విద్యుత్ స్తంభాల కేబుళ్ల పునరుద్ధరణపై హైకోర్టు వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు ఉండటం వల్ల జరిగే ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారనీ, తమకు సంబంధం లేదని ప్రభుత్వ శాఖకులు అంటే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల రామంతపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఆరుగురు మరణించిన ఘనట తర్వాత ప్రభుత్వం ఆదేశించడంతో కేబుళ్లను నోటీసు ఇవ్వకుండా అధికారులు తొలగించారని పేర్కొంటూ భారతి ఎయిర్ టెల్ బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ నగేష్ భీమపాక బుధవారం విచారణ జరిపారు. కేబుళ్ల వల్ల జనం ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. కేబుళ్ల పునరుద్ధరణకు అనుమతించాలన్న సర్వీసు ప్రొవైడర్ అభ్యర్థనపై స్పందిస్తూ మనుషుల ప్రాణాలపట్ల సామాజిక బాధ్యత లేదాని ప్రశ్నించారు. ఒకే ఘటనలో ఆరుగురు చనిపోయారనీ, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సర్వీసు ప్రొవైడర్లు, జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్ అందరూ బాధ్యులేనని అభిప్రాయపడ్డారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. తదుపరి విచారణ వరకు కేబుళ్లను తొలగించవద్దని ఆదేశించారు. తొలగించిన కేబుళ్ల పునరుద్ధరణకు ఉత్తర్వుల జారీకి నిరాకరించారు. ఒక్కో కరెంటు స్తంభానికి రూ.1100 చొప్పున రూ.21 కోట్లు చెల్లించామని పిటిషనర్ లాయర్ వివరించారు. నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా కేబుళ్లను కట్ చేసిందన్నారు. టీజీపీసీడీఎల్ కౌన్సిల్ స్పందిస్తూ. ఒక స్తంభానికి పరిమితికి మించి కేబుళ్లు ఉంటున్నాయని చెప్పారు. జనం ప్రాణాలు పోతున్నాయని, జనమే లేనప్పుడు కేబుళ్లు ఉండీ ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ కేబుళ్ల పునరుద్ధరణకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చారు. ప్రజల ప్రాణాలకు బాధ్యతెవరు తీసుకుంటారని అడిగారు. మనుషులే లేకపోతే కేబుళ్లు, ఇంటర్నెట్ ఎందుకని అన్నారు. ప్రజల ప్రాణాలపట్ల కనికరం చూపాలని హితవు చెప్పారు రాతపూర్వక వాదనలు సమర్పించిన తరువాత తగిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
స్టే తొలగించండి
సాదా బైనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం 2020లో ఇచ్చిన జీవో అమలును నిలిపివేస్తూ ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబరులో జారీ చేసిన జీవో 112ను సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు జీవోపై స్టే ఇస్తూ 2020 నవంబరు 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టేను ఎత్తివేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా చట్టంలో నిబంధనలు లేవనీ, ప్రస్తుతం కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014కు ముందు 12ఏండ్లుగా సాదా భైనామాల ద్వారా భూమి స్వాధీనంలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం సుమారు 9.24 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. వాటి క్రమబద్ధీరకణకు స్టే తొలగించాలని కోరారు. విచారణ 26కు వాయిదా పడింది.
ఏజన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్‌పై పిటిషన్ కొట్టివేత
ఏజన్సీ ప్రాంతాల్లోని పంచాయతీ ఎన్నికల్లో 100 శాతం రిజర్వేషన్ల కల్పనలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారనీ, చట్టాలను తీసుకురావాలంటూ ప్రభుత్వాలకు తాము ఆదేశాలు జారీ చేయలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. షెడ్యూల్ ప్రాంతాల్లోని పంచాయతీల్లోని సర్పంచ్ పోస్టులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ నాన్‌ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.రమణారెడ్డి వాదనలు వినిపిస్తూ కొన్ని గ్రామాల్లో గిరిజనులు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నప్పటికీ 100 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు లేక ఎన్నికలు జరగడంలేదన్నారు. గతంలో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలైనా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న ధర్మాసనం గత తీర్పులతోపాటు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదనీ, అందువల్ల ఈ పిటిషన్‌లో ఉత్తర్వులు జారీ చేయడానికి ఎలాంటి కారణం లేదంటూ కొట్టివేసింది.
ఏజన్సీ ప్రాంతాల విలీనంపై పిటిషన్
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో షెడ్యూల్ ప్రాంతాలను విలీనం చేయడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 5వ షెడ్యూల్‌లోని ఏజన్సీ ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ న్యాయవాది జె.శివరాం ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. దీనిపై రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చి పిటిషన్‌కు నెంబరు కేటాయించాలని ఆదేశించింది.
మేజర్ యువతి నిర్బంధం సరికాదు
మైనర్‌గా ఉన్నపుడు సంరక్షణకు తీసుకున్న బాలిక మేజర్ అయిన తరువాత ఆ యువతి ఇష్టానికి విరుద్ధంగా స్టేట్ హౌంలో నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదంటే మహిళా శిశు సంక్షేమశాఖకు ఆదేశాలు జారీ చేసింది. యువతి ఇష్ట ప్రకారం తన అత్తతో వెళ్లడానికి అనుమతించాలని ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేండ్ల కిందట బాలికను ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతోపాటు మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ గృహం సంరక్షణలో ఉంచారు. ఈ యువతిని అప్పగించాలని కోరుతూ అత్త హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి బాలికకు 18ఏండ్లు నిండినందున నిర్బంధంలో ఉంచుకోవడం చెల్లదని పేర్కొంది. పిటిషనర్‌తో వెళ్లడానికి యువతి అంగీకరించినందున ఆమెను అప్పగించాలని ఆదేశించింది. అయితే నెలకోసారి యువతి బాగోగుల గురించి ఆరా తీయాలని శిశు సంక్షేమ శాఖకు ఆదేశించింది. అంతేగాకుండా ఏదైనా సాయం అవసరమైతే ప్రభుత్వం, లేదంటే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయింవచ్చంటూ యువతికి సూచిస్తూ పిటిషన్‌ను ముగించింది.
ప్రాణాలకు బాధ్యత ఉండాలి కదా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES