2024-25 ఖరీఫ్‌లో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్
2024-25 రబీ సీజన్‌లో 1.54లక్షల మెట్రిక్ టన్నులు
మిల్లర్లతో సివిల్ సప్లయ్ అధికారుల మిలాఖత్
బ్లాక్‌లో పెట్టిన మిల్లర్లకు సైతం ధాన్యం సరఫరా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు మిల్లర్లకు ధాన్యం సరఫరా చేయగా ప్రభుత్వానికి తిరిగి సీఎంఆర్ చెల్లించాల్సి ఉండగా కొందరు మిల్లర్లు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించారు. అయితే మిల్లర్లు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడంలో సివిల్ సప్లయ్ అధికారుల పాత్ర ఉన్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించి రైస్ మిల్లులకు అప్పగిస్తే తిరిగి వాటిని అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 68 రైస్ మిల్లులు ఉన్నాయి. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్(కస్టమ్స్ మిల్లింగ్) కోసం 62 రైస్ మిల్లులకు ఇచ్చారు. ఖరీఫ్‌లో ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1.07 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా అందులో 93వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ అందించారు.
మరో 14వేల మెట్రిక్ టన్నులు బకాయిలు ఉన్నాయి. కాగా 2024-25 రబీ సీజన్‌లో 1.54 లక్షల మెట్రిక్ టన్నులు 32 బాయిల్డ్ మిల్లర్లకు ఇచ్చారు. అయితే 1.04 లక్షల మెట్రిక్ టన్నులు అప్పగించాలి. కానీ 60వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 44వేల మెట్రిక్ టన్నులు బియ్యం అప్పగించాలి. కానీ గడువు ముగిసినా అప్పగించలేదు. సీఎంఆర్ అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ మిల్లర్లు మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ 58వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖలకు అందించలేదు. అదే విధంగా 2023-24 వానాకాలంకు సంబంధించి 1,76,760 వరి ధాన్యం సేకరించారు. అందులో సీఎంఆర్ కోసం రైస్‌ను ఎఫ్‌సీఐకి సీఎంఆర్ డెలివరీ చేయలేదు. ఇంకా 25వేల మెట్రిక్ టన్నుల రైస్ బ్యాలెన్స్ ఉంది. 2023-24 యాసంగికి సంబందించి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,38,760 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించారు. అందులో నుంచి 94,356 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్‌కు అప్పగించారు.
మిల్లర్లతో కుమ్మక్కైన సివిల్ సప్లయ్ అధికారులు..
సీఎంఆర్(కస్టమ్స్ మిల్లింగ్ రైస్) వ్యవహారంలో అధికారులు మిల్లర్లతో ములాఖత్ కావడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో 2024-25 ఖరీఫ్‌లో ధాన్యం తీసుకున్న 62 రైస్ మిల్లులు.. 1.07 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా అందులో 93వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ అందించారు. మరో 14వేల మెట్రిక్ టన్నులు బకాయిలు ఉన్నాయి. గడువు ముగిసినా మిల్లర్లు కనీసం పట్టించుకోవడం లేదు. సీఎంఆర్ విషయంలో పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన గడువు దిక్కరిస్తున్నారు. రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ అధికారులు మిలాఖత్ కావడంతో ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు అక్రమ దందా నడిపిస్తున్నట్టు పలు విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలో రైతుల వద్ద సేకరించి మిల్లులకు తరలించిన ధాన్యం లెక్కలు చూడటంలో అధికారుల అలసత్వం మిల్లర్లకు అక్రమ దందా చేసుకునేందుకు వీలు కలిగించింది.
రూ.కోట్ల విలువ చేసే బియ్యం పక్కదారి..
జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగిస్తే మిల్లర్లు రూ.కోట్ల విలువ గల ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకుండా పక్కదారి పట్టిస్తున్నారు. సివిల్ సప్లరు అధికారుల ఉదాసీనత వల్ల మిల్లర్లు ఇష్టారాజ్యంగా బియ్యాన్ని అమ్ముకుంటున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎంఆర్ అప్పగించని 14 రైస్ మిల్లును అధికారులు కలెక్టర్ ఆదేశాలతో బ్లాక్‌లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. పుల్‌కల్ మండలంలోని ముదిమానిక్యం గ్రామంలోని రైస్ మిల్లు 553 మెట్రిక్ టన్నులు బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు.
రూ.1.28 కోట్లను తన స్వంత వ్యాపారాలకు వాడుకున్నారు. కాగా రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా సీఎంఆర్ ధాన్యం రైస్ మిల్లులో లేనట్టు గుర్తించారు. జోగిపేటలో ఉన్న మరో రైస్ మిల్లుకు 9,494 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్‌కు అప్పగించగా ఇందులో నుంచి కొంత ధాన్యాన్ని అమ్మకున్నట్టు గుర్తించారు. అదే విధంగా అందోల్ మండలంలోని డాకూర్ గ్రామంలోని ఎంఎస్ కన్యకా పరమేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్ లో తనిఖీలు నిర్వహించారు. రబీ 2024-25 సీజన్ సంబంధించిన 3752.80 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యంలో 382 బస్తాలు తక్కువగా ఉన్నట్టు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అయినా మిల్లర్లకు సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు సహకరిస్తూ తిరిగి వారికి ధాన్యం అప్పగిస్తున్నారని పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు.
సీఎంఆర్ పెండింగ్‌పై చర్యలు తీసుకుంటాం : సివిల్ సప్లయ్ మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్
సీఎంఆర్‌లో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో పెండింగ్ సీఎంఆర్‌పై చర్యలు తీసుకుంటాం. 2024-25 ఖరీఫ్, రబీకి సంబంధించింది 58వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. రైస్ మిల్లులు ఎప్పటికప్పడు సీఎంఆర్ ఇస్తున్నాయి. ఎలాంటి ఫిర్యాదులు లేవు. జిల్లాలో ఏ రైస్ మిల్లును కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపించాం. జిల్లాలో సీఎంఆర్ డైరెక్టుగా ఎఫ్‌సీఐ గోదాములకు చేరుతుంది. సివిల్ సప్లయ్ కు ఎలాంటి సంబంధం లేదు. రేషన్ షాపులకు ఇతర జిల్లాల నుంచి బియ్యం వస్తుంది. ఎఫ్‌సీఐ జిల్లాకు కావలసిన బియ్యం సరఫరా చేస్తుంది. వాటితో జిల్లాలోని రేషన్ షాపులకు పంపిస్తాం. సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం.



