– సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజల నిర్ణయానికి గ్రామపంచాయతీ పూర్తి మద్దతు ఉంటుందని భిక్కనూర్ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ తెలిపారు. భిక్కనూరు పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభలో రసాయన కంపెనీల పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎం,ఎస్,ఎన్ కంపెనీ భూమి కొనుగోలులో భాగంగా 14 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించబడ్డాయని యువకులు ఆరోపించగా పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు రాతపూర్వక మెమోరండం ఇస్తే సర్వే చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జెన్ జడ్ పరిశ్రమకు పూర్తి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లబోమని స్పష్టం చేశారు.
గ్రామానికి నష్టం కలిగించే రసాయన పరిశ్రమలను అనుమతించబోమని హామీ ఇచ్చారు. రసాయనేతర పరిశ్రమలకు మాత్రం స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. ఫ్యూజన్ కంపెనీ వ్యతిరేకంగా ప్రజలు చేసిన సంతకాల తీర్మానాన్ని గ్రామసభ ఆమోదించింది. అనంతరం గ్రామస్తులు గ్రామంలోని సమస్యలు గ్రామసభ దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని సర్పంచ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



