అమెరికా, రష్యాలనూ తాకిన జ్వాలలు
సరఫరాలకు తీవ్ర ఆటంకం
ఇంధన సంక్షోభం తప్పదంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : చమురు-గ్యాస్ రిఫైనరీలు, కేంద్రాలు కేవలం మధ్యప్రాచ్యంలోనే మంటల్లో చిక్కుకోవడం లేదు. ఆ మంటలు ఇప్పుడు రష్యా, అమెరికాను కూడా తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ ముడి చమురు ధర వంద డాలర్లు దాటింది. దాడులు, ప్రతిదాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో దెబ్బతిన్న ఇంధన మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి సంవత్సరాలు పట్టేలా ఉంది. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు చమురు సరఫరాలలో అతి పెద్ద ఆటంకాలను చూడబోతున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో ప్రసంగిస్తూ మధ్యప్రాచ్య యుద్ధం సుదీర్ఘకాలం ప్రభావం చూపబోతోందని హెచ్చరించారు. దేశంలోకి ముడి చమురు, సహజ వాయువు, పెట్రోకెమికల్స్ సరఫరాలకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన చెప్పారు. అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. అంతేకాక అమెరికా-ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా గల్ఫ్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.
పులి మీద పుట్రలా…
పులిమీద పుట్రలా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ దళాలు రష్యాలోని రెండు రిఫైనరీలు, ఓ చమురు లోడింగ్ ఓడరేవుపై దాడి చేశాయి. అలాగే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అర్థూర్ ఓడరేవులో అతిపెద్ద వలేరో రిఫైనరీలో పేలుళ్లు, అగ్ని ప్రమాదం జరగడంతో దానిని మూసివేశారు. ఈ ఘటనలన్నీ కలిసి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దాడులు ఆపేస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత 11 శాతం వరకూ తగ్గిన చమురు ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి.
ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా…
ఇరాన్ యుద్ధంలో ప్రధానంగా ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోంది. పర్షియన్ గల్ఫ్ అంతటా ఈ నెల 18-20 తేదీల మధ్య ఇంధన కేంద్రాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్దది. దీనిపై ఇజ్రాయిల్ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ ఈ నెల 19న జరిపిన క్షిపణి దాడిలో ఖతార్‌లో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఎల్ఎన్జీ కాంప్లెక్స్ రాస్ లాఫన్ పారిశ్రామిక నగరం బాగా దెబ్బతిన్నది.
దీంతో అక్కడ గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతి సామర్ధ్యం 17శాతం మేర పడిపోయింది. అదేరోజు సౌదీ అరేబియాలోని యన్బూ రిఫైనరీపై కూడా డ్రోన్ దాడి జరిగింది. దానికి జరిగిన నష్టంపై ఇప్పటికీ అంచనాలు వేస్తూనే ఉన్నారు. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన రెండు రిఫైనరీలపై సైతం డ్రోన్ దాడులు జరగడంతో పెద్దఎత్తున మంటలు వ్యా పించాయి. క్షిపణి దాడులను ఇరాన్ ఉధృతం చేయడంతో యూఏఈలో గ్యాస్ క్షేత్రాలను మూసివేశారు.
తూర్పు యూరప్‌లో…
అటు తూర్పు యూరప్‌లో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. దీంతో అక్కడ ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. రాస్‌నెఫ్ట్‌కు చెందిన సరటోవ్ రిఫైనరీ, ప్రిమార్క్లోని బాల్టిక్ సముద్ర చమురు రిఫైనరీ, ఉఫాలోని మరో రిఫైనరీపై ఉక్రెయిన్ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా రష్యా కూడా ఉక్రెయిన్ చమురు, ఇంధన కేంద్రాలపై దాడులు చేసింది. మధ్య ప్రాచ్యంలో, ఉక్రె యిన్‌లో ఘర్షణలు కొనసాగుతున్నందున అంతర్జాతీయ ఇంధన భద్రతపై ఒత్తిడి పెరుగుతుందని, ద్రవ్యోల్బణం అదుపు తప్పవచ్చునని విశ్లేషకులు హెచ్చరించారు. కీలక మౌలిక సదుపాయాల రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోని పక్షంలో ఇంధన సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతుందని, అది అనివార్యమవుతుందని వారు తెలిపారు.
పడిపోతున్న సరఫరాలు
రాస్ లాఫన్పై ఇరాన్ జరిపిన దాడులతో భారీ నష్టం కలిగిందని, మంటలు చెలరేగాయని, ఫలితంగా చాలా కాలం పాటు ఎల్ఎన్జీ కొరత తలెత్తవచ్చునని రాయిటర్స్ వార్తా సంస్థ హెచ్చరించింది. పదేపదే దాడులు జరుగుతుండడంతో పర్షియల్ గల్ఫ్ దేశాలు కోలుకోవడం కష్టమవుతుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో సరఫరాలకు ఇదే అతి పెద్ద అంతరాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఈ నెలలో సరఫరాలు రోజుకు ఎనిమిది మిలియన్ బ్యారల్స్ తగ్గిపోతాయని అంచనా వేసింది.



