Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంజీడీపీకి చమురు దెబ్బ

జీడీపీకి చమురు దెబ్బ

- Advertisement -

– 100 డాలర్లు దాటిన క్రూడ్‌ ధర
– ముదురుతున్న గ్యాస్‌ సంక్షోభం
న్యూఢిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సామ్రాజ్య వాద పోకడలతో పశ్చిమాసియాలో రేపిన చిచ్చు.. భారత ఆర్థిక వ్యవస్థకు సెగ పెడుతోంది. వేల మైళ్ల దూరంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా సంయుక్తంగా సాగిస్తోన్న మారణకాండ భారత జీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముడి చమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లు దాటడంతో పాటు దానికి తోడు దేశంలో నెలకొన్న తీవ్రమైన గ్యాస్‌ కొరత సామాన్యుల వంటగది నుండి భారీ పరిశ్రమల వరకు అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో భారత్‌ దిగుమతి చేసుకునే ఇంధన సరఫరాకు పెద్ద విఘాతం కలిగింది. దీనివల్ల దేశ వృద్ధి రేటు మందగించడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరిగి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఎజెన్సీలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌ తన ముడి చమురు అవసరాల కోసం 90 శాతం, వంట గ్యాస్‌ కోసం సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత సంక్షోభం కారణంగా దిగుమతులు నిలిచిపోవడంతో గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత 2026 వృద్ధి అంచనాలను 6.5 శాతానికి తగ్గించాయి. ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించి చమురు ధరల భారాన్ని కొంతవరకు భరించగలిగినప్పటికీ, పారిశ్రామిక రంగంపై పడే దెబ్బ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఆర్థికవేత్త గౌరవ్‌ కపూర్‌ విశ్లేషించారు. ఇప్పటికే గుజరాత్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరత కారణంగా వేలాది ఇంజనీరింగ్‌ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ ప్రభావం కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా సామాన్యుల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా దేశంలో వేగంగా పెరుగుతున్న గిగ్‌ ఎకానమీలో భాగమైన లక్షలాది మంది డెలివరీ ఏజెంట్ల ఆదాయం ఇంధన ధరలు, గ్యాస్‌ కొరత వల్ల సగానికి పైగా పడిపోయింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలకు జరిగే సుమారు 200 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు కూడా ప్రమాదంలో పడ్డాయి. దీనివల్ల రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 92.5 వద్దకు పడిపోయింది. ఒకవైపు వృద్ధి తగ్గుతూ.. మరోవైపు ధరలు పెరుగుతుండటంతో భారత ఆర్థిక వ్యవస్థ ఒక క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -