Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంరాజ్‌భవన్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌ మాత్రమే పోయింది

రాజ్‌భవన్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌ మాత్రమే పోయింది

- Advertisement -

– ఇతర ఏ దొంగతనమూ జరగలేదు
– పంజాగుట్ట ఏసీపీ మోహన్‌ కుమార్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌ మాత్రమే నిందితుడు దొంగిలించాడని, అక్కడ ఇతర ఏ వస్తువూ పోలేదని పంజాగుట్ట ఏసీపీ మోహన్‌ కుమార్‌ తెలిపారు. రాజ్‌భవన్‌లో హార్డ్‌డిస్క్‌ చోరీ కేసుకు సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బయటి వ్యక్తులు వచ్చి రాజ్‌భవన్‌లో దొంగతనం చేశారని, రాజ్‌ భవన్‌కు సంబంధించిన కీలక విషయాలు ఉన్న డాక్యుమెంట్స్‌ పోయాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే, చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగే హార్డ్‌ డిస్క్‌ను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. రాజ్‌భవన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో టి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను ఓ మహిళా ఉద్యోగిని ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనివాస్‌ను ఈ నెల 12న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా అతన్ని విధుల నుంచి రాజ్‌భవన్‌ అధికారులు సస్పెండ్‌ చేశారు. అయితే రెండ్రోజుల్లోనే శ్రీనివాస్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఇదిలా ఉండగా, ఇటీవల రాజ్‌ భవన్‌ ప్రాంగణంలోని సుదర్శన భవన్‌లో హార్డ్‌ డిస్క్‌ మాయమైంది. ఈ వ్యవహారంపై ఈనెల 14న రాజ్‌భవన్‌ ఐటీ మేనేజర్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి హెల్మెట్‌ ధరించి కంప్యూటర్‌ రూంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భాగంగా రాజ్‌ భవన్‌లో పనిచేసి ఫొటోల మార్ఫింగ్‌ కేసులో అరెస్టయిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతనే హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లినట్టు తేలడంతో అతని నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించారు. ఫొటోల మార్ఫింగ్‌ విషయంలో తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో హార్డ్‌ డిస్క్‌ను నిందితుడు దొంగిలించినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -