Saturday, November 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్టీపీసీ బూడిదపై గుత్తాధిపత్యం..!

ఎన్టీపీసీ బూడిదపై గుత్తాధిపత్యం..!

- Advertisement -

అర్హులకు టెండరు దక్కినా పనులకు అడ్డంకి
బడా కాంట్రాక్టర్లతో వేధింపులు
ఎన్టీపీసీ అధికారుల మౌనం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
న్యాయం కోసం కుందనపల్లి నిర్వాసితుల ఎదురుచూపు


నవతెలంగాణ – రామగుండం
”మేం నిత్యం తీవ్రమైన కాలుష్యంతో సహజీవనం చేస్తున్నాం.. మమ్మల్ని ఆదుకోవడంలోనూ, మాకు ఉపాధి కల్పించడంలోనూ ప్రభుత్వాలు, సంస్థ యాజమాన్యం విఫలమవుతూ వస్తోంది. మా ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు దక్కాల్సిన అవకాశాలు స్థానికేతరులు పొందుతున్నారు. ఉపాధి కరువై ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్టీపీసీ కరెంటు ఉత్పత్తిలో భాగంగా వచ్చే బూడిద వ్యర్థాలను తరలించేలా టెండరు వేసి వేలంలో దక్కించుకున్నా.. బడా కాంట్రాక్టర్లు అడ్డుతగులుతున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు” అని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతమైన కుందనపల్లి నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీపీసీ కరెంటు ఉత్పత్తిలో భాగంగా వచ్చే బూడిద వ్యర్థాలను తరలించేలా సంస్థ యాజమాన్యం అందరికీ టెండరు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా నిర్వాసిత గ్రామమైన రాజాపూర్‌ గ్రామానికి చెందిన కొంత మంది టెండరు దాఖలు చేసి ఆ టెండరును దక్కించుకున్నారు. ఈ గ్రామంలో 540ఎకరాల భూమిని ఎన్టీపీసీ బూడిద చెరువు కోసం అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడి వారు టెండర్లు వేసి పనులు చేసేందుకు ముందుకొచ్చారు. మొత్తం 30లక్షల టన్నుల బూడిదకు.. టన్నుకు రూ.30చొప్పున 19లక్షల టన్నులకు, రూ.26తో 11లక్షల మెట్రిక్‌ టన్నులకు వేలాన్ని దక్కించుకున్నారు. 40మంది కలిసి ఈ వేలంలో పాల్గొని ఈ టెండర్లు సొంతం చేసుకున్నారు. దీనిలో కుందనపల్లికి చెందిన నలుగురు ఉన్నారు. అయితే మమ్మల్ని పనులు చేయకుండా కొంతమంది బడా కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని కుందనపల్లి నిర్వాసితులు వాపోతున్నారు.

అధికార పార్టీ ఏదైనా.. హవా వీరిదే
ఎన్టీపీసీ నిర్వహించే కాంట్రాక్టు టెండరు ఏదైనా.. కొంతమంది బడా కాంట్రాక్టర్లదే హవా కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండి అప్పుడు పనులు చేసిన వారు.. ఇప్పుడు ప్రభుత్వం మారినా వారే ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. తమను అధికారేతర పార్టీ ప్రజలుగా ముద్రవేస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని కుందనపల్లి నుంచి టెండర్‌ దాఖలు చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల అమలు ఎక్కడా..?
ఎన్టీపీసీ నిబంధనల మేరకు 2లక్షల మెట్రిక్‌ టన్నుల లోపు బూడిద తరలింపునకు ఆన్‌లైన్‌ ద్వారా టెండరు దక్కించుకున్న వారు ఎలాంటి యంత్రాలనూ వినియోగించకూడదన్న నిబంధన ఉంది. 50వేల టన్నులకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ జేసీబీ లాంటి యంత్రాలను ఈ తరలింపునకు వినియోగించుకునే అవకాశం లేదు. దీంతో టెండర్లు దక్కించుకున్న నలుగురు కాంట్రాక్టర్లు కలిసి పనిచేస్తూ 2లక్షల టన్నులకుగాను యంత్రాలను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు.

నలుగురు చిన్న కాంట్రాక్టర్లు కలిసి పనిచేసే విధానాన్ని తట్టుకోలేని.. బడా కాంట్రాక్టర్లు యంత్రాలు వినియోగించకుండా అడ్డుకుంటున్నారు. పని జరగకుండా నిలువరిస్తే బడా కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తారని, తమ చెప్పుచేతల్లో ఉంటారనే కుయుక్తులు పన్నుతున్నారు. అలా చిన్నచిన్న కాంట్రాక్టర్లలందరూ పెద్ద కాంట్రాక్టర్లను ఆశ్రయించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో కలిసి ఒత్తిడి చేయిస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్ల జేసీబీలను వినియోగించుకునేలా ఒప్పందం చేసుకునేలా కుట్ర చేస్తున్నారు. దీంతో చిన్న కాంట్రాక్టర్లు తమకు మిగిలే కొద్దిపాటి లాభాన్ని సైతం పెద్ద కాంట్రాక్టర్ల జేసీబీలకు చెల్లించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.

అన్ని అర్హతలున్నా.. ఆధిపత్యం ఎందుకు..?
కాంట్రాక్టు నిబంధనలకు సంబంధించి టెండర్లలో పాల్గొనేవారికి అర్హతలు ఉన్నవారందరూ ఈ యేడాది మార్చిలో నిర్వహించిన టెండర్లలో పాల్గొన్నారు. టన్ను బూడిదకు ఎన్టీపీసీ రూ.1 చొప్పున ధర నిర్ణయించగా.. కుందనపల్లికి చెందిన నిర్వాసితులు టెండరు దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా రూ.76వేలను ఎన్టీపీసీ ఖాతాలో డిపాజిట్‌ చేశారు. జీఎస్టీ, సొసైటీ రిజిస్ట్రేషన్‌ లాంటి అన్ని అర్హతలు ఉండి పనులు దక్కించుకున్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు వెళ్లనీయడం లేదు.

పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు అన్ని వసతులు కల్పించి పనులు కొనసాగేలా చూడాల్సిన ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపై మౌనం వహిస్తూ పెద్ద కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యలపై ఎన్టీపీసీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఎన్టీపీసీ అధికారులు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడంగానీ ప్రకటనగానీ చేయడం లేదు. ఒక వేళ లిఫ్ట్‌ చేసినా తెలుగేతర భాషలో మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్టీపీసీ యాజమాన్యం బాధ్యత వహించాలి: చిలుక ప్రసాద్‌, కుందనపల్లి
ఆన్‌లైన్‌ ద్వారా టెండరు దక్కించుకున్న మా తరపున ఎన్టీపీసీ యాజమాన్యం బాధ్యత వహించాలి. నిబంధనలకనుగుణంగా మేము డిపాజిట్‌ చేసిన నగదుతోపాటు మా పనులు సవ్యంగా కొనసాగేలా చూడాలి. సీఐఎస్‌ఎఫ్‌, ఎన్టీపీసీ యాజమాన్యం పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చర్య తీసుకోవాలి. మాపై అధిపత్యం చేస్తున్న వారి టెండర్లు రద్దు చేసేలా ఎన్టీపీసీ కఠిన నిబంధనలు అమలు చేయాలి.

భూములు కోల్పోయినా అన్యాయమే : దుబాసి పరమేశ్వర్‌, కుందనపల్లి
అధికారికంగా అన్ని అర్హతలతో టెండర్లు దక్కించుకున్నా పనులు జరగడం లేదు. నిర్వాసిత ప్రజలుగా మేము భూములు కోల్పోయినా మాకు తగిన న్యాయం జరగడం లేదు. కాలుష్యాన్ని భరిస్తూ అనారోగ్య పాలవుతున్నా ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మాపై ఆధారపడి చాలా మంది కుటుంబ సభ్యలు ఉన్నారు. మాకు న్యాయం జరిగేలా ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ చూపాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -