Tuesday, February 17, 2026
E-PAPER
Homeమానవిఆహా ఏమి రుచి..తినరా మైమరచి

ఆహా ఏమి రుచి..తినరా మైమరచి

- Advertisement -

కూరగాయల్లో రారాజుగా పిలుచుకునే వంకాయతో ఎలాంటి వంటలు చేసినా రుచి అద్దిరిపోతుంది. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. అలాగే వంకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్‌ను నశింపచేసి కాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలో పిండిపదార్థాలు, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని హైడ్రెట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది. రుచితో పాటు ఇన్ని ప్రయోజనాలున్న వంకాలతో చేసే కొన్ని వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం…

ఉల్లికారం
కావాల్సిన పదార్థాలు: పండుమిర్చి – 15, ఉల్లిగడ్డ – పన్నెండు(మీడియం సైజ్‌వి), మెంతులు – రెండు చిటికెళ్లు, జీలకర్ర – రెండు టీస్పూన్లు, ధనియాలు – రెండు టీస్పూన్లు, అల్లం – రెండించుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 12, చింతపండు – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత.

కర్రీ కోసం: వంకాయలు – అర కిలో, నూనె – ఆరు టేబుల్‌స్పూన్లు, పోపు దినుసులు – రెండు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – కొద్దిగా, కొత్తిమీర తరుగు – కొద్దిగా.

తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డను పొడుగ్గా, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కనుంచాలి. అలాగే, పండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడి చేసి మెంతులు వేసి వేయించాలి. అవి వేగాక జీలకర్ర, ధనియాలు, పండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుతూ సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి. అన్నీ వేగాక కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, చింతపండు, ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో మూడ్నాలుగు నిమిషాలు కలుపుతూ మగ్గించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఈలోపు వంకాయలను తీసుకుని నాలుగు ముక్కలుగా కట్‌ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కనుంచాలి. మిక్సీ జార్‌లో చల్లారిన ఉల్లిగడ్డ మిశ్రమం వేసి కాస్త పలుకుగా గ్రైండ్‌ చేసుకోవాలి.

స్టవ్‌ మీద ఆనియన్స్‌ వేయించుకున్న పాన్‌నే ఉంచి ఆరు టేబుల్‌స్పూన్ల నూనె వేడి చేసి పోపు దినుసులు వేయించాలి. తర్వాత వంకాయలను నీళ్లు లేకుండా పిండి ఒకట్రెండు నిమిషాలు నూనెలో వేయించుకోవాలి. అవి వేగేటపుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సన్నని సెగ మీద ఐదారు నిమిషాలు మగ్గించుకోవాలి. అవి సగం వరకు మగ్గాక ఉల్లికారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీరు పోసి నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత పాన్‌పై మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సన్నని సెగ మీద ఉల్లికారం నుంచి ఆయిల్‌ సెపరేట్‌ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చివర్లో సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలిపి దింపేసుకుంటే చాలు.

వంకాయ బజ్జీ కర్రీ
కావల్సిన పదార్థాలు: పది – గుండ్రటి వంకాయలు, నాలుగు – టమాటాలు (మీడియం సైజ్‌వి), రెండు – ఉల్లిగడ్డలు(చిన్న సైజ్‌వి), రుచికి తగినన్ని – పచ్చిమిర్చి, నిమ్మకాయంత – చింతపండు, టేస్ట్‌కి సరిపడా – ఉప్పు, టీస్పూన్‌ – పసుపు. తాలింపు కోసం: ఆరేడు టేబుల్‌ స్పూన్లు – నూనె, కొద్దిగా – ఆవాలు, టీస్పూన్‌ – జీలకర్ర, రెండు టీస్పూన్లు – శనగపప్పు, రెండు టీస్పూన్లు – మినప్పప్పు, ఆరు – ఎండుమిర్చి, రెండు – ఉల్లిగడ్డ, పది – వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా – కరివేపాకు.

తయారీ విధానం: ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని దానిలో కాస్త ఉప్పు వేసి పక్కనుంచాలి. తెల్లని లేత గుండ్రటి వంకాయలను తీసుకుని నిలువు ముక్కలుగా కట్‌ చేసుకొని ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డను మీడియం సైజ్‌ ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నె తీసుకుని అందులో ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలుగా తుంపి వేసుకోవాలి. అలాగే చింతపండు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, మూడు గ్లాసుల వరకు నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి.

ఆ గిన్నెను స్టవ్‌ మీద ఉంచి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మాష్‌ చేసుకుని పక్కన ఉంచాలి. తాలింపు కోసం పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసుకోవాలి. నూనె హీట్‌ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, సన్నగా కట్‌ చేసుకున్న ఉల్లిగడ్డ, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి సన్నని సెగ మీద పోపును ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్‌ బాగా వేగాయనుకున్నాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక మాష్‌ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి రెండుమూడు నిమిషాలు ఉడికించుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుంది.

పచ్చడి
కావాల్సిన పదార్థాలు: పెద్దసైజ్‌ గుండ్రటి వంకాయలు – రెండు, టమాటాలు – రెండు, నూనె – తగినంత, ఆవాలు – టీస్పూన్‌, ఎండుమిర్చి – రెండు, జీలకర్ర – టీస్పూన్‌, కరివేపాకు – కొద్దిగ, పసుపు – అర చెంచా, పచ్చిమిర్చి – ఐదారు, ఉప్పు – రుచికి తగినంత, కొత్తమీర తరుగు – కొద్దిగా.

తయారీ విధానం: వంకాయలు, టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి వాటికి కాస్త నూనె అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద గ్రిల్‌ ఉంచి వంకాయలు, టమాటాలను ఉంచి పట్టుకారుతో(ప్లక్కర్‌) అటు ఇటు తిప్పేసుకుంటూ అన్ని వైపులా మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అవి మునిగేవరకు వాటర్‌ పోసి కాలిన వంకాయ, టమాటాలపై ఏర్పడిన బ్లాక్‌ లేయర్‌ను చేతితో నీట్‌గా తొలగించుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వాటిలో కొద్దిగా ఉప్పు వేసి మాషర్‌తో మెత్తగా మెదుపుకోవాలి.

రోలు అందుబాటులో ఉంటే కచ్చాపచ్చాగా నూరుకోవాలి. అందులో రుచిని బట్టి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని కలిపి పక్కనుంచాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు, ఎండుమిర్చి తుంపలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అవి లైట్‌గా వేగాక పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని దాన్ని పచ్చడిలో వేసి బాగా కలిసేలా మిక్స్‌ చేసుకోవాలి. చివరగా అందులో సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి సర్వ్‌ చేసుకుంటే చాలు.

పచ్చి పులుసు
కావాల్సిన పదార్థాలు: తెల్ల గుత్తొంకాయలు – 4, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, కొత్తిమీర తరుగు – పిడికెడు, అల్లం – అర అంగుళం, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావుటీస్పూన్‌, చింతపండు రసం – నిమ్మకాయ సైజంత, బెల్లం తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తాలింపు కోసం: నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూన్‌, మెంతులు – పావుటీస్పూన్‌, శనగపప్పు – 1 టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – 2 రెమ్మలు, ఇంగువ – చిటికెడు.

తయారీ విధానం: ముందుగా ఒక చిన్న బౌల్‌లో చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు తెల్ల గుత్తొంకాయలను తీసుకొని వాటికి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద గ్రిల్‌ పెట్టి దానిపై వంకాయలు పెట్టి లో ఫ్లేమ్‌ మీద మధ్యమధ్యలో తిప్పుతూ వాటి స్కిన్‌ నల్లగా మారే వరకు బాగా కాల్చుకొని వాటిని ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్‌ చల్లుకోవాలి. వంకాయలపై నల్లగా కాలిన పై చెక్కును తొలగించుకోవాలి. ఫోర్క్‌ లేదా స్పూన్‌తో వాటిని మెత్తగా మెదుపుకొని పక్కనుంచాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.

ఓ గిన్నె తీసుకొని అందులో మాష్‌ చేసుకున్న వంకాయల గుజ్జు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని గట్టిగా పిండుతూ అన్నీ కలుపుకొని పక్కనుంచాలి. అలాగే చింతపండు రసం తీసి రెడీగా ఉంచుకోవాలి. స్టౌపై పాన్‌ పెట్టుకొని నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి మరికాసేపు వేయించి దింపేసుకోవాలి. ఇందులో చింతపండు రసం, వంకాయ మిశ్రమం, బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకొని సర్వ్‌ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరంగా ఉండే ‘వంకాయ పచ్చి పలుసు’ రెడీ!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -