ఫిల్మ్ అకాడమీకి నిధులివ్వం : ఇజ్రాయిల్ మంత్రి బెదిరింపు
టెల్ అవీవ్ : పాలస్తీనా బాలుడిపై తీసిన సినిమాకు ఇజ్రాయిలీ ఆస్కార్ అవార్డు రావడంతో ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి కస్సుబుస్సులాడారు. ఇజ్రాయిల్ ఫిల్మ్ అకాడమీకి, అది అందించే వార్షిక అవార్డులకు ఇక నిధులు ఇవ్వబోమని బెదిరించారు. ఇజ్రాయిలీ ఆస్కార్‌గా భావించే ఆర్ఫిన్ అవార్డులలో ‘ది సీ’ అనే చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. షాయి కార్మెలీ పొల్లాక్ ఈ చిత్రానికి దర్శకుడు, రచయిత. బాహర్ అగ్బారియా నిర్మాత. ఓ బాలుడు వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లా నుంచి కోస్తా ప్రాంతంలోని టెల్ అవీవ్‌కు ప్రయాణించడమే ఈ చిత్ర ఇతివృత్తం. ఆస్కార్స్‌లో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఇజ్రాయిల్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ చిత్రానికి ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. 13 సంవత్సరాల బాలుడు మహమ్మద్ ఘజావీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఈ గౌరవాన్ని పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు, నామినీలు ఇజ్రాయిల్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. శాంతితో జీవించేందుకు ప్రతి చిన్నారికీ హక్కు ఉన్నదని ఈ చిత్రం చెబుతోందని నిర్మాత తెలిపారు. కాగా అవార్డుల ప్రదానోత్సవం జరిగిన తర్వాత ఇజ్రాయిల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి ‘అవమానకరమైన ప్రదర్శన’కు ప్రభుత్వ నిధులు నిలిపివేస్తానని ప్రకటించింది. అవార్డు గెలుచుకున్న చిత్రం పాలస్తీనా కోణాన్ని ఆవిష్కరించిందని, ఇజ్రాయిల్‌ను కించపరచిందని విమర్శించింది. ఈ అవార్డులను ‘ఇజ్రాయిల్ పౌరుల ముఖాలపై ఉమ్మి వేయడం’గా సాంస్కృతిక మంత్రి మికి జోహార్ అభివర్ణించారు. ఈ చిత్రం ఇజ్రాయిల్ సైనికులను అగౌరవపరచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రభుత్వమే అవార్డులు ఇస్తుందని చెప్పారు. దేశ విలువలు, స్ఫూర్తిని ప్రతిబింబించే చిత్రాలను అందులో గౌరవిస్తామని తెలిపారు.
పాలస్తీనా బాలుడిపై తీసిన సినిమాకు ‘ఆస్కార్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES