అరామ్కో సీఈఓ అమీన్ నాసర్
రియాద్ : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్ర కల్లోలంలోకి నెడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు నిల్వలు ఇప్పటికే ఐదేండ్ల కనిష్టానికి పడిపోయాయని సౌదీ అరామ్కో సీఈఓ అమీన్ నాసర్ తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో 20 శాతం వాటా కలిగిన కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం ఇలాగే కొనసాగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావం పడనుందని హెచ్చరించారు.
ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఇప్పటికే అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఖతార్ తన గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేయగా, ఇరాక్ చమురు ఉత్పత్తి ఏకంగా 70 శాతం పడిపోయింది. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు ఎగిశాయి. రవాణా పునరుద్ధరణ జరగకపోతే ఇంధన కొరత తీవ్రమై గ్లోబల్ ఎకానమీ కుప్పకూలే ప్రమాదం ఉందని అమీన్ నాసర్ ఆందోళన వ్యక్తం చేశారు.
2026లో ఆర్థిక సంక్షోభమే : రాబర్ట్ కియోసాకి
ఈ ఏడాది 2026లో ప్రపంచం మరో భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. 2008 నాటి లెమాన్ బ్రదర్స్ పతనం కంటే ఇది భయంకరంగా ఉండవచ్చని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల మితిమీరిన అప్పులు, ప్రయివేట్ రుణ వ్యవస్థలోని లోపాల వల్ల రిటైర్డ్ వ్యక్తుల పొదుపు సొమ్ము ప్రమాదంలో పడవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నగదు కంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి సహజ వనరులలో పెట్టుబడి పెట్టడమే ఉత్తమమని ఆయన సూచించారు.



