ట్రంప్ నిర్ణయాల పట్ల ప్రధాని మోడీ అసహనం
గాంధీనగర్ : ప్రధాని మోడీకి ఏం చేయాలో పాలుపోనంతగా ట్రంప్ షాకులతో దడపుట్టిస్తున్నారు. యూఎస్ పర్యటనలకు వెళ్లినపుడు మోడీ అక్కడి ప్రవాస భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ ట్రంప్‌నకు ఎన్నికల్లో సహకరించాలని కోరిన విషయం విదితమే. తాజాగా ట్రంప్ పేల్చిన హెచ్..1బీ రుసుం బాంబు దెబ్బకు మోడీ తట్టుకోలేక పోతున్నారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని వ్యాఖ్యానించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
‘నేడు భారత్ ”విశ్వబంధు” స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోడీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశం భరించాల్సిన నష్టాల్లో షిప్పింగ్ రంగం ఒకటని మోడీ పేర్కొన్నారు. 50 ఏండ్ల క్రితం మన దేశంలో తయారుచేసిన నౌకలనే మనం ఉపయోగించు కొనేవాళ్లమని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రంగం పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. వారి ప్రభుత్వ హయాంలో స్వదేశంలో నౌకల తయారీపై దృష్టిపెట్టకుండా విదేశీ నౌకలకు అద్దెలు చెల్లించేందుకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అందువల్లే ఇప్పటికీ మన వాణిజ్యంలో 90శాతం విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నా మన్నారు. ఇందుకుగాను మనం ఏటా రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇది దేశ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువన్నారు. దీనికి ముందు భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు.