మద్దతు ఇస్తున్నాము’ అని ఆమె వివరించారు.
ప్రతి అంశంపై దృష్టి
మరొక మహిళపై ఒకే వ్యక్తి రెండుసార్లు యాసిడ్ దాడి చేశాడు. మరొకరిని ఆమె భర్త, అత్తమామలు ఐదు రోజుల పాటు నగంగా గదిలో బంధించి, ఆమెపై యాసిడ్ పోశారు. హోతూర్ ఫౌండేషన్ ద్వారా కుల్సున్ బాధితులను సమగ్రమైన, 360-డిగ్రీల విధానం ద్వారా జాగ్రత్తగా చూసుకుంటారు. వారు కోలుకునే ప్రతి అంశంపై దృష్టి పెడతారు. ఈ బృందం అటువంటి హింసకు మూల కారణాలను వెలికితీసేందుకు కూడా కృషి చేస్తోంది. యాసిడ్ దాడి నుండి కోలుకున్న తర్వాత వారికి పునరావాసం కల్పించడంలో సహాయపడటానికి అవసరమైన అన్నీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోరాడే శక్తి ఎలా వస్తుంది?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం 2023లో 207 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ 57 కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఎన్‌సీఆర్‌బీ డేటా కూడా న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని హైలైట్ చేస్తుంది. 2023లో మహిళలపై జరిగిన 735 యాసిడ్ దాడులు విచారణకు రాగా 649 కేసులు గతం నుండి పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా ఈ ఏడాది 86 కేసులు విచారణకు పంపబడ్డాయి. హృదయ విదారకమైన విషయం ఏమిటంటే మహిళలకు న్యాయం చాలా అరుదుగా లభిస్తుంది. వారిలో కొందరు నేరస్థులతోనే జీవించవలసి వస్తుంది. ‘వారు కోర్టులకు వెళ్లి పోరాడే అవకాశం ఉండదు. వారు కోర్టులకు వెళతారా లేదా శస్త్రచికిత్సల కోసం వెళతారా? డబ్బు ఎక్కడ ఉంది? మనుగడ సాగించడానికి డబ్బు లేనప్పుడు ఇక కోర్టు కేసులు ఎలా నడిపిస్తారు’ అని కుల్సున్ జతచేస్తున్నారు.
ప్రతి స్త్రీ పోరాడాలి
తన ప్రయాణంలో సవాళ్లు ఉన్నప్పటికీ కుల్సున్ తన లక్ష్యాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. నేడు అరా లూమియర్ రచనలు బ్రాండ్ వెబ్‌సైట్‌లో, మిలన్‌లోని మోడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆమె ఫీనిక్స్ సర్కిల్ ఒక ఉద్యమంగా ఎదగాలని, దాన్ని లండన్, యుఎస్‌తో పాటు ప్రతి దేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ‘నా శక్తిని మరెక్కడా ఉంచాలనుకోవడం లేదు. నేను దీన్ని మరింత బలంగా నిర్మించాలనుకుంటున్నాను. ఇది నా సొంతం అని నేను నమ్మను. మరింత మంది మహిళలు ఈ లక్ష్యంలో చేరి దాన్ని తమ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి స్త్రీ దీని కోసం పోరాడాలి’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
సలీమ



