జనగామలో రెండ్రో రోజుల కార్యక్రమాలు
ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ
పోస్టర్‌ను ఆవిష్కరించిన చావ రవి, వెంకట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 28, 29వ తేదీల్లో రెండు రోజుల పాటు జనగామలో రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ ఆ సమావేశాలకు సంబంధించిన పోస్టర్, ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి సదస్సు, సమావేశాల వివరాలను వెల్లడించారు.
28న ఉదయం 9.30 గంటలకు ఉపాధ్యాయుల మహా ప్రదర్శనతో ప్రారంభమమవుతుందని చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ప్రారంభ సభకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, గౌరవ అతిథులుగా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మామిడాల యశస్వినీ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు హాజరు కానున్నారని వివరించారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే విద్యా సదస్సుకు ముఖ్యఅతిథిగా పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ పాల్గొంటారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రతినిధుల సభను నిర్వహిస్తారని చెప్పారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రతినిధుల సభ కొనసాగుతుందని అన్నారు. సాయంత్రం 4 గంటలకు ముగింపు సభతో రెండు రోజుల కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి, సమస్యల పరిష్కారం కోసం టీఎస్‌యూటీఎఫ్ చేసిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోనున్నట్టు వారు తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కేంద్రంపై ఐక్య ఉద్యమాలు
టెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేల మంది ఉపాధ్యాయులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని వీడటం లేదని చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ లేదా క్యూరేటివ్ పిటిషన్ వేయడం, పార్లమెంటులో చట్ట సవరణ చేయడం వంటి వాటిపై స్పష్టతనివ్వడం లేదని చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వేగవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంశ్రీ పాఠశాలలు తదితర రూపాల్లొ కొందరికి నాణ్యమైన విద్య అందిస్తూ పేదలకు విద్యను అందకుండా చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య ఉద్యమాలు చేయనున్నట్టు తెలిపారు.
ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా క్లాసులు నిరుపయోగం
విద్యారంగంలో ఎన్జీవోల జోక్యంపై చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులతో ఉపయోగపడటం లేదని కొట్టిపారేశారు. హైస్కూల్ విద్యార్థులు ఆ స్థాయిలో నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకోకుండా ఐఐటీ తదితర విషయాలపై ఆన్ లైన్ క్లాసులు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్జీవోల పేరుతో ప్రాథమిక విద్యలో ప్రయివేటు సంస్థల ప్రాబల్యం పెరుగుతున్నదని విమర్శించారు. రెసిడెన్షియల్ పేరుతో కొందరికి నాణ్యమైన విద్యనందించి 20 లక్షల మంది పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన హితవు పలికారు. సమస్యలపై యూటీఎఫ్ ఒంటరిగానూ, ఇతర సంఘాలతో కలిసి ఐక్యంగానూ ఉద్యమిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎ.సింహాచలం, ఎం.వెంకటప్ప, కొండలరావు, సీనియర్ నాయకులు డి.మస్తాన్ రావు, సిహెచ్.వి.రాజన్ బాబు, వెంకటేశ్వర్లు, రమేశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



