Monday, October 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునో కింగ్స్‌…

నో కింగ్స్‌…

- Advertisement -

మాకు రాజులెవరూ లేరు
ట్రంప్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
అమెరికాలోని 50 రాష్ట్రాలు, 2,500కి పైగా నగరాల్లో ఆందోళనలు
ప్రపంచవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
లక్షలాదిగా వీధుల్లోకి వచ్చిన ప్రజలు

నవతెలంగాణ న్యూస్‌ నెట్‌వర్క్‌
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ‘నో కింగ్స్‌’ నినాదంతో తమకు రాజులెవరూ లేరనీ, తాము సేవకులం కాదంటూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాలు, 2,500కి పైగా నగరాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి, ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌, చికాగో, లాస్‌ ఏంజిలీస్‌, బోస్టన్‌ సహా అనేక ప్రాంతాల్లో ఈ నిరసనల తీవ్రత అధికంగా ఉంది. ‘ప్రజలే రాజులు-మేం ఎవరికీ సేవకులం కాదు’ అంటూ యువతరం పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తోంది. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు ఈ ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ అందోళనలు, ఇప్పుడు దేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

యూకే,కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా. జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ వంటి దేశాల్లోనూ ‘నో కింగ్స్‌’ అంటూ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన జ్వాలలు, సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అధికార దుర్వినియోగం, ఇమ్మిగ్రేషన్‌ కఠిన నిబంధనలు, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు, ఫెడరల్‌ అధికార దుర్వినియోగం వంటి ట్రంప్‌ విపరీత చర్యల వల్ల ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని ఆందోళనల్లో భాగస్వాములవుతున్న ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలతో వైట్‌హౌస్‌ ఉలిక్కిపడింది. ట్రంప్‌ వ్యవహారశైలిపై సొంతపార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టకు భంగం కలుగుతోందంటూ వైట్‌హౌస్‌ ప్రతినిధులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదంతా అమెరికా వ్యతిరేకుల ప్రచారం అంటూ ట్రంప్‌ అనుకూలురు ప్రజాందోళనల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీ రాష్ట్రంలో వైట్‌హౌస్‌, నేషనల్‌ మాల్‌ ఎదుట ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా వేలాదిమంది ప్రదర్శనలు నిర్వహించారు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని న్యూయార్క్‌ సిటీ, అల్బనీ, వాల్‌స్ట్రీట్‌ ప్రాంతాల్లో ‘నో కింగ్స్‌ ఇన్‌ అమెరికా’ అనే బ్యానర్లతో భారీ ర్యాలీని నిర్వహించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, శాన్‌డియాగో నగరాల్లో జరిగిన ఆందోళనల్లో హాలీవుడ్‌ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ట్రంప్‌ రాజ్యవాద ధోరణిని విమర్శించారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌, ఆస్టిన్‌, డల్లాస్‌ నగరాల్లో నిరసనకారులకు, ట్రంప్‌ అనుచరులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని చికాగో నగరంలో ‘మేం అధ్యక్షుడిని ఎన్నుకున్నాం…రాజును కాదు’ అనే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫోరిడా రాష్ట్రంలోని మియామి, ఆర్లాండో నగరాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. మాసాచుసెట్స్‌ రాష్ట్రంలోని బోస్టన్‌ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో యూనివర్సిటీ విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో పర్యావరణ సంస్థలు కూడా నిరసనల్లో భాగస్వామ్యం అయ్యాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలోని పాత అమెరికన్‌ రాజ్యాంగ మ్యూజియం ఎదుట శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. మిచిగన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ పట్టణంలో ఆర్థిక సమస్యలపై ట్రంప్‌ వైఖరిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి.

మొత్తం 50 రాష్ట్రాల్లో ‘మేం ప్రజలం-సేవకులం కాదు’ అనే నినాదంతో ఆందోళనలు జరిగాయి. బ్రిటన్‌లోనూ ‘నో కింగ్స్‌’ ఆందోళనలు జరుగుతున్నాయి. లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రజలు ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు 300కు పైగా సంఘాలు తమ నిరసనలకు మద్దతు ఇస్తున్నాయని సోషల్‌ మీడియా ద్వారా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే ట్రంప్‌ చర్యల్ని న్యాయస్థానాల్లో సవాలు చేసేందుకు వీలుగా అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ వేలాది మంది వాలంటీర్లకు లీగల్‌ మార్షల్స్‌గా శిక్షణ ఇచ్చింది. సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌, కాంగ్రెస్‌ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్‌ సహా పలువురు ప్రగతిశీల నేతలు నిరసనలకు మద్దతు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, పలువురు సెలబ్రిటీలు కూడా ట్రంప్‌ విధానాలపై గళమెత్తారు.

అమెరికాలో నివసిస్తున్న వలసదారులను బలవంతంగా బయటికి వెళ్లగొట్టడం, పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిపిన విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ నిధులు ఇవ్వబోమని బెదిరించడం, డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో జాతీయ గార్డ్‌ దళాల మోహరింపునకు అనుమతించడం వంటి ట్రంప్‌ చర్యలన్నీ ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు సామాజిక విభజనను పెంచుతాయనీ, ప్రజాస్వామ్య సూత్రాలకు హాని కలిగిస్తాయంటూ నిరసనల్లో భాగస్వాములైన ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేశారు. ‘మాకు రాజులెవరూ లేరని అమెరికా ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. నిరసన తెలపడం మా హక్కు’ అని ‘నో కింగ్స్‌’ ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఇన్‌డివిజివ్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు లెV్‌ా గ్రీన్‌బర్గ్‌ చెప్పారు.

నిరంకుశత్వానికి వ్యతిరేకంగా శాంతియుత పద్ధతుల్లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నామని ఆమె తెలిపారు. ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో కూడా అమెరికాలో రెండు వేలకు పైగా ‘నో కింగ్‌’ ప్రదర్శనలు జరిగాయి. అవన్నీ దాదాపు శాంతియుతంగానే సాగాయి. ట్రంప్‌ 70వ పుట్టినరోజు వేడుకలు, వాషింగ్టన్‌లో సైనిక పెరేడ్‌ జరిగిన సమయంలో అప్పుడే ప్రజలు నిరసన నినాదాలు వినిపించారు. తాజా నిరసనలపై ట్రంప్‌ స్పందిస్తూ ‘వారు నన్ను ఓ రాజుగా భావిస్తున్నారు. కానీ నేను రాజును కాను’ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అమెరికా వ్యతిరేక నిరసనలనీ, డెమొక్రాట్లు అమెరికాపై విషం చిమ్మే ర్యాలీలు నిర్వహిస్తున్నారంటూ రిపబ్లికన్లలో కొందరు ట్రంప్‌ చర్యల్ని సమర్థించే ప్రకటనలు చేశారు.

మేల్కొన్న ప్రజాస్వామ్యం విశ్లేషకుల వ్యాఖ్య
‘నో కింగ్స్‌’ ఉద్యమం అమెరికా ప్రజాస్వామ్య ఆత్మను మళ్లీ మేల్కొలిపింది. ఇది కేవలం నిరసన కాదు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల నిబద్ధతకు నిదర్శనం,” అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా చరిత్రలో ఈ ఉద్యమం కొత్త మలుపుగా నిలవనుందని వారు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -