‘లక్ష్యం దృఢమైంది అయితే మార్గాలు అవే లభ్యం అవుతాయి’. ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనదేశంలో ఆత్మహత్యలు 50 శాతం వరకు తగ్గే అవకాశం వుంది. అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్యలకు పాల్పడతారన్న స్టేట్‌మెంట్‌లో వాస్తవం లేదనే అవగాహన కూడా మనలో ఏర్పడుతుంది. ‘నేను బతకాలి’ అన్న దృఢసంకల్పం లోపించినప్పుడే ఈ ఆత్మహత్యల వైపుకి ఆలోచనలు వెళ్తాయి. సెప్టెంబర్ 10 ‘ఆత్మహత్యల నివారణ దినోత్సవం’ సందర్భంగా మనం కూడా దాని గురించి గళం విప్పుదాం.
ప్రతిరోజూ మనం వింటున్న వార్తల్లో ఆత్మహత్యలు కూడా ఒక భాగం అయిపోయాయి. అంటే ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో మనకి అర్థం అవుతోంది.
రైతులు, విద్యార్థులు, యువత, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, వృద్థులు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ దీనికి మినహాయింపు కాదని తెలుస్తోంది. ఆత్మహత్య అన్నది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా యావత్ ప్రపంచం పరిగణించాల్సిన అవసరం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హెచ్‌డబ్ల్యుఒ) వెల్లడించింది.
ఆత్మహత్యల నివారణ కోసం ఇంటర్‌నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా ప్రకటించాయి.
భారతదేశంలో కూడా ఆత్మహత్యల సంఖ్య ప్రతి యేడూ పెరుగుతూనే వుంది. 2018 నుండి 2022 వరకు అంటే ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 27 శాతం పెరిగినట్టు నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిణామమనే చెప్పాలి. ఆత్మహత్యలకి పాల్పడుతున్న వారిలో అధికశాతం అంటే 26.4 శాతం రోజువారీ కూలీలు ఉన్నట్టుగా కూడా నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
భారత ప్రభుత్వం 20 శాతం మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంతో ఆత్మహత్య యత్నాన్ని నేరం కాదని పేర్కొంది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రమే వ్యక్తులు అటువంటి నిర్ణయం తీసుకుంటారని, అందువల్ల అది నేరంగా పరిగణించబడదని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ, పునరావాసం వంటి వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. మానసిక ఆరోగ్య సహాయం అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2020లో 24/7 ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ అయిన ‘కిరణ్’ను ప్రారంభించింది.
నేపధ్యాల వారీగా చూసినట్టయితే…
బ రైతుల ఆత్మహత్యలకి అధిక రుణభారాలు, ప్రభుత్వ విధానాలు సరిగాలేకపోవడం, సబ్సిడీలలో అవినీతి, పంట వైఫల్యం, మానసిక అనారోగ్యం, వ్యక్తిగత కుటుంబ సమస్యల వంటి అనేక విరుద్ధమైన అంశాలే కారణం అవుతున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.
బ రోజువారీ కూలీల ఆత్మహత్యలకి కూడా కొంత అటుఇటుగా ఇటువంటి అంశాలే కారణం అవుతున్నాయి.
బ ఒకప్పుడు కుటుంబ హింస, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం, వివక్ష, ఒంటరితనం, వేధింపులు, స్త్రీలు, గృహిణుల ఆత్మహత్యలకి ప్రధాన కారణాలుగా వుండేవి. మనం గమనించినట్టయితే గత పదేళ్లుగా వివాహేతర సంబంధాలు కూడా స్త్రీల ఆత్మహత్యలకి దోహదపడుతున్నాయి.
చదువుల ఒత్తిడి, తల్లిదండ్రుల ఓవర్ వెల్మింగ్, పీర్ బుల్లింగ్, సమస్యల్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యం లోపించడం, లవ్ ఫెయిల్యూర్ వంటి అంశాలు విద్యార్థులు, యువత ఆత్మహత్యలకి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన మరొక అంశం కూడా వుంది. యువత అంటేనే ఆకర్షణలకి లోనయ్యే వయసు. చాలా యంతూసియాస్టిక్‌గా వుండే దశ అది. దాన్ని అవకాశంగా తీసుకుని కొందరు తమ స్వార్థం కోసం వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసి నేరస్థులుగా మారుస్తున్నారు. తాము చేసేది తప్పని తెలిసినా అందులోనుంచి బయటకు రాలేక, తల్లిదండ్రులకి చెప్పి వారి సహాయం పొందలేక ఎంతో మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. అది తట్టుకోలేక ప్రాణాల్ని కూడా బలి చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాన్ని తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు.
అలాగే బెట్టింగుల సంస్కృతి కూడా మన సమాజంలో రోజు రోజుకీ పెరిగిపోతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది ఈ బెట్టింగులకి బలైపోతున్నారు.
సమాజంలో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు, ఆర్థికంగా వున్నత స్థాయిలో వున్నవారు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీస్‌లలో కూడా ఆత్మహత్యలకు పాల్పడేవారిసంఖ్య కూడా తక్కువేమీకాదు. అయితే వీరి ఆత్మహత్యల గురించి వినిపించే కథల వెనుక కథనాలు మాత్రం విరుద్ధంగా, విభిన్నంగా వుంటాయి. కొన్ని మిస్టరీల్లాగే మిగిలిపోతాయి.
ఆత్మహత్య తలంపులు ఎందుకు కలుగుతాయి?
ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. ప్రతి ఆలోచనా విభిన్నమే. ప్రతివారి చర్యా వైవిధ్యమే. ఏ ఇద్దరి ఆలోచనలూ, వ్యక్తిత్వాలూ ఒకేలా వుండవు. కొందరికి చిన్నవిగా అనిపించే విషయాలే మరికొందరికి తీవ్రమైనవిగా తోచవచ్చు. ఒకవిధంగా ఇవి కూడా కారణాలే.
ఆత్మహత్య తలంపులు రావడానికి కారణాన్ని ప్రస్తావించుకున్నట్టయితే…
బ వ్యక్తుల భావోద్వేగాల్ని సమాజం ఎప్పుడూ తన అదుపాజ్ఞల్లో వుంచుకోటానికే ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మన భారతీయ సమాజంలో వ్యక్తుల ప్రతి చర్య సమాజం చేత స్కాన్ చేయబడుతుంది. సమాజం నిర్ణయించిన నిబంధనల్ని ఏ మాత్రం క్రాస్ చేసినా వాళ్లని తన దృష్టికోణం నుంచి జడ్జ్ చేసి, వాళ్లకి ఒక ముద్రని ఆపాదిస్తుంది. చాలామంది ఈ ఇరుసులోనే చిక్కుకుని బతుకుతారు. వీళ్లకి జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడం మానేసి సమాజం దృష్టికోణం నుంచి ఆలోచనలు చేస్తారు. దానివల్ల వారికి ఎదురైన సమస్యకన్నా వారు చేసే ఆలోచనలే వారిని ఎక్కువ మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. అలాంటి పరిస్థితుల్లోనే వారు భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతారు.
బ సరైన సమయంలో సరైన సపోర్ట్ అందకపోవడం కూడా ఆత్మహత్యల నివారణకి ఆటంకంగా మారుతోంది. ఒక్కొక్కసారి ఆత్మహత్య తలంపులున్న వ్యక్తి తన మనసులోని ఆలోచనల్ని, బాధని ఆత్మీయులతో పంచుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ క్షణంలో వారికి ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవచ్చు. లేదా అంత ఆత్మీయులు వుండి వుండకపోవచ్చు. ఆ ఒక్క క్షణమే వారి నూరేళ్ల జీవితాన్ని శాసిస్తుంది. జీవితంలో మనం ఎంత సంపాదించాం అన్న దానికన్నా, మనకి సమస్య వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని మన చేయి పట్టుకుని భవిష్యత్తువైపు నడిపే ఆత్మీయులు ఎందరున్నారన్నది చాలా ముఖ్యం.
– మనం నానుడిగా వింటూ వుంటాం… ‘అతను పరువుకి ప్రాణం పెట్టే మనిషి’, ‘పరువు పోయిందంటే ప్రాణం పోయినట్టే’ అని. పిల్లలు కులాంతర వివాహాలు చేసుకున్నారనో, అప్పుల వాళ్లు ఇంటి మీదకొచ్చి గొడవ పెట్టుకున్నారనో, సమాజంలో అవమానాలు ఎదురయ్యాయనో వాటిని ఎదుర్కోలేక కుంగిపోయేవాళ్లు చాలామంది వున్నారు. వీటన్నింటినీ పరువుకి లింకు పెట్టుకుని ఇంక సమాజంలో తలెత్తుకుని బతకలేమన్న భయంతో ఆత్మహత్యకి సిద్ధపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘పరువు’ అన్న పదానికి కొలమానంగానీ, సరైన నిర్వచనం గానీ ఎక్కడా లేదు.
– ఆత్మహత్య తలంపులున్న వ్యక్తి మాటల్ని, ప్రవర్తనని ముందుగా గుర్తించగలిగితే దాన్ని ఆపవచ్చు అన్నది చాలా మంది అభిప్రాయం. కానీ అందరి విషయంలో ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తి అందరితో సరదాగా, ఆనందంగా గడిపిన గంట తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని ఎంతో దిగ్భ్రాంతుల్ని చేస్తుంది. ఈ గంటలోనే ఏదో జరిగింది. ఏం జరిగింది? అన్నదే అందరి మనసుల్లో కలిగే అనుమానం. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల్నించి మనం వినే మాటలు… ‘అతనికి ఏ సమస్యలూ లేవు, ఎప్పుడూ హ్యాపీగా వుంటాడు. అన్ని విషయాలు మాతో షేర్ చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు’ అని. వాళ్ల మాటల్లో వాస్తవం లేకపోలేదు.
కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎదుటి వ్యక్తి గురించి మనం తెలుసుకోగలిగిన అంశాలు మూడు మాత్రమే. అతని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ప్రవర్తన. ఇవి ఆ వ్యక్తులు బాహ్యంగా ప్రదర్శించే అంశాలు. దీనికి సైకాలజీ కూడా కొంత తోడ్పడవచ్చు. కానీ మనిషి అంతర్‌దృష్టిని స్టడీ చేయగల శాస్త్రాలు ఇంకా కనిపెట్టబడలేదు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తితో మనకి ఎంత దగ్గరితనం వున్నా వాళ్ల మనసు లోతుల్లోని ఆలోచనల్ని పసిగట్టలేం.
భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోవడం చేతకాక క్షణికావేశంతో చేసుకునే ఆత్మహత్యలు ఇందుకు పూర్తి మినహాయింపని గుర్తించాలి.
– ఇంక వృద్ధులు దీర్ఘవ్యాధిగ్రస్థులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారంటే వాళ్లు జీవితపు చివరి అంచుల మీద నిలబడి వుంటారు. ఆర్థిక ఇబ్బందులు, వారున్న పరిస్థితుల్లో సరైన ఎమోషనల్ సపోర్ట్ లభించక పోవడం, ఒకరకమైన నిస్పృహ, నిరాశలకి గురికావడం ఇవన్నీ వాళ్లని ఆత్మహత్యలకి పురికొల్పుతాయి. నిజానికి వీరికి పరిష్కారం సూచించడం కూడా కష్టమే.
నివారణ సాధ్యమేనా?
జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనలో కలిగే ప్రతికూల ఆలోచనలే ఆత్మహత్యలకి పురిగొల్పుతాయి. నిజానికి ఎవరూ దీనిని ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. సహాయం అందించేందుకు అనేక మార్గాలు వున్నాయి. దానికి కావల్సిందల్లా మనసు విప్పి మాట్లాడటమే.
– ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆత్మహత్యల నివారణ కూడా ఒకటి. దీనిలో భాగంగానే 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల రేటును మూడింట ఒక వంతు తగ్గించే దిశగా కృషి చేయాలనేది సమితి ఉద్దేశ్యం. సమితి వెల్లడించిన అభిప్రాయం ప్రకారం మూలాలను కనిపెట్టగలిగినప్పుడే నివారణ సాధ్యపడుతుంది. అందుకు సమాజంలోని అన్ని రంగాలవారు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం వుంది.
– నిజానికి ఆత్మహత్య తలంపులు వున్న వ్యక్తి తమ బాధని బయటపెట్టారు అంటే సాయం కోసం చూస్తున్నట్టే లెక్క. ఏ భావోద్వేగమైనా తాత్కాలికమే. ఆ సమయంలో వాళ్లు కోరుకునేది కాన్ఫిడెన్షియల్, జడ్జిమెట్ ఫ్రీ సపోర్ట్ అన్నది గ్రహించాలి. వారి సమస్యల్ని మనం పరిష్కరించలేకపోవచ్చు. కానీ ఆ క్షణం మాత్రం ఆలోచనల నుండి వారిని బయటకు తీసకురాగలం.
బ సమస్య ఎదురైనప్పుడు మన దృష్టి సమాజంపైనా, చుట్టుపక్కలవారిపైన కాకుండా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యపైనే కేంద్రీకరించాలి. అప్పుడే మనకి స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది. మనంచేసే పనులు ఎవరికీ హాని కలిగించనంత వరకు మనల్ని ప్రశ్నించే హక్కు, అధికారం ఎవరికీ వుండదు. ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఎటువంటి మానసిక ఒత్తిడులు, ఆత్మహత్య తలంపులు వుండవు.
– పరువు అనేది స్థాయిని బట్టి ఏర్పడేది కాదు. కులం, ఆర్థిక హోదా, పదవి, కీర్తి ఇవేవీ పరువుతో ముడిపడి వుండవు. మనం వీటిని నిలబెట్టుకున్నా, కోల్పోయినా దాని గురించి మాట్లాడే అధికారం ఎవరికీ వుండదు. అవన్నీ వ్యక్తిగత అంశాలు మాత్రమే. ఈ విషయాలపై అవగాహన పెంచుకోగలిగితే ప్రాణం విలువ అర్థం చేసుకోగలుగుతారు. పరువు అనేది ఒక సోషల్ ఇల్యూజన్ మాత్రమే.
– ప్రభుత్వాలు మత్తుపదార్థాలు, బెట్టింగుల వంటి అసాంఘిక చర్యలపై సత్వరమే దృష్టి సారించి, నిబద్ధతతో నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ విషయంలో ప్రజలు కూడా తమ బాధ్యతని తెలుసుకుని ప్రభుత్వానికి సహకరించాలి. అన్ని రంగాల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యపడేది. దీనిపై పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా వుంది.
– జరిగిపోయిన సంఘటనలనే తలచుకుంటూ ఆ నిరాశలోనే వుండిపోకూడదు. మనం ఎదుర్కొన్న ఓటమి, అవమానాలు ఎంత తీవ్రమైనవయినా వాటిని అంగీకరించాలి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తగిన ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో మిశ్రమ ఫలితాలు వుంటాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఫలితం ఏదైనా పాజిటివ్‌నే స్వీకరించాలి.
– జీవితాన్ని ప్రేమించే వ్యక్తులు తమ భావోద్వేగాలకి తామే గేట్‌కీపర్‌గా నిలబడతారు. ప్రతికూలమైన ఆలోచనలకి గానీ, విమర్శలకి గానీ ప్రధాన్యతలేని అంశాలకి గానీ ఏ మాత్రం స్పందించరు. వారు భవిష్యత్తు మీద నమ్మకం, లక్ష్యం పట్ల అంకితభావం, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా లేచి నిలబడగలమన్న ఆత్మస్థైర్యంతో వుంటారు. ఈ లక్షణాల్ని అలవరచుకోగలిగితే ఆత్మహత్య అన్న ఆలోచనే రాదు.
భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలుగా షాహెన్‌షాగా వెలుగొందుతూ, నేటికీ చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి నటుడిగా, వ్యక్తిగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అమితాబ్‌బచ్చన్. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆయన చలన చిత్ర రంగంలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఆయన పర్సనాలిటీ, వాయిస్ చూసి పరిశ్రమ ఆయన్ని తిరస్కరించింది. ఆలిండియా రేడియోకి వాయిస్ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు కూడా ఆయనకి అదే అనుభవం ఎదురైంది. అయినా ఆయన ఎక్కడా వెనుకంజ వేయలేదు. పట్టుదలతో, కృషితో, భవిష్యత్ మీద నమ్మకంతో ముందుకు నడిచారు. ఏ పర్సనాలిటీ, వాయిస్ కారణంగా చిత్ర పరిశ్రమ మొదట ఆయన్ని తిరస్కరించిందో ఆ రెండే ఆయనకు గొప్ప గుర్తింపు తెచ్చాయి. అతికొద్ది కాలంలోనే భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఆయన్ని కూడా ఒకరిగా నిలబెట్టాయి.
ఆయన స్థాపించిన ఎబిసిఎల్ సంస్థ ఆర్థిక మాంద్యానికి గురైనప్పుడు వందల కోట్ల నష్టాన్ని ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో ఆయన నటించిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అయ్యాయి. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటన్నింటికి తోడు ఆయన వుంటున్న ఇల్లు కూడా వేలం వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఆయన ఆలోచనలు మాత్రం ఆత్మహత్యవైపుకి వెళ్లలేదు.
ఆ సమయంలో ఆయన్ని నిలబెట్టింది రెండే అంశాలు. ఒకటి ఆయన కుటుంబం, రెండు ఆత్మస్థైర్యం, భవిష్యత్తు మీద నమ్మకం. ‘ఓటమి వ్యక్తుల్ని నాశనం చేస్తుంది. లేదా నిజమైన వ్యక్తుల్ని బయటికి తీస్తుంది’ అని ఒక ఇంటర్య్వూలో అమితాబ్ చెప్పారట. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ నడిచాను కాబట్టి మళ్లీ ఈ స్థాయిలో నిలబడగలిగాను’ అంటారు మన షాహెన్‌షా అమితాబ్ బచ్చన్. ఆచరించి చెప్పేవాళ్ల మాటలకి విలువ ఎక్కువ. ఆయన అనుభవాలు మనందరికీ స్ఫూర్తిదాయకమన్న విషయాన్ని ఈ సందర్భంలో మనందరం తప్పక అంగీకరించాలి.
ఆత్మహత్య ఎంత తీవ్రమైన సమస్యగా పరిణమించిందో మనకి అర్థం అవుతోంది. కాబట్టి దాని నివారణకి మనందరం సమిష్టిగా ముందడుగు వేయాలి. దీనిపై విస్తృతమైన చర్చలు జరగాలి. ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. కేవలం ఆత్మహత్యల నివారణపైనే కాకుండా భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించటంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సమాజం ఎప్పటికప్పుడు మార్పుల్ని సంతరించుకుంటుంది. ఆ మార్పుని స్వీకరించినప్పుడే మనం విజయవంతంగా ముందడుగు చేయగలం.
నిపుణుల సలహా అవసరం
నా పేరు నాగేష్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైన్సులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. రోష్నీ సంస్థ డిసెంబర్ 1997 లో స్థాపించారు. అప్పటి నుంచి వాలంటీర్‌గా సేవలందిస్తున్నాను. వత్తిరీత్యా నేను ప్రభుత్వరంగ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా వివిధ శాఖలలో పనిచేసి పదవీ విరమణ చేశాను. Roshni సంస్థలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. వాలంటీర్‌గా విధులు నిర్వర్తించడానికి నా కుటుంబం నుంచి పూర్తి సహాయసహకారాలు లభిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలలో రకరకాల వ్యక్తులతో ఫోన్ ద్వారా, ముఖాముఖిగా మాట్లాడడం, వారి సమస్యలు, బాధలు అర్థం చేసుకుని మానసికంగా వారికి అండగా నిలవడం లాంటివి చేస్తున్నాను. ప్రతివొక్కరి జీవితంలో సహజంగానే ఒడిదుడుకులుంటాయి. అవి కొన్నిసార్లు మనల్ని ఒంటరితనంలోకి, ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో మన బాధ పంచుకోడానికి, చెప్పుకోడానికి ఎవరూ లేనప్పుడు జీవితం మీద విరక్తి, జీవించడానికి కారణాలు కనిపించవు. మన ఆలోచనలు ఆత్మహత్య వైపు మళ్లడానికి ఎక్కువసేపు పట్టదు. అటువంటి పరిస్థితిల్లో ఉన్నవారి బాధలను ఓర్పుతో విని, అర్థంచేసుకుంటూ ఓదార్పునిస్తూ మానసికంగా వారికి ఒక తోడుగా ‘రోష్ని’ సంస్థ హైదరాబాదు నగరంలో సేవలు అందిస్తోంది. ఎలాగయితే మనకి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళతామో అలాగే మనకి మానసికంగా ఆందోళన, ఒత్తిడి కలిగినప్పుడు ఆ బాధను మరొకరితో పంచుకోడమో, మమ్మల్ని సంప్రదించడమో, నిపుణుల సలహాలు తీసుకోడమో చేస్తే ఎలాంటి తప్పు లేదు. అది చాలా అవసరం కూడా. సెప్టెంబర్ 10, ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినంగా పరిగణిస్తారు. ఈ దిశగా Roshni సంస్థ నిరంతరంగా తనవంతు కషి చేస్తోంది. ఇందులో నేను కూడా ఒక భాగమయినందుకు చాలా గర్వపడుతున్నాను.
- గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్,
ఫ్యామిలీ కౌన్సిలర్