ట్రంప్‌నకు వాటికన్ షాక్
అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం
యూఎన్ చేతిలోనే ఉండాలని స్పష్టీకరణ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు వాటికన్ షాకిచ్చింది. ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని వెల్లడించింది. అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కార బాధ్యత ప్రధానంగా ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)దేనని వాటికన్ అత్యున్నత దౌత్యాధికారి కార్డనల్ పియేట్రో పారోలిన్ స్పష్టం చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ అనే ట్రంప్ ప్రతిపాదన ప్రత్యేక స్వభావం కలిగినదనీ, అది సాధారణ దేశాల మధ్య వ్యవహారాల తరహాలో లేదని కార్డినల్ పారోలిన్ తెలిపారు. ఈ కారణంగా వాటికన్ ఈ బోర్డులో భాగస్వామ్యం కావడం లేదని స్పష్టం చేశారు. జనవరిలో ఈ బోర్డులో చేరాలని ప్రపంచంలోనే తొలి అమెరికన్ పోప్ అయిన పోప్ లియో 14కు ఆహ్వానం అందినప్పటికీ… వాటికన్ ఇప్పుడు తన స్పష్టమైన వైఖరిని ప్రకటించడం గమనార్హం. ట్రంప్ విధానాల్లో కొన్నింటిపై విమర్శలు చేసిన వ్యక్తిగా పోప్ లియో ఇప్పటికే గుర్తింపు పొందారు.
ట్రంప్ రూపొందించిన గాజా ప్రణాళికలో భాగంగా గత అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత… గాజా తాత్కాలిక పాలనను పర్యవేక్షించేందుకు ఈ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేయాలని భావించారు. అనంతరం తానే చైర్మెన్‌గా ఉండే ఈ బోర్డును ప్రపంచవ్యాప్తంగా ఇతర సంఘర్షణలను కూడా పరిష్కరించే వేదికగా విస్తరిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ బోర్డు తొలి సమావేశం గురువారం వాషింగ్టన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో గాజా పునర్నిర్మాణంపై చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఇటలీ, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాత్రం ఈ బోర్డులో సభ్యులుగా కాకుండా.. పరిశీలకులుగా మాత్రమే తమ ప్రతినిధులను పంపాలని నిర్ణయించాయి.
ఇలాంటి తరుణంలో కీలకమైన వాటికన్ నుంచి తాజా నిర్ణయం రావటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ట్రంప్ నిర్ణయంపై అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. ట్రంప్ స్వయంగా ఒక విదేశీ ప్రాంత పాలనను పర్యవేక్షించే బోర్డుకు నాయకత్వం వహించడం వలస పాలన నిర్మాణాన్ని తలపిస్తుందని విమర్శిస్తున్నారు. గతనెల ప్రారంభమైన ఈ బోర్డులో పాలస్తీనా ప్రతినిధి లేకపోవడం పైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ బోర్డు విషయమై ట్రంప్ ఆహ్వానాన్ని ఇతర ప్రపంచ దేశాలు కూడా జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. ఈ బోర్డు యూఎన్ పాత్రను బలహీనపర్చే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘బోర్డ్ ఆఫ్ పీస్’కు నో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



