Sunday, November 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅందెశ్రీ ఓ కోహినూర్‌ వజ్రం

అందెశ్రీ ఓ కోహినూర్‌ వజ్రం

- Advertisement -

ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది
ఆయన పేరిట స్మృతివనం నిర్మిస్తున్నాం
‘నిప్పులవాగు’ పుస్తకం ప్రతి గ్రంథాలయంలో ఉండేలా చేస్తాం
బడి మొహం చూడని అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ ప్రతిబడిలో రోజూ పాడుతున్నారు
గత పాలకుల వల్ల ఆ పాట మూగబోయింది
కవులు, కళాకారుల గానం వినిపించకుండా కుట్ర
పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి
మంత్రుల్లో రెడ్లు ముగ్గురుంటే దళితులు నలుగురు
న్యాయ, సాంకేతిక పరమైన ఇబ్బందుల్లేకుండా ఎస్సీ వర్గీకరణ అమలు
తెలంగాణ పునర్నిర్మాణంలో దళితులు భాగస్వాములు కావాలి : అందెశ్రీ సంతాపసభలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఎన్ని వజ్రాలున్నా కోహినూర్‌ వజ్రానికి పోటీలేదు. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్‌ వజ్రం. ఆయన కీర్తిని భవిష్యత్‌లో నిలబెడతాం’అని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంతాపసభను శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ తనకు అత్యంత అప్తుడు, మనసుకు దగ్గరి వాడని అన్నారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని చెప్పారు. ఎంత అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుందన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా ‘బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతవ్‌ కొడకో నైజాం సర్కరోడా’ అని బండి యాదగిరి గళం విప్పితే నిజాం సర్కార్‌ పీఠం కదిలిందని గుర్తు చేశారు.

సమైక్యవాదులకు వ్యతిరేకంగా గద్దర్‌, గోరేటి వెంకన్న, గూడ అంజన్న, అందెశ్రీ తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని చెప్పారు. బడి మొహం చూడని అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాసి స్ఫూర్తిని నింపారని అన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ప్రతి తెలంగాణ గుండెకు తాకేలా ఈ పాటను రాసి ఉద్యమ స్ఫూర్తిని నింపారని వివరించారు. అందెశ్రీ లాంటి వారు లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదనీ, ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారం కాలేదని చెప్పారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారని గుర్తు చేశారు. కానీ నాటి పాలకుల తీరు వల్ల జయజయహే తెలంగాణ పాట మూగబోయిందని అన్నారు. అధికారం శాశ్వతం అని నాటి పాలకులు భావించారని అన్నారు. తెలంగాణలో స్ఫూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారని విమర్శించారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయనీ, గడీలను కుప్పకూల్చుతామని అందెశ్రీ నిరూపించారని చెప్పారు.

నేడు జయజయహే తెలంగాణ నిత్యగానం
ఇప్పుడు తెలంగాణ నాలుగుకోట్ల ప్రజలు జయజయహే తెలంగాణ పాటను నిత్యం పాడుకుంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. బడి మొహం చూడని అందెశ్రీ రాసిన ఆ పాటను ప్రతిబడిలో రోజూ పాడుతున్నారని వివరించారు. ఆ పాటను ప్రతి బడిలో వాడాలనీ, ప్రతి ఒక్కరూ పాడాలని చెప్పారు. తాను సీఎం, తన సహచర మంత్రులు అయ్యారంటే వారి స్ఫూర్తి ఎంతో ఉందన్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని అన్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామనీ, స్మృతివనం నిర్మిస్తున్నామని వివరించారు. ఆయన రాసిన ‘నిప్పుల వాగు’ పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలన రావాలని గద్దర్‌, అందెశ్రీ కోరుకున్నారని అన్నారు.

మంత్రుల్లో రెడ్లు 20 శాతం దళితులు 27 శాతం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామనీ, భారత్‌ ప్యూచర్‌ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అమలు చేస్తున్నామని వివరించారు. వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవుతున్నారని చెప్పారు. చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తన మంత్రివర్గంలో రెడ్లు ముగ్గురు మంత్రులుగా ఉంటే దళితులు నలుగురు ఉన్నారనీ, స్పీకర్‌ కూడా ఉన్నారని గుర్తు చేశారు. మంత్రుల్లో రెడ్లు 20 శాతం ఉంటే దళితులు 27 శాతం ఉన్నారని వివరించారు. దళితుల సమస్యలు, పరిశోధనలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్సీ కోదండరామ్‌, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీఎంపీ వీహెచ్‌, గాయకురాలు విమలక్క, ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సి కాశీం, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -