నవతెలంగాణ – హైదరాబాద్: సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ (43) అనారోగ్యంతో నిజామాబాద్ పట్టణంలోని వెల్నెస్ హాస్పిటల్లో శుక్రవారం సాయంత్రం 4-20 ని.లకు ఊపిరితిత్తుల సమస్య, గుండెపోటుతో మృతి చెందారు. నూర్జహాన్ మరణం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. నూర్జహాన్ మృతి పట్ల సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
ఈరోజు మరణవార్త తెలిసిన అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ నూర్జహాన్ సంతాప సభ నిర్వహించి అమరజీవి చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్లతో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కమిటీ సభ్యులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
సంతాప సభలో చుక్క రాములు, పాలడుగు భాస్కర్లు మాట్లాడుతూ.. నూర్జహాన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకురాలు, జిల్లాలో బీడీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయితీ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ తదితర కార్మికుల సమస్యల పరిష్కారానికై పోరాటాలు సమరశీలంగా నడిపిన మిలిటెంట్ నాయకురాలు. అన్నిరకాల కార్మికులను ఐక్యంగా సంఘటితం చేయడంలో నూర్జహాన్ పాత్ర మరువలేనిది. ఆమె కార్మిక హక్కులు, రక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిపింది. నూర్జహాన్ మరణం నిజామాబాద్ జిల్లా కార్మికవర్గానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. నిజామాబాద్ ట్రేడ్ యూనియన్, ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణంలో కామ్రేడ్ నూర్జహాన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించారు.

నూర్జహాన్ చిన్ననాటి నుండే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆకర్షితురాలై అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. తన 8 నెలల పసిబిడ్డతో వరంగల్ సెంట్రల్ జైలులో 18 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపింది. పేదలకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు కావాలని చేసిన భూ పోరాటంలో కూడా పోలీసుల కేసులు, నిర్భంధాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసింది. కడదాకా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటు పడింది. కార్మికవర్గానికి, ప్రజా ఉద్యమాలకు ఆమె లేని లోటు తీరనిది అని అన్నారు.
విషయం తెలిపిన వెంటనే ఢిల్లీ నుండి సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా, ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీమ్, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు కె. హేమలత, కోశాధికారి ఎం. సాయిబాబు, జాతీయ కార్యదర్శి కె. ఎన్. ఉమేష్లు, సీఐటీయూ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య శ్రద్ధాంజలి ఘటించారు. కామ్రేడ్ నూర్జహాన్ మృతికి సంతాపం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. సుధాభాస్కర్, ఎస్వీ, రమ, వి. ఎస్. రావు, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ, ఎం. వెంకటేష్, పుప్పాల శ్రీకాంత్, కూరపాటి రమేష్, పాలడుగు సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఎ. సునీత, హైదరాబాద్ సీఐటీయూ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. దశరథ్, జె. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.



