Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు

చట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు

- Advertisement -

హైడ్రా సహా అధికార యంత్రాంగం చట్ట పరిమితులు పెట్టొద్దు
హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైడ్రా కమిషనర్‌ సహా అధికార యంత్రాంగం చట్టానికి మించి వ్యవహరించే అధికారం ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని అతిక్రమించొద్దని కోరింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌ కలాన్‌లోని సర్వే నెంబర్లు 132, 133లో ఉన్న 650 చదరపు గజాల ప్లాట్‌ నెంబర్‌ 123/ఏను స్వాధీనం చేసుకున్న ఘటనపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలో ఉన్న వాటిలో ఎలా జోక్యం చేసుకుంటారని హైడ్రాను ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి పరిధిలోనే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న భూముల రక్షణ బాధ్యత కోర్టులదేననీ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూములను హైడ్రానే పర్యవేక్షించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే అనేక కేసుల్లో ఇదే అంశంపై సూచనలు చేసినప్పటికీ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడంలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి సందర్భంలోనూ కోర్టు ప్రత్యేకంగా హెచ్చరికలు ఇవ్వాల్సి వస్తుందా?అని ప్రశ్నించింది. తాజా పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హైడ్రా తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముసారాంబాగ్‌కు చెందిన పూర్ణిమ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారణ జరిపారు. హైడ్రా, ఇతర ప్రతివాదులు చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్‌ ఆరోపించారు.

భద్రాచలం ఆలయ వివాదంపై పిటిషన్‌
భద్రాచలంలోని శ్రీరామాలయంలో కొలువై ఉన్న విగ్రహం స్వరూపంపై కొనసాగుతున్న వివాదంలో హైకోర్టు సోమవారం కీలక సూచనలు చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లు విచారణకు అనర్హమా? కాదా? అన్న అంశాన్ని ముందుగా నిర్ణయించాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పిటిషనర్ల అర్హత, సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని దేవాదాయ శాఖ న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 2022లో దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆలయ చరిత్ర, పరంపరను ప్రస్తావిస్తూ తమ వాదనలు వినిపించారు. రెండు పక్షాల వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది.

బతుకమ్మ కుంటలో నిర్మాణాలు తొలగించాలి
– హైడ్రాకు హైకోర్టు ఆదేశం
బాగ్‌ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదాస్పద భూమిలో హైడ్రా చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు సోమవారం కఠినంగా స్పందించింది. స్టేటస్‌కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. అక్కడ నిర్మించిన కట్టడాలు, సూచిక బోర్డులు, ఇతర ఏర్పాట్లు నాలుగు వారాల వ్యవధిలో పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. ఈ చర్యల వల్ల ఆ భూమి హైడ్రా నియంత్రణలో ఉందనే భావన కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. సివిల్‌ అప్పీల్‌లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు గుర్తించిన ధర్మాసనం, హైడ్రా కమిషనర్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. అయినప్పటికీ శిక్షాత్మక చర్యలకు వెళ్లకుండా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించింది. వివాదాస్పద భూమిలో అనుమతించిన వరద నియంత్రణ పనులను మించిపోయి విస్తృత అభివృద్ధి పనులను చేపట్టారని కోర్టు గమనించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 27కు వాయిదా వేసింది.

ఫిరాయింపు కేసులో దానం నాగేందర్‌కు నోటీసు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించిన స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో దానం నాగేందర్‌తోపాటు స్పీకర్‌కు కూడా సోమవారం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మరో రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని విడిచినట్టేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయంలో లోపాలున్నాయని వాదించారు. వివరమైన ప్రతిస్పందనలు సమర్పించాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా వేసింది.

రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏప్రిల్‌ 9లోపు బకాయిలు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను నిర్దిష్ట గడువులోగా తప్పనిసరిగా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చేనెల తొమ్మిదో నాటికి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను విడుదల చేయాలని ఆదేశించింది. ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు నేరుగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చెల్లింపులు అందని సుమారు 2,600 మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలనీ, లేకపోతే ప్రతి కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన దాదాపు 654 ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ముఖ్యకార్యదర్శి హాజరు కాలేకపోతున్నారని పేర్కొంటూ మినహాయింపు కోరారు. అయితే న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో, సాయంత్రం సందీప్‌కుమార్‌ సుల్తానియా ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఆయన ప్రవర్తనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్క్రీన్‌పై కనిపిస్తున్న వ్యక్తి నిజంగా సందీప్‌కుమార్‌ సుల్తానియానేనా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ, కోర్టు ముందు హాజరయ్యే విధానంపై అధికారులకు సరైన అవగాహన లేదా?అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదా? అని తీవ్రంగా నిలదీసింది. అధికారులకు కోర్టు విధానాలు నేర్పించరా? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రయోజనాల కోసం దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వానికి ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిది నెలల గడువు ఇచ్చినా అమలు జరగకపోవడం వల్లే ఈ ధిక్కరణ పిటిషన్లు వచ్చాయని కోర్టు గుర్తుచేసింది. అయినప్పటికీ ఇంకా గడువు కోరడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే 80 మందికిపైగా లబ్ధిదారులు బకాయిలు పొందకుండానే మరణించారని ప్రస్తావించింది. కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించింది. దీనికి స్పందించిన సందీప్‌కుమార్‌ సుల్తానియా మొత్తం 3,656 మందికి టోకెన్లు జారీ చేశామనీ, అందులో 1,056 మందికి మాత్రమే చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,600 మందికి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈనెల 31లోపు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. నిధుల కొరత కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పగా, కోర్టు వెంటనే స్పందిస్తూ ఆ కారణం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట తేదీ చెప్పాలనీ, ఆ గడువులోగా చెల్లింపులు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తే సౌకర్యంగా ఉంటుందని సుల్తానియా అభ్యర్థించినా, ధర్మాసనం ఆ సూచనను తిరస్కరించింది. కోర్టు ఒత్తిడి చేస్తే ఈ నెలాఖరుకే చెల్లింపులు చేస్తామని చెప్పడం తగదనీ, ఇది ప్రభుత్వానికి తప్పనిసరి బాధ్యత అని వ్యాఖ్యానించింది. చివరగా వచ్చేనెల తొమ్మిదిన తుది గడువుగా నిర్ణయిస్తూ, ఆలోపు 2,600 మందికి చెల్లింపులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. ఈ గడువులోగా అమలు జరగకపోతే, అన్ని ధిక్కరణ పిటిషన్లలో సంబంధిత అధికారి వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -