నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మాలగుట్ట వద్ద ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న సీసీటీ పనులను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో స్వయంగా కూలీల హాజరు తీసుకొని, రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డులు ఉన్న కూలీలందరికీ పనులు కల్పించే విధంగా చర్యలు చేపట్టి పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు.పని ప్రదేశంలో ప్రతి కూలి సమయం వృధా చేయకుండా పనులు నిర్వహించాలని, నిర్వహించిన పనులకు కొలతల ప్రకారం డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు.
కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి ఎండలు ముదురుతున్నందున ఉపాధి పని ప్రదేశంలో పనిచేస్తున్న కూలీలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, టెక్నికల్ అసిస్టెంట్ మంజురాణి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.



