కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి ”ఎన్డీయేలో చేరండి నిధులు పెంచుతాం”.. అంటున్నారు కేంద్రమంత్రి రాందాస్ అథావలే. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు. అవివేకమూ అనాలోచి తమైన తొందరపాటు మాత్రమే కూడా కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఆలోచనా ధోరణికి అద్దం పట్టే బహిరంగ ప్రకటన. భారత రాజ్యాంగ స్ఫూర్తిపై, సమాఖ్య వ్యవస్థ పునాదులపై నేరుగా చేసిన దాడి. అదే సమయంలో కేరళ ప్రజలకు ఇది ఒక బెదిరింపు కూడా. త్వరలో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. మీ రాష్ట్రానికి నిధులు ఆపకూడదంటే ఎవరికి ఓటేయాలో తేల్చుకోండి అన్న బీజేపీ బ్లాక్‌మెయి లింగ్ రాజకీయాలకు, బరితెగింపుకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ నిధులు దాని పాలక కూటమికి విధేయత చూపిన రాష్ట్రాలకు ఇచ్చే బహుమతులు కావు. అవి దేశ ప్రజలపై వసూలు చేసిన పన్నుల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు. రాజ్యాంగపరమైన ఆ హక్కులను రాజకీయ ఒప్పందాలుగా మార్చే ప్రయత్నమే ఈ వ్యాఖ్యలోని అసలైన ఉద్దేశం. కేంద్రానికి ఉన్న ఆర్థికాధికారం రాష్ట్రాలను లొంగదీసుకునేందుకు ఉపయోగించాల్సిన ఆయుధం కాదు. కానీ ”ఎన్డీయేలో చేరండి నిధులు పెంచుతాం” అన్నమాట నిధులిచ్చే హక్కు కేంద్రానికి ఉందన్న తప్పుడు భావనను ఎత్తిచూపుతోంది.
భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడగలగడమే ప్రజాస్వామ్యానికి కీలకం. రాష్ట్రాల ఆర్థిక వనరులను కుదించి, వాటిని కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం అనేది కేవలం పరిపాలనా మార్పు కాదు, అది రాజకీయ అధికారాన్ని కూడా కేంద్రీకరించే ప్రక్రియ. బీజేపీ పాలనలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాల స్వంత పన్నుల హక్కులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పన్నుల వసూళ్లపై కేంద్రం పూర్తి నియంత్రణ సాధించింది. రాష్ట్రాలు తమ అభివృద్ధి ప్రాధాన్యతలను స్వయంగా నిర్ణయించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. పన్నుల కేంద్రీకరణకు తోడు, ఆర్థిక నియంత్రణలు రాష్ట్రాలను మరింత బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్‌టీ పరిహారాన్ని ఆలస్యం చేయడం, అప్పులపై కఠిన షరతులు విధించడం, కేంద్ర పథకాల పేరుతో రాష్ట్రాలపై భారాన్ని మోపడం.. ఇవన్నీ రాష్ట్రాల ఖర్చుపెట్టే సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కేరళకు నిధులు ఇవ్వాలంటే ఎన్డీయేలో చేరాలన్న షరతు రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రజలు తమకు నచ్చిన రాజకీయ దారిని ఎంచుకున్నందుకు శిక్ష విధించడమే. ప్రజల తీర్పును గౌరవించకుండా, అధికార బలంతో రాష్ట్రాలను కేంద్రానికి విధేయులుగా మలచాలనే ఆలోచన నయా ఫాసిస్టు ధోరణికి ప్రతిబింబం.
ఇది ఆరెస్సెస్-బీజేపీ రాజకీయ ప్రాజెక్టును స్పష్టంగా చూపిస్తోంది. బహుళత్వం, లౌకికత, సమాఖ్య స్వభావం.. ఈ మూడింటినీ కూలదోసి, ఒకే దేశం-ఒకే పార్టీ-ఒకే ఆలోచన అనే ప్రమాదకర దిశగా దేశాన్ని నడిపించాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ భిన్నత్వాన్ని ధ్వంసం చేసే ఈ ఏకీకృత విధానానికి కేరళ వ్యతిరేకం. మతతత్వ రాజకీయాలకు తలవంచని చరిత్ర కేరళ ప్రజలదీ, అక్కడి లెఫ్ట్ ప్రభుత్వానిది. ఆ చరిత్ర తెలిసి కూడా అథావలే ఈ వ్యాఖ్యలు చేయడం దుస్సాహసమే. అందుకే సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన చర్యలపై రాజీ పడబోమని స్పష్టంగా చెప్పడం కేవలం రాజకీయ ప్రతిస్పం దన మాత్రమే కాదు, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి చేసిన ప్రకటన. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. రాష్ట్రాల నుంచి ప్రజా వనరులను కేంద్రం చేజిక్కించుకుని, వాటిని కార్పొరేట్ పెట్టుబడికి అనుకూలంగా మళ్లిస్తోంది. పెద్ద కార్పొరేట్లకు పన్ను రాయితీలు, భూములు, ఇతర మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మాఫీలు ఇస్తూ…రాష్ట్రాల సంక్షేమ ఖర్చులను ”ఫిస్కల్ డిసిప్లిన్” పేరుతో కుదిస్తోంది.
దీన్ని ప్రశ్నించే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ”విరోధులు”గా మారుతున్నాయి. కేరళ లాంటి రాష్ట్రాలు ప్రశ్నించడమే కాదు, ఈ కార్పొరేట్ అనుకూల ఆర్థిక మోడల్‌కు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. ప్రజారోగ్యం, విద్య, సంక్షేమంపై పెట్టుబడి పెట్టడం ద్వారా మానవాభి వృద్ధిని కేంద్రంగా చేసుకున్న పాలనా మోడల్‌ను కేరళ అనుసరిస్తోంది. అందుకే అది కేంద్ర ఆర్థిక దాడికి ప్రధాన లక్ష్యంగా మారింది. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ఆర్థికంగా శిక్షించడం ద్వారా, చివరికి ప్రజాస్వామ్యాన్ని ఖాళీ చేయాలన్న ప్రయత్నం బీజేపీది. ఫెడరలిజం ధ్వంసమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్ర పథకాల అమలు యంత్రాలుగా మారతాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించే శక్తిని కోల్పోతాయి. రాజకీయ బహుళత్వం, ప్రాంతీయ వైవిధ్యం, ప్రజాస్వామ్య చైతన్యం అన్నీ క్రమంగా మాయం అవుతాయి. దీన్ని కేరళలో వామపక్ష ప్రభుత్వం సవాలు చేస్తోంది. అందుకే కేంద్రం కేరళపై వివక్షకు, కక్ష సాధింపుకు పూనుకుంటోంది. ఇది ఇలాగే సాగితే ”ఎన్డీయేలో చేరితేనే అభివృద్ధి” అనే వైఖరి చివరికి భారత రాజ్యాంగానికీ, సమాఖ్య స్ఫూర్తికీ ముప్పుగా మారుతుంది. ఈ ముప్పును ఎదుర్కొనే బాధ్యత ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి రాష్ట్రానిదీ, ప్రతి పౌరుడిది. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, భారతదేశ భవితవ్యానిది.
బరితెగింపు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



