యువాన్, యూఏఈ కరెన్సీలతో చెల్లింపులు
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత చమురు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా చమురు కొనుగోళ్లను ప్రత్యామ్నాయ కరెన్సీలలో చెల్లింపులను పెంచుతున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారని బ్లూమ్‌బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. రష్యా విక్రేతలు కలిగి ఉన్న ఓ ప్రత్యేక విదేశీ బ్యాంకు ఖాతాలలో రూపాయలను డిపాజిట్ చేయడం ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆ నిధులు యూఏఈ దిర్హామ్ లేదా లేదా చైనా యువాన్‌లలోకి మార్చబడుతున్నాయి. విదేశాల్లో పరిమిత ఉనికి ఉన్న కొన్ని భారతీయ బ్యాంకులు ఈ వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
దిర్హామ్, యువాన్‌తో పాటు, సింగపూర్ డాలర్, హాంకాంగ్ డాలర్‌ను కూడా కంపెనీలు పరిశీలిస్తున్నాయన్నారు. అయితే ఈ లావాదేవీలు ఆయా బ్యాంకుల సంసిద్ధతపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకోవడానికి ఈ నెల ప్రారంభంలో అమెరికా భారత్‌కు మినహాయింపు ఇచ్చింది. అమెరికా విధానాల్లో మార్పుల వల్ల వచ్చే ముప్పును తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ కరెన్సీలలో చెల్లింపులు కోరుతున్నాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల చమురు బ్యారెల్ ధర 100 డాలర్లను దాటింది. ఈ క్రమంలో భారతీయ కంపెనీలు చమురు కొనుగోళ్లను పెంచాయి. అమెరికా మినహాయింపు ఇచ్చినప్పటి నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ వంటి రిఫైనర్లు సుమారు 60 మిలియన్ బారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయి.
డాలర్‌కు ప్రత్యామ్నాయాలపై చమురు కంపెనీల దృష్టి
- Advertisement -
- Advertisement -



