Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసెప్టెంబర్‌ 9 లోపు యూరియా ఇచ్చే పార్టీకే

సెప్టెంబర్‌ 9 లోపు యూరియా ఇచ్చే పార్టీకే

- Advertisement -

– ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర రైతులకు కావాల్సిన రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సెప్టెంబర్‌ 9 లోపు ఇచ్చిన పార్టీకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లే ఎరువుల కొరత ఏర్పడిందనీ, ప్రతి గ్రామంలో రైతులు క్యూ లైన్‌లోగంటల తరబడి వేచి ఉండి మరీ కొనుగోలు చేస్తున్నారన్నారు. యూరియాను అక్రమ పద్ధతుల్లో తరలించి కాంగ్రెస్‌ నాయకులే బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు.

కేసీఆర్‌ పదేండ్ల పాలనలో యూరియా కొరత లేదని గుర్తుచేశారు. సీజన్‌కు ఆరు నెలల ముందు 24 గంటలు పర్యవేక్షణ చేసి ఎరువులను తీసుకొచ్చే వారన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్‌, బీజేపీలు ఎలక్షన్లు, కలెక్షన్లంటూ నాటకాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం విడుదల చేయకుంటే క్షేత్రస్థాయిలో పోరాట కార్యాచరణను ప్రటిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్‌, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. యూరియా కొరతపై పార్లమెంటులో రాహుల్‌ గాంధీ ఎందుకు నిలదీయలేదని అడిగారు. రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడి వేడుకుంటున్నా కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వీడటం లేదని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ముందస్తు ప్రణాళికతో ఒకటిన్నర ఏడాది కాలంలోనే గోదాముల సామర్థ్యాన్ని నాలుగు లక్షల టన్నుల నుంచి 24 లక్షల టన్నులకు పెంచినట్టు తెలిపారు. సీజన్‌ మొదలైనా కాంగ్రెస్‌ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించలేదనీ, ఎరువుల సరఫరా చేయాలని కేంద్రాన్ని అడగలేదనీ, ఇంటెండ్‌ పంపకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందని తెలిపారు. అధికారులపై రైతులు తిరగబడకుండా పోలీసులు పహారా పెట్టుకున్నారన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం లోపం కూడా సరఫరా ఆలస్యానికి కారణమని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు వరుస కష్టాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ఎరువుల కొరత లేదనీ సీఎం చెబుతుంటే, కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారనీ, ఇందులో ఏది నిజమని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎరువులను పంపించినా అవి క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రామచందర్‌ రావు చెబుతున్నారనీ, అంటే అవి పక్కదారి పట్టాయా? పడితే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఏం చేస్తున్నది? అని కేటీఆర్‌ నిలదీశారు. రామగుండం ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీ యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ జరిగే ప్రాంతాలకు వెళ్లి కేసీఆర్‌ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో రైతులకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు వివరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై మేం చర్చిస్తామన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల తేదీ నాటికి తమ వైఖరిని వెల్లడిస్తామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే తమ నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్చితంగా వ్యతిరేకిస్తామనీ, ఆ పార్టీ చిల్లర పార్టీ, థర్డ్‌ క్లాస్‌ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థిని మేం ఎలా సపోర్ట్‌ చేస్తాం? అని ప్రశ్నించారు. బీసీల మీద ప్రేమ కురిపించే కాంగ్రెస్‌ పార్టీ మరి బీసీ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు? కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా అని కామెంట్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలతో తెలంగాణకు పైసా ప్రయోజనం రాదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదన్నారు. 11 ఏండ్లుగా తెలంగాణకు బీజేపీ చేసింది గుండుసున్నా అని ఆయన విమర్శించారు. మద్దతు కోసం తమను ఏ కూటమి సంప్రదించలేదని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad