Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుద్వితీయశ్రేణి పౌరులుగా హిందూయేతరులు

ద్వితీయశ్రేణి పౌరులుగా హిందూయేతరులు

- Advertisement -

వారి ఓటుహక్కును తొలగించే ప్రయత్నాలు
‘సర్‌’ లక్ష్యం అదే
మోడీ సర్కార్‌ కనుసన్నల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం
‘సుప్రీం’ తీర్పుల్నీ పట్టించుకోవట్లేదు
ఏపీసీఆర్‌ సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హిందూయేతరులను ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్తించడమే ‘సర్‌’ లక్ష్యమని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వారి ఓట్లను తొలగించబోరనే గ్యారెంటీ ఏమీ లేదని స్పష్టంచేశారు. అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ (ఏపీసీఆర్‌) తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ఇన్‌ తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్సీ) పేరుతో ప్రజల పౌరసత్వ నిర్ధారణను అస్సాంలో ప్రారంభించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత రావడంతో అవే అంశాలతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నేతృత్వంలో ‘సర్‌’ను తీసుకొచ్చారని వివరించారు. పౌరసత్వ నిర్థారణ బాధ్యత ఎన్నికల సంఘానిది కాదని 2004లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనీ, కానీ కేంద్రం, సీఈసీ వాటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్తున్నాయని తెలిపారు.

సీఈసీ స్వయంప్రతిపత్తి కల్గిన సంస్థ అని సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్నారు. సీఈసీ పూర్తిగా మోడీ సర్కార్‌ చెప్పుచేతల్లో ఉండిపోయిందనీ, దేశంలో ఎన్నికలు ఏ తేదీల్లో నిర్వహించాలో ఈసీకంటే ముందు బీజేపీ నాయకులే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌లో సర్‌ తర్వాత ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టారనీ, కానీ మిషన్‌ రీడబుల్‌ ఫార్మట్‌లో పెట్టలేమని సీఈసీ చేతులెత్తేసిందనీ, ఓట్‌చోరీ ఈ తిరకాసులోనే ఉందని వివరించారు. 1995లో మహారాష్ట్రలో ఇలాంటి చర్యలకే పాల్పడితే, ఆ కేసులో సుప్రీంకోర్టు సీఈసీ ప్రకటించిన 12 పత్రాలు లేనంతమాత్రాన ప్రజలు ఈదేశ పౌరులు కాకుండా పోతారా అని ప్రశ్నించిందని గుర్తుచేశారు. భారతదేశంలో రాచరికాలు లేవనీ, కానీ బీజేపీ అదే తరహాలో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ‘సర్‌’ లక్ష్యం నెరవేరట్లేదనీ, అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమ ఇష్టం వచ్చినట్టు ఓట్లను తొలగిస్తున్నారని అభ్యంతరం తెలిపారు.

‘సర్‌’పై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదనీ, తుదితీర్పు వచ్చే వరకు వేచిఉండాల్సిందేనని చెప్పారు. దేశంలో రాజ్యహింస పెరుగుతున్నదనీ, దానికి తెలంగాణలో ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4వేల మందితో సోషల్‌ మీడియా టీంలను ఏర్పాటు చేసిందనీ, బ్రిటీష్‌ వారి నినాదమైన విభజించు-పాలించు విధానంతో మతాలు, ప్రజల మధ్య విద్వేషాలు పెంచడమే లక్ష్యంగా ఈ సోషల్‌ మీడియా గ్రూపులు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆర్థికంగా ఆ దాడిని తట్టుకొనే శక్తి పౌరసమాజానికి లేదన్నారు. అందువల్ల గ్రామాలు, వార్డుల స్థాయిల్లో శాంతికమిటీలు (పీస్‌ ఆర్మీ) ఏర్పాటు చేసుకొని, వాటిద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నాలు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేవలం ప్రధాని మోడీ మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తారనే భ్రమల్ని హిందుత్వవాదులు చాలాకాలంగా సృష్టిస్తున్నారని తెలిపారు. భారత స్వాతంత్య్రోద్యమంలో జైళ్ల పాలయిన అనేకమంది ముస్లిం నాయకులు, యువతీ యువకుల పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశంలో పెరుగుతున్న విద్వేషాలపట్ల మేధావులు మౌనంగా ఉండటమే సమాజంలో అతిపెద్ద సమస్యగా ఉందని విశ్లేషించారు. ఏపీసీఆర్‌ మహారాష్ట్ర అధ్యక్షులు జస్టిస్‌ అభరుథిప్సే మాట్లాడుతూ ముస్లింలు జనాభాను పెంచి భారతదేశాన్ని ఆక్రమిస్తారనే భ్రమలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారనీ, ఆయా రాష్ట్రాల్లో జనభా లెక్కల్ని పరిశీలిస్తే, అదంతా ఒట్టిదేనని తేలిపోయిందని చెప్పారు. దేశంలో ఎన్‌కౌంటర్ల పేరుతో రాజ్యహింస పెరిగిందనీ, వీటిపై సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినా, అవేవీ ఈ హింసను నిరోధించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఏపీసీఆర్‌ సీనియర్‌ రీసెర్చర్‌ ఫయాజ్‌ షాహెన్‌ అధ్యక్షత వహించారు. ఏపీసీఆర్‌ జాతీయ కార్యదర్శి నదీంఖాన్‌ తదితరులు పాల్గంన్నారు. అంతకుముందు తెలంగాణలో పెరిగిన రాజ్యహింస, అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై జిల్లాల వారీగా రూపొందించిన ఏపీసీఆర్‌ నివేదికను ప్రశాంత్‌భూషణ్‌ ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -