– జీవో నెంబర్ 93ను సవరించి కల్లుగీత సొసైటీలకే ఇవ్వాలి
– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్
నవతెలంగాణ- సంగారెడ్డి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ లిక్కర్ కంపెనీలకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చి లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిని దెబ్బతీస్తుందని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.ఆశన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 15శాతం గౌడ్ లకు రిజర్వేషన్ వల్ల కొంతమంది గౌడ్ లకు ఉపయోగపడుతుంది తప్ప కల్లుగీత వృత్తి చేసే వాళ్లకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని కల్లుగీత కార్మిక సంఘం, గౌడ సంఘాలు ఆందోళన చేయగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడలకు 15శాతం రిజర్వేషన్స్ ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గతంలో కంటే ఎక్కువ 25 శాతం ఇస్తామని చెప్పి ఎప్పటిలాగానే 15శాతం ఇచ్చారన్నారు. ఏ ప్రయోజనం కోసం రిజర్వేషన్స్ ఇచ్చారో అది నెరవేరదని, ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 93ను సవరించి ఇచ్చిన హామీ ప్రకారము 25శాతం ఇవ్వాలని, అది కూడా కల్లుగీత సొసైటీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అంజా గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రసాద్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామ గౌడ్, నాగరాజుగౌడ్, శ్రీనివాస్ గౌడ్, హరీష్ గౌడ్, కృష్ణ గౌడ్, ప్రతాప్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రంగా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, నరసింహ గౌడ్, వెంకటేష్ గౌడ్, శివరాం గౌడ్, యాద గౌడ్, రవి గౌడ్, కుమార్ గౌడ్, గంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.