వ్యంగ్యాస్త్రాలతో ‘సమాచార’ పోరు సాగిస్తున్న టెహ్రాన్
టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయిల్‌పై ఇరాన్ కేవలం క్షిపణులు, డ్రోన్లతోనే యుద్ధం చేయడం లేదు. మీమ్స్, ఏఐ వీడియోలతో ఇంటర్నెట్ను హోరెత్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ట్రంప్, ఇతర నేతలను వినోదం పంచే వారిగా చూపిస్తూ వీడియోలు రూపొందించింది. హార్ముజ్ జలసంధికి తానే రాజునంటూ ఓ వీడియోలో ప్రకటించుకుంది కూడా. వీటన్నింటినీ ఇరాన్ మీడియా సంస్థలు, వాటి అనుబంధ ఛానల్స్ విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నాయి. ట్రంప్‌ను, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల చర్యలను ఎండగట్టడమే ఈ వీడియోల ప్రధాన ఉద్దేశం. ఇరాన్ సాగిస్తున్న సమాచార యుద్ధం వంటిది మునుపెన్నడూ చూడలేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇజ్రాయిల్-అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగిస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఇరాన్ వద్ద లేదు. అయినప్పటికీ శత్రువులలో భయాందోళనలు రేకెత్తించడంలో ఇరాన్ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ఎందుకంటే ఇంధనం-నౌకాయాన పరిశ్రమ దాని ఆధీనంలోనే ఉంది. దీనితో పాటు ఇరాన్ జరుపుతున్న సమాచార పోరు కారణంగా యుద్ధం ఇప్పుడు చాలా ఖరీదైనదిగా, ప్రమాదకరమైనదిగా, గజిబిజిగా మారిపోయింది. దీనిని తట్టుకోలేకపోతున్న ట్రంప్ తాజాగా అమెరికా దాడులకు ఐదు రోజుల విరామం ప్రకటించారు. చర్చల గురించి ట్రంప్ చెబుతుంటే ఇరాన్ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘ఖొర్రంషెహర్-4 నేతృత్వంలోని దౌత్య ప్రతినిధి బృందం ఈ రాత్రి అసాధారణ రీతిలో సంప్రదింపులు జరుపుతుంది’ అంటూ ఎత్తిపొడిచింది. ఖొర్రంషెహర్-4 అంటే ఇరాన్‌కు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. యుద్ధంలో టెల్ అవీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ దీనిని ఉపయోగించింది. ఇరాన్ సాగిస్తున్న సమాచార యుద్ధం ట్రంప్‌నకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. హార్ముజ్ మీదుగా చైనా నౌక వెళుతుంటే మిగిలిన ఓడలు అక్కడే నిలిచిపోయినట్టు చూపించే ‘లార్డ్ ఆఫ్ స్ట్రెయిట్’ అనే వీడియో కూడా మంచి ప్రచారం పొందింది.
యుద్ధంలో ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లకు లెక్కే లేదు. ఇటీవలే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దిమోనా నగరంలోని ఇజ్రాయిల్ అణు కేంద్రాన్ని, అరద్ పట్టణాన్ని తాకింది. రెండు వేల కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న డిగో గార్సియాలోని అమెరికా-బ్రిటన్ స్థావరాలపై కూడా దీర్థ శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలలోని ఇంధన మౌలిక సదుపాయాలపై సైతం దాడులు జరిపింది. ఇజ్రాయిల్ విద్యుత్ ప్లాంట్లు, మధ్యప్రాచ్యంలోని అమెరికా ఆస్తులపై కూడా దాడులు చేస్తానని హెచ్చరిస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛెజ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన సందేశాన్ని ఓ స్టిక్కర్‌పై ముద్రించి దానిని బాలిస్టిక్ క్షిపణిపై అంటించి ఇజ్రాయిల్‌పై ప్రయోగించింది. యుద్ధ ప్రచారంలో భాగంగా ఇరాన్ తరచూ ఏఐ వీడియోలను ఉపయోగిస్తోంది.
మిస్సైళ్లే కాదు… మీమ్స్ కూడా ఆయుధాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



