కొరతకు ప్రభుత్వమే కారణం
ప్రజలు తీవ్రంగా నష్టపోయారు
ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు
ప్రజల వద్దకు వెళ్తే సంక్షోభం లోతు అర్థమవుతుంది : సీపీఐ(ఎం) రాజ్యసభాపక్షనేత జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో నెలకొన్న వంటగ్యాస్ సంక్షోభంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టాయి. సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. సోమవారం రాజ్యసభలోని జీరో అవర్‌లో వంటగ్యాస్ సంక్షోభంపై దుమారం రేగింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ఒకవైపు వంటగ్యాస్ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. గల్ఫ్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్యాస్ సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు, వాణిజ్య వినియోగదారులను ప్రభావితం చేస్తోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్పీజీ లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే విమర్శించారు. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతకు కేంద్రమే కారణమని అన్నారు. మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభంతో దేశంలో రెస్టారెంట్లు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని వివరించారు. దేశంలో 60 శాతం వంటగ్యాస్ దిగుమతి అవుతుందనీ, ఇందులో 90 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుందని తెలిపారు. ఎల్పీజీ సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆయన అన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు. అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21-25 రోజులకు పెంచారనీ, ఇది బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళికకు నిదర్శనమని అన్నారు. ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుందని ఖర్గే ఆరోపించారు.
ఒక సరైన ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పీజీ సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. అయితే ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సభా నాయకుడు జెపి నడ్డా స్పందించారు. జీరో అవర్‌లో సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నప్పుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాలు ఏమాత్రమూ వెనక్కి తగ్గకుండా వంటగ్యాస్ సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండగానే చైర్మెన్ సిపి రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. మళ్లీ జెపి నడ్డా మాట్లాడటం ప్రారంభించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని అన్నారు. అంతేకాదు.. అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్తంగా కారణాల వల్లే తలెత్తిందని వివరించారు.
ప్రజల వద్దకు వెళ్తే సంక్షోభం లోతు అర్థమవుతుంది: జాన్ బ్రిట్టాస్
ఎల్పీజీ సంక్షోభం లేదని చెప్పుకుంటున్న పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, సహాయ మంత్రి సురేశ్ గోపిలను సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ ఎద్దేవా చేశారు. వారు ప్రత్యేక విమానం అద్దెకు తీసుకుని దేశవ్యాప్తంగా ప్రయాణిస్తే, సంక్షోభం లోతు అర్థమవుతుందని అన్నారు. ”పలు రాష్ట్రాల్లో చాలా రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి. కేరళలో కళాశాలలు, ఆస్పత్రులు కూడా క్లోజ్ అయ్యాయి. క్యాంటీన్లు లేకుండా ముందుకు సాగడం అసాధ్యమైన పరిస్థితిలో మూసివేత అనివార్యమైంది.
సురేశ్ గోపి సినిమా డైలాగ్‌లు పునరావృతం చేయడం వల్ల ఈ సంక్షోభం పరిష్కారం కాదు. దేశంలో కోవిడ్ కాలంలో జరిగినటువంటి సంక్షోభం తలెత్తింది. పాత్రలతో చప్పుళ్లు కొట్టడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించలేము. రెండు ఎల్పీజీ ఓడలు రావడాన్ని ప్రభుత్వ వర్గాలు పెద్ద విషయంగా చిత్రీకరిస్తున్నాయి. అయితే, రెండు రోజుల వినియోగానికి మూడు ఎల్పీజీ ఓడలు అవసరమని గణాంకాలు చూపిస్తున్నాయి. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు లేకపోవడంతో పాటు, బ్లాక్ మార్కెటింగ్ విస్తృతంగా ఉంది. ఎల్పీజీ సంక్షోభం ఇతర రంగాలలో కూడా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది” అని జాన్ బ్రిట్టాస్ హెచ్చరించారు.



