సుమారు రూ.30 లక్షల నష్టం
నల్లగొండ జిల్లా వేములపల్లిలో ఘటన
నవతెలంగాణ- వేములపల్లి
వరి పొలాల్లో మేతకు వదిలిన గొర్రెలు విషాహారం తిని 150కు పైగా మృత్యువాతపడ్డాయి. దీంతో కాపరుల జీవితాలు రోడ్డునపడ్డాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం, అనంతారం, దోసపాడు గ్రామాలకు చెందిన ఉప్పునూతల సైదులు, శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాలు, ఆవుల కోటయ్య, ఆవుల వెంకన్న తమ గొర్రెలను కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలోని మడికట్ల(వరి కోసిన పొలాలు)లో మేపుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 80 గొర్రెలు, గురువారం 70 గొర్రెలకు పైగా మృత్యువాతపడ్డాయి. పొలాల్లో చెల్లాచెదురుగా అక్కడక్కడా పడిపోయాయి. వాటి విలువ సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న గొర్రెలు కండ్ల ఎదిటే చెల్లాచెదురుగా పడిపోయి విగతజీవులుగా మారడంతో కాపరులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
గొర్రెలను పరిశీలించిన వెటర్నరీ జేడీఏ
వెటర్నరీ జేడీఏ జివి రమేష్, ఏడీఏ జూలకంటి వెంకట్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని గొర్రెలను పరిశీలించారు. గొర్రెలను చనిపోవడానికి కారణాలను కాపరులను అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విష ఆహారంగానీ, విషపు నీరు వల్లగానీ మృత్యువాతపడి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. వారి వెంట వెటర్నరీ వైద్యులు అశోక్, జ్ఞానేశ్వర్ ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
విషాహారం తిని 150కిపైగా గొర్రెలు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



