నవతెలంగాణ – నసురుల్లాబాద్
రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. చలిపులి దడ పుట్టిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు చలితో వణికి పోతున్నారు. మరో వైపు పల్లెల్లో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఓ వైపు చలితో వణికి పోతుంటే మరోవైపు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో గ్రామాల్లో ఎన్నికలు వేడి రోజుకు పెరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉదయం 10 గంటల వరకు ఇంటి తలుపు తెరవడం లేదు.
రాత్రి ఆరు గంటలకే ఇంటికి చేరుకుంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పలు మండలాలు మూడవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడో విడత ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి కార్యకర్తలు సహకాలం రాక పోవడంతో చలి తీవ్రత వలన ప్రచారానికి ఆటంకం కలుగుతుందనీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ఓటరు నాడీ దొరకాలంటే అభ్యర్థులు ఆలోచించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులంతా తెలిసిన వారే కావడంతో ప్రతి ఒక్కరికి ఓటు వేస్తామని హామీ ఇస్తుంటారు. అందరికీ ఒకే రకమైన భరోసా ఇస్తూ.. ఎక్కడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు కుల సంఘాలు, యూత్ సభ్యులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయినప్పటికి గెలుపోటముల్లో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
బాన్సువాడలో రెబల్స్ టెన్షన్
పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్లలో కలవరం మొదలైంది. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్స్ పోటీలో ఉండడంతో కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థులు సమయం వృథా చెయ్యకుండా ఓటర్లను గాలం వేసేలా చూస్తున్నారు. ఒక వైపు తాయిలాలు అందజేస్తూ సాయంత్రం పూట విందులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి.
గ్రామాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చ కొనసాగుతోంది. ఓటర్లు ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఎవరినీ అడిగినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. కొందరికై తే కార్లు, వెహికిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీలో ఒక్క ఓటు సైతం కీలకం కావడంతో ఆరోజు ఎన్ని పనులు ఉన్నా వచ్చి ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం మిన్నంటింది. ఎన్నికలపై గ్రామాల్లో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది యువత మాత్రం ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎలాంటి వారికి ఓటు వేయాలి. మంచి వారిని ఎన్నుకోవాలంటూ సందేశాలు ఇస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రచారంకు ఆటంకం కలుగుతుంది.



