Tuesday, November 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

- Advertisement -

అస్వస్థతతో హైదరాబాద్‌లో హఠాన్మరణం
రచయితలు, కవులు, సాహితీవేత్తల దిగ్భ్రాంతి
ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురి సంతాపం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నివాళి
ప్రజానాట్యమండలి, తెలంగాణ సాహితీ సంతాపం

నవతెలంగాణ – ఓయూ, హైదరాబాద్‌ బ్యూరో
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవి, ‘జయజయహే తెలంగాణ…’ అంటూ రాష్ట్ర గీతాన్ని అందించిన ప్రముఖ రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. నిద్ర నుంచి లేవకుండానే సోమవారం ఉదయం ఆయన శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్‌ లాలాగూడలోని వినోభానగర్‌లోని ఇంట్లో భార్య మల్లమ్మ నిద్ర లేపే సమయానికే ఆయన అచేతనంగా ఉన్నారు. దాంతో కుటుంబ సభ్యులు అందెశ్రీని ఉదయం 5 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో లాలాగూడతోపాటు యావత్‌ తెలంగాణ సమాజంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందెశ్రీ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చి 20 నిమిషాలపాటు ఉంచారు. ఇరుకైన ఇల్లు, వీధి కూడా అత్యంత ఇరుకుగా ఉండటంతో ఆయన భౌతికకాయాన్ని లాలాపేట్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఇండోర్‌ స్టేడియానికి తరలించారు. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మృతదేహాన్ని ఉంచారు.

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తదితరులు అందెశ్రీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి… అందెశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం మేడ్చెల్‌ -మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో అంత్యక్రియలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పలువురు మంత్రులు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. పలువురు రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు, స్థానికులు, బంధుమిత్రులు అందెశ్రీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్‌ వరకు…
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలు, కన్నీళ్ల మధ్య పెరిగారు. గొర్రెల కాపరిగా జీవన ప్రయాణాన్ని ప్రారంభించిన అందెశ్రీ ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగానూ పనిచేశారు. పాఠశాల విద్య కూడా అభ్యసించకుండానే కవితా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ‘మాయమైపోతున్నడమ్మా’ గేయం ఆయనకు అపార ఖ్యాతిని తెచ్చిపెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటల ద్వారా తన మాటల ద్వారా అందెశ్రీ ప్రత్యేక పాత్రను పోషించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఇటీవల రేవంత్‌రెడ్డి సర్కారు అందెశ్రీకి రూ.కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది. 2006లో గంగ సినిమా కోసం రాసిన పాటలకుగాను ఆయనకు నంది అవార్డు లభించింది. 2014లో అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అలాగే అందెశ్రీకి లోక్‌నాయక్‌ పురస్కారం కూడా దక్కింది.

వాకింగ్‌.. యోగా చేసే మనిషి ఇలా…
తన జీవితంలో మాంసం, మద్యం ముట్టకుండా అత్యంత క్రమశిక్షణగా ఉన్న అందెశ్రీ… నిత్యం వాకింగ్‌తోపాటు యోగా చేసేవారు. అలాంటి వ్యక్తి ఇలా హఠాత్తుగా మరణించటాన్ని ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు భార్య మల్లమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు వెన్నెల, వేకువ, వ్యాఖ్య, కుమారుడు దత్తు ఉన్నారు.

తెలంగాణ ఆత్మకు ప్రతీక అందెశ్రీ: ప్రధాని మోడీ
‘అందెశ్రీ మరణం సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిభింబిస్తాయి. ఆయన ప్రజా పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన హృదయాలను కదిలించే, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు రూపం ఇచ్చే శక్తి ఆయన పదాలకు ఉంది. సామాజిక స్పృహను సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన ఆయన విధానం అద్వితీయం…’

ప్రజల హృదయాల్లో నిలిచిన కవి : సీఎం రేవంత్‌రెడ్డి
‘రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ… గీతకర్తగా అందెశ్రీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. పత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే…గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సముచిత స్థానం కల్పించాం. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది…’

సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర : కేసీఆర్‌
‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. అందెశ్రీ మృతి పట్ల నా తీవ్ర సంతాపం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…’

స్పీకర్‌, మంత్రుల సంతాపం
అందెశ్రీ మృతి పట్ల స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దనసరి అనసూయ సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.

అట్టడుగు వర్గాల బాధలకు శబ్దరూమిచ్చిన అందెశ్రీ : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అందెశ్రీ మరణం అత్యంత విషాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెస్లీ… పార్టీ నాయకులతో కలిసి జయశంకర్‌ స్టేడియానికి వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’అట్టడుగు వర్గాల బాధలను శబ్దరూపంలో చెప్పిన గొప్ప కవి అందెశ్రీ. ఆయన రాసిన ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు’, రాష్ట్ర గీతం ‘జయ జయ హై తెలంగాణ’ వంటి కతులు ప్రజల హదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి…’ అని పేర్కొన్నారు. వెస్లీతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్‌ అబ్బాస్‌, టి.సాగర్‌, కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డిజి. నరసింహారావు, సీనియర్‌ నేత జి.రాములు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, ఉపాధ్యక్షుడు ఆర్‌.ఎల్‌.మూర్తి, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు తదితరులు అందెశ్రీ భౌతికకాయానికి నివాళులర్పించారు.

మంత్రులతోపాటు పలువురి నివాళి…
అందెశ్రీ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే సామేలు, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కీ గౌడ్‌, వి.హనుమంతరావు, ప్రొఫెసర్‌ కోదండరాం, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ నామోజు బాలాచారి, ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమి ఏవో కె సతీశ్‌ కుమార్‌, వెన్నెల, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఓయూ వీసీ ప్రొ.కుమార్‌, రిజిస్ట్రార్‌ ప్రొ. నరేష్‌రెడ్డి, యాంకర్‌ ఉదయభాను, ప్రొ. కాశిం, ప్రొ. లక్ష్మీనారాయణ, టీఆర్టీఎఫ్‌ నేతలు కటకం రమేష్‌, అంజిరెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ అధ్యక్ష, కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్‌, గౌరీశంకర్‌, టీజీవో ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణగౌడ్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -