”పిల్లలు మలచవలసిన వస్తువులు కాదు. తెలుసుకోవలసిన వ్యక్తులు” అన్నారు జెస్ లైర్ అనే అమెరికన్ రచయిత. ‘పిల్లలు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు .మనం ఎలా మలిస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటారు’ అనేది తరతరాలుగా మన పెద్దల నుండి వింటున్న మాట. ఈ రెండిటికీ ఎంత తేడా ఉందో కదా! ఇంతకీ ఇందులో ఏది అనుసరించాలి? ఎలా పెంచితే పిల్లల్ని సరిగ్గా పెంచినట్టు? అమ్మమ్మల నాటి పద్ధతులా? అంతర్జాలంలో లభ్యమవుతున్న నిపుణుల సలహాలా? తొలిసారి తల్లితండ్రులయిన వారిని తికమక పెట్టే సందేహాలెన్నో తలెత్తుతాయి. తెలిసిన వారు, తెలియని వారు తమకు తోచిన సలహాలను అడగకపోయినా ఇస్తూనే ఉంటారు. ఏ ఒక్కరి అభిప్రాయాలూ తప్పు కాదు.. ఏ ఒక్కరి సలహాలను తోసిపుచ్చలేం. ఎందుకంటే పిల్లల పెంపకానికి అంత ప్రాముఖ్యత ఉంది మరి! (నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా)
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలకమైన దశ. ఎవరికైనా చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో భద్రంగా ఉంటాయి. బిడ్డ పుట్టిన నాటి నుండి మొదటి ఆరునెలల్లో వాళ్ళు పొందే ప్రేమానురాగాలు భవిష్యత్తులో వాళ్ళ అనుబంధ బాంధవ్యాలని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా! నవజాత శిశువు రోజులో ఎక్కువ శాతం పడుకునే ఉంటుంది. మెలుకువగా ఉన్న కాసేపట్లో వాళ్ళకు పాలు పట్టడం, మిగతా అవసరాలు మాత్రమే చూస్తే చాలనుకుంటే పొరపాటే! వాళ్ళతో ఎన్నో ఊసులు చెప్పాలి, పాటలు పాడాలి. ముఖ్యంగా వాళ్ళ ఊఊలు, ఉంగాలకు బదులివ్వాలి. ఇవన్నీ వాళ్ళ మెదడులో నిక్షిప్తమవుతాయి. అమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు. నాన్న ఒడిలో వెచ్చని హాయిని చవి చూస్తారు. వాళ్ళు భద్రంగా ఉన్నామన్న భరోసా పొందుతారు. ఒకరకంగా పిల్లల్ని పెంచుతూ మనమూ మళ్ళీ ఆ దశకు వెళ్ళి బాల్యాన్ని ఆస్వాదిస్తాం. పిల్లలు పుట్టి మనకు మళ్ళీ బాల్యాన్ని అనుభవించే వరాన్ని ప్రసాదిస్తారు. అది ఎంతో అమూల్యమైనది కనుకనే పెంపకంలో ఏ పొరపాటు జరగకూడని ఆరాటపడేది. అతి జాగ్రత్తలు తీసుకునేది. వాళ్ళను వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండేది.
తల్లితండ్రులుగా ఎంత అప్రమత్తంగా ఉన్నా పిల్లల పెంపకంలో మన ముందుతరాల వారి కన్నా మనం వెనకపడుతున్నామా అన్న సందేహం రాకమానదు. పిల్లల పెంపకంలో ఒత్తిడి తీసుకోక తప్పట్లేదు. మొదట్లో చెప్పినట్లు ఒకప్పుడు పిల్లలు మనం మలిచే మట్టి ముద్దలు అనేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మూడేళ్ళ వయసు నుండే పిల్లలకూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించాల్సిన రోజులు వచ్చాయి. అందుకే జెస్ లైర్ పిల్లల్ని తెలుసుకోవాల్సిన వ్యక్తులుగా అభివర్ణించారు. ఈ రెండు సిద్ధాంతాలు పూర్తి భిన్నం. కానీ రెండింటిలోనూ మనం ఆచరణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
ప్రతీ ఒక్కరు ప్రత్యేకమే!
అన్నీ ఒకే తాను బట్టలనుకుంటే తప్పే! ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ అన్నీ సమానంగా చేయాలని అనుకోవడం సహజం. కానీ ఇద్దరికీ వేర్వేరు అవసరాలు ఉన్నప్పుడు ఒకేలా చేస్తే ఎలా? అందరి పిల్లలకు వాళ్ళ అవసరాలేంటో సూటిగా చెప్పుకోవడం రాకపోవచ్చు. కానీ వారిని నిశితంగా అధ్యయనం చేస్తే వాళ్ళ మనసు తెలుసుకోవడం కన్నవారికి కష్టమేమీ కాదు. ఉదాహరణకు ఒకరి ఆసక్తి ఆటల్లో ఉంటే, ఇంకొకరిది పాటల్లో ఉండొచ్చు. ఇప్పటి పిల్లలకు ఒక రకంగా వాళ్లకేం కావాలో స్పష్టమైన అవహగాహన ఉందనే చెప్పాలి. వాళ్ళ అభిప్రాయాలను చిన్నవిగా కొట్టిపారేయకుండా, పెద్ద మనసుతో ఆ పసి మనసులను అర్ధం చేసుకోవలసిన బాధ్యతే మనదే!
అతిజాగ్రత్తతో జాగ్రత్త!
నేటి తరం తల్లితండ్రుల్లో దాదాపు తొంబై శాతం మంది కాలు కింద పెడితే కందిపోతారేమో అన్నట్టు పెంచుతున్నారు. మన బిడ్డలు మనకు అపురూపమే! కానీ మన ప్రేమే వాళ్ళ కాళ్ళకు సంకెళ్ళు వేస్తోందన్న సంగతి విస్మరిస్తున్నాం. ఏడాది వయసులో తప్పటడుగులు వేస్తుంటే పడిపోతారేమో అని నడవనియ్యక పొతే నడక వస్తుందా? మూడేళ్లప్పుడు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఏడుస్తున్నారని బడికి పంపడం మానేస్తామా? మట్టిలో ఆడితే వ్యాధులు వస్తాయని ఆడనివ్వట్లేదు. కానీ రసాయనాలు కలిపిన కతిమ మట్టిని దగ్గరుండి మరీ కొనిస్తున్నాం. వాళ్ళ స్నేహితుల విషయంలో, ఆటల్లో ఇలా ప్రతీ దాంట్లోనూ అతిగా జోక్యం చేసుకోవాలని వాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వైఫల్యం అనేదే రుచి చూడకపోయినా తమని తాము అసమర్థులుగా భావించుకుంటారు. ఎల్లవేళలా కాపు కాస్తూ కూర్చోలేం కదా! కిందపడితేనే కదా పైకి లేవాలనే విషయం స్ఫురణకు వస్తుంది. చిన్న వయసులో చేసే తప్పులను వాళ్ళకు వాళ్ళే సరిద్దిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అప్పుడే మన పిల్లలు స్వతంత్రులుగా ఎదుగుతారు.
పిల్లల మాటలు వినాలి!
పెద్దవాళ్లుగా ఎంత సేపు మనకు తెలిసింది పిల్లలకు చెప్పాలి అని ప్రయత్నిస్తుంటాం. కథలు, కబుర్లతో వాళ్ళను సంతోషపెడతాం. ఇదంతా మూడేళ్ళ వయసు వరకు బాగుంటుంది. తరువాత పిల్లల సజనాత్మకత పెరుగుతుంది. వాళ్ళు మనకు చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఓపికగా వినే సమయం మనకుండాలి. చాలా సందర్భాల్లో మనం పనిలో ఉన్నపుడు వాళ్ళు మనకి ఏదో చెప్పాలని వస్తుంటారు. మనం వారిని ఖాతరు చేయం. కావాలని కాకపోయినా పని ఒత్తిడి వలన జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లలు తల్లితండ్రుల వద్ద తమకు ప్రాముఖ్యత లేదనే భావం కలుగుతుంది. పదేపదే ఇలా జరగడం వలన పిల్లల్లో ఆత్మన్యూనతా భావం బలపడుతుంది. ప్రస్తుత ఉద్యోగ సంస్కతిలో ఇల్లు, ఆఫీస్ తేడా లేకుండా పోయింది. కనుక పిల్లలకు ఎలా నడుచుకువలో అర్ధమయ్యే రీతిలో వివరించాలి కానీ విసుక్కోవడం మంచిది కాదు.
శతి మించే క్రమశిక్షణ
‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు. పిల్లలు ఆలోచనకు ఏది వస్తే అది చేసేస్తారు. కొన్ని సార్లు అదే అల్లరి పనులవుతుంటాయి. కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేయాలి. క్రమంగా సరిదిద్దుతూ వారికి నేర్పించాలి. అలా కాకుండా దండనే అన్నిటికీ మార్గం అనుకుంటే పిల్లల పట్ల మీకెంత ప్రేమ ఉన్నా వారి మనసులకు మాత్రం మీరు చేరువ కాలేరు. అంతేకాక కోపం వ్యక్తీకరించడం చేతకాక మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు మనం డిజైన్ చేసే ప్రోగ్రాంతో నడిచే రోబోలు కాదు. అన్నిసార్లూ మనం చెప్పినట్టే నడుచుకోలేరు. మీ అంచనాలను అందుకోలేక ఎప్పటికప్పుడు నిరుత్సాహపడటం వాళ్ళకు అలవాటవుతుంది. అలాగని క్రమశిక్షణారాహిత్యం కూడా ప్రమాదమే సుమా! ఉదయాన్నే నిద్ర లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చెయ్యాలి. సమయపాలన మన జీవనశైలిని సులభతరం చేస్తుంది. అందువల్ల పిల్లలకు చిన్నప్పటి నుండే అలవాటు చేస్తే మంచిది. కానీ పిల్లలు ఏదైనా అలవాటు పడాలంటే ముందు పెద్దలు ఆచరించాలి.
పోలిక చాలిక!
పదేళ్ళ కిందటి వరకు ఇరుగుపొరుగుతో పోటీ పడటం, పోల్చుకోవడం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో పరపతి కోసం పోటీపడుతున్నాం. ఇన్‌స్టాగ్రామ్లో పిల్లాడు అద్భుతాలు చేస్తుంటే అవి చూసి మనింట్లో పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాం. ప్రతీ పిల్లవాడు అద్భుతమే అని తెలుసుకునే మానసిక పరిపక్వత మనకు ఎప్పుడు వస్తుందో అర్ధం కావట్లేదు. భౌతిక రూపాన్ని, తెలివితేటల్ని, సామర్ధ్యాలను పోల్చి పిల్లలను కించపరచకండి. పిల్లల్లో పోటీతత్వం సహజంగానే ఉంటుంది. వాళ్ళు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకుని ప్రోత్సహించాలి. ఆసక్తి, ఉత్సాహం అనేవి బాల్యంలో మెండుగా ఉంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సహించడమే మన పని.
మితిమీరే ప్రణాళికలు
ఉమ్మడి కుటుంబాలకు మనం ఎప్పుడో స్వస్తి పలికాం. కారణాలు అనేకం. తల్లితండ్రులిద్దరూ పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాదాపు అన్ని కుటుంబాల్లోనూ కనిపిస్తోంది. ఇంట్లో పిల్లల్ని ఉంచితే స్క్రీన్‌లతోనే సావాసం చేస్తున్నారు. వాళ్ళను డిజిటల్ భూతం నుండి కాపాడమే పెద్ద పనైపోతోంది. ఫలితంగా పిల్లలు ఇంట్లో కన్నా రకరకాల కోచింగ్ క్లాస్సుల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజంతా ఊపిరి సలపని ప్రణాళికతో ఉక్కిరిబిక్కిరవుతున్న పిల్లల పరిస్థితిని ఒక్కసారి మనసుతో చూడండి.
వారంలో ఐదు రోజులు పనిచేస్తున్న మనకి రెండు రోజులు వారాంతపు విశ్రాంతి కావాలని కోరుకుంటున్నాం. అలాంటిది పదేళ్లు కూడా నిండని పిల్లలకు ఆదివారం సెలవు రోజు కూడా ప్రణాళికలేనా? వాళ్ళతో క్లాసుల చుట్టూ మనమూ తిరుగుతున్నాం కానీ పిల్లలతో ప్రశాంతంగా వారంలో ఒక రోజు కూడా గడపలేకపోతున్నాం. పిల్లలు అష్టైశ్వరాలకన్నా అమ్మానాన్నల ప్రేమను, తాతాబామ్మల గారాబాలనే కోరుకుంటారు. మనసు సంతోషంగా ఉంటేనే చేసే పని మీద మనసు పెట్టగలం. కోచింగ్ క్లాసుల్లో కన్నా పదేళ్ళలోపు పిల్లలకు కుటుంబంతో ఆడుతూపాడుతూ, కలిసి భోజనం చేస్తూ, కబుర్లు చెప్పుకుంటే గడిపే సమయం ముఖ్యం.
డిజిటల్ బేబీ సిట్టింగ్
”నేను పనిలో ఉన్నాను కన్నా” అంటే అర్ధంచేసుకోలేక పిల్లలు మారాం చేస్తుంటే ”కాసేపు నీకిష్టమైన కార్టూన్ చూసుకో” అని ఫోన్ ఇవ్వకుండా పిల్లల్ని సముదాయించే తల్లితండ్రులు ఎంత మంది ఉన్నారో మీకు మీరే ప్రశ్నించుకోండి. కానీ…లు, కారణాలు కాదు కేవలం సమాధానం మాత్రమే తెలుసుకోండి. ఈ విధంగా మనమే పిల్లలకు స్క్రీన్ టైం అలవాటు చేస్తున్నాం. రెండేళ్ళ లోపు పిల్లలకు అసలు స్క్రీన్ టైం ఉండకూడదని డాక్టర్లు మొత్తుకుంటున్నా మనం పట్టించుకోవట్లేదు. పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎనిమిదేళ్ళ పిల్లలకు స్థిరత్వం ఉండట్లేదు. ప్రతీ ఐదు నిమిషాలకు వారికీ ఏదొక కొత్త వ్యాపకం కావాలి. లేకపోతే విసుగుచెందిపోతున్నారు. ఇవన్నీ స్క్రీన్‌ల వలన వచ్చిన సమస్యలు కాదంటారా? పిల్లలు గొడవ చేయకుండా ఉండాలంటే స్క్రీన్ కావలసిందే అనే పరిస్థితికి వాళ్ళను తీసుకెళ్ళింది ఎవరు? ఆలోచించుకోండి. నష్టం జరిగాక సరిదిద్దుకోవడానికి వాళ్ళు వస్తువులు కాదు.. మన పిల్లలు!
ఆంక్షలతో కూడిన ప్రేమ/ అపరిమితమైన ప్రేమ
పిల్లలకు లక్ష్యాలు పెట్టి అవి సాధించినపుడేమో ఆకాశానికి ఎత్తేసి, అందుకోలేపోయినపుడు తక్కువగా చూస్తే వాళ్ళ మనసులు గాయపడతాయి. ఏదైనా సాధిస్తేనే వాళ్ళంటే ప్రేమ ఉంటుందేమో అనే ఆలోచన వాళ్లలో పుడుతుంది. అలాంటి అనుభవాలు రెండు మూడు ఎదురయితే ఆ ఆలోచన బలపడిపోతుంది.తల్లితండ్రుల ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుందనే విషయం వాళ్లకు అర్ధం చేసుకునే వయసు లేదు. పరీక్షల్లో ఫెయిలయితే ఇంట్లో మొహం చూపించలేమనుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న విద్యార్థులను మనం చూస్తున్నాం.
అపజయాలు కూడా జీవితంలో భాగమే అనే స్పహ పిల్లలకు కలిగించాలి. జయాపజయాలు వాళ్ళపై గల ప్రేమను నిర్వచించవని వాళ్ళకు స్పష్టంగా తెలియాలి. పిల్లలు నిరాశలో ఉన్నప్పుడు అమ్మ ప్రేమే పరమౌషధం. ఆంక్షలు ఒక రకంగా పిల్లల్ని ప్రభావితం చేస్తే, అతిగారాబం పిల్లలను పూర్తిగా పెడదారులు పట్టిస్తుంది. తాము ఏం చేసినా తప్పు కాదు అనే ధోరణి అలవడుతుంది. ఎవరైనా వాళ్ళ ధోరణిని తప్పు పడితే సహించలేరు. తల్లితండ్రుల ప్రేమ పిల్లలకు హేతువుగా ఉండాలి గానీ వాళ్ళను లోకంలోని వాస్తవాలను చూడనివ్వకుండా, వాళ్ళ ఎదుగుదలకు శత్రువుగా మారకూడదు.
ఆర్ధిక క్రమశిక్షణ
మనం మోయగలిగిన బరువెంతో ఎదిగే పిల్లలకు కచ్చితంగా తెలియాలి. మనకి కష్టమైనా పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం వల్ల వారికి మన వాస్తవ స్థితి తెలియదు. అంచనాలు పెరుగుతాయి. అలాగే కొన్న వస్తువు విలువ తెలిసేలా పెంచాలి. రెండు మూడేళ్ళ వయసులో అర్ధం కాదు. ఆ తర్వాత నేర్పకపోతే వస్తువుల పట్ల నిర్లక్ష్య ధోరణి చూపడం అలవాటయిపోతుంది. ఒకప్పుడు తల్లితండ్రులు చేతిలో డబ్బు ఖర్చుపెట్టడం పిల్లలు చూసేవారు. కానీ ఇప్పుడు యూపీఐ వలన డబ్బులు ఫోన్లోనే ఉన్నాయనుకుంటున్నారు. రీల్స్ స్క్రోల్ చేస్తే ఒకదానివెనుకొకటి వచ్చినట్టు డబ్బు కూడా అలాగే వస్తుందన్న అపోహలో ఉంటున్నారు. ఎదిగే పిల్లలకు సంపాదించడానికి మీరు పడే కష్టం విలువ తెలియనివ్వండి. ‘డబ్బులు ఊరికే రావని’ వాళ్ళు తెలుసుకోవాలి.
స్వయంనిర్దేశిత విద్య
పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో ‘మనకు ఈ అవకాశం దొరకలేదు కనుక మన పిల్లలకు ఈ విద్య నేర్చుకునే అవకాశం కల్పించాలి’ అనుకుంటారు. పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగించే వాహకంగా మాత్రమే మీరు పని చేయాలి. ఏ మార్గంలో వెళితే ఎలా ఉంటుందో వారినే తెల్సుకోనివ్వండి. వాళ్ళతో చర్చించండి. ఇవాళ సమాచారానికి కొదువ లేదు. ఈ విధంగా స్నేహితులతో మాట్లాడడం, చర్చల్లో పాల్గొనడంతో పాటు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం కూడా నేర్చుకుంటారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అలాగే వాళ్ళు ఎంచుకుని నేర్చుకునే విద్య చక్కగా వంటబడుతుంది.
జీవన నైపుణ్యాలు
‘చదవడం రాకపోయినా పర్లేదు కానీ బతకడం తప్పనిసరిగా రావాలి’. ఒకప్పుడు పదేళ్లు వచ్చేసరికి నాన్నతో సరుకులు తేవడం, అమ్మతో సంతకు వెళ్ళి కూరలు కొనడం, చెల్లెలు ఏడిస్తే ఎత్తుకుని ఆడించడం, నాయనమ్మకు సూదిలో దారం ఎక్కించడం లాంటి పనులు ఎవరూ చెప్పకుండానే పిల్లలు చేసేవారు. ఇప్పుడు కనీసం మంచి నీళ్లు తాగిన గ్లాసు కూడా సింకులో పెట్టాలన్న ఆలోచన రావట్లేదు. ఇంట్లో పని అందరూ పంచుకోవాలనే స్పృహ వాళ్ళలో కలగాలి. మనుష్యుల పట్ల, వస్తువుల పట్ల బాధ్యత తెలియాలి. అలా అయితేనే వాళ్ళు రేపొక ఇంటిని సమర్ధవంతంగా నిర్వహించ గలుగుతారు. ఇవన్నీ స్కూళ్లలో లైఫ్ స్కిల్స్ పేరిట ప్రత్యేకంగా తరగతులు పెట్టి మరీ నేర్పించాల్సిన పరిస్థితిలో మనం ఉండటం శోచనీయం.
బాలసాహిత్య ప్రభావం
చిట్టి చిలకమ్మతో మొదలయ్యే చిలకపలుకులు మూడేళ్లకే మూగబోతున్నాయి. కథలు కంచికెళ్ళాయి. అమ్మమ్మలు ఓటీటీలకు వెళ్లారు. తల్లితండ్రులు యుట్యూబ్లో ఉంటే పిల్లలు డిస్నీలో ఉంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే! ఇంక బాలసాహిత్యం పిల్లలకు చేరువ ఎక్కడ అవుతోంది? బాలసాహిత్యం పిల్లల ప్రపంచం. పిల్లలకు భాషా జ్ఞానాన్ని , ఆలోచనా పరిధిని విస్తతం చేసి వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విజ్ఞాన గని. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు సంతోషాన్నిచ్చే సాధనం. పుస్తకాలకు మనం దూరమై పిల్లల్ని దూరం చేస్తున్నాం.
కథలు చరిత్రను చెబుతూనే భవిష్యత్తు గురించి కలలు కనేలా వాళ్ళను ప్రేరేపిస్తాయి. సాంకేతికత వలన సాహిత్యం ఆడియో రూపంలో కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. దీనివలన పిల్లల్లో గ్రహణ శక్తి, సూక్ష్మదృష్టి పెరుగుతుంది. అరచేతిలో అన్నీ ఉన్నా మనం వాటిని స్వద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. సాహిత్యం పిల్లల సజనాత్మకతకు, భావుకతకు రూపాన్నిచ్చేలా వారిని ప్రోత్సహిస్తుంది. బాలసాహిత్య రచయితలు నేటి తరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాయాలి. కథల్లో కొత్తదనం ఉండాలి. బాలల సర్వతోముఖాభివద్ధికి తోడ్పడే సాహిత్య సృజన కావాలి.
ఆటలు
ఆటలు గురించి చివరలో ప్రస్తావించాల్సి రావడం బాధాకరమే! నిజానికి అవి నేటి పిల్లల బాల్యంలో ఆఖరు బెంచీలో ఉన్నాయి కూడా! ఇసుక తిన్నెల్లో, మట్టి నేలల్లో కాదు కదా కనీసం రోడ్ల మీద ఆడే పిల్లలు కూడా కనపడట్లేదు. శారీరక ఆలసత్వమే కాదు పిల్లల్ని మానసిక ఆలసత్వం కూడా ఆవహిస్తోందనిపిస్తోంది. ఆటలంటే అలుపెరుగని పిల్లలు నేడు ఆడాలా అన్నట్టు చూస్తున్నారు. శరీరం కదల్చడానికే ఇష్టపడట్లేదు. పిల్లలకు కాసేపు శారీరక వ్యాయామం ఉండాలంటే అది కూడా ఏదొక స్పోర్ట్స్ సెంటర్‌కు పంపాల్సి వస్తోంది. ఆ అవకాశం లేని పిల్లలు ఇళ్ళల్లో టీవీలకు బానిసలైపోతున్నారు. ఆటలు శరీరానికే కాదు మనసుకీ చాలా అవసరం.
పౌష్టికాహార లోపం కూడా పిల్లల్లో అనాసక్తికి కారణం. ఆహారం, ఆటలు, ఆనందం బాల్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్ని విషయాలు చర్చించినా పిల్లల మనసు ఒక పట్టాన అంతుచిక్కదు. వాళ్ళంతే.. ఎవరికీ వారే ప్రత్యేకం. అందుకే పిల్లల పెంపకానికి ఎన్ని సిద్ధాంతాలున్నా, పెంపకంలో తలెత్తే సందేహాలను పూర్తిగా నివత్తి చేయలేకపోతున్నాయి. మీ పిల్లల కోసం మీరు పెంచే విధానాన్ని ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషించుకోండి. ఈ బాలలదినోత్సవం సందర్భంగా మన పిల్లల అభిరుచులను తెలుసుకుందాం, అభిప్రాయాలను గౌరవిద్దాం, ఆలోచనలను స్వాగతిద్దాం, సంతోషకరమైన బాల్యాన్ని వాళ్ళ సొంతం చేద్దాం. బాల్యం ఎవరికీ తిరిగిరాదు… పిల్లల రూపంలో తల్లితండ్రులకు తప్ప!
- డా. హారిక చెరుకుపల్లి, 9000559913


