Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభారతీయ రసాయనశాస్త్ర పితామహుడు పి.సి.రాయ్

భారతీయ రసాయనశాస్త్ర పితామహుడు పి.సి.రాయ్

- Advertisement -

ఆచార్య ప్రఫుల్ల చంద్రరారు భారతదేశం సగర్వంగా చెప్పుకోదగ్గ దేశభక్తుడు. భారతీయ రసాయన శాస్త్ర పితామహుడే కాదు, భారతీయ పారిశ్రామిక రంగ పితామహుడు కూడా! శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌, మానవవాది, బహుభాషా కోవిదుడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేశానికి సర్వస్వం అర్పించిన త్యాగశీలి. ఇలా ఎన్నిరకాలుగా చెప్పుకున్నా ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ (2 ఆగష్టు 1861- 16 జూన్‌1944) గురించి ఇంకా కొన్ని విశేషాలు మిగిలిపోతూనే ఉంటాయి. ఒకరకంగా సాధారణ వ్యక్తుల్లో అసాధారణమైన వ్యక్తి. అంతర్జాతీయ వైజ్ఞానిక పరిశోధనా రంగం గుర్తించి, చేపట్టాల్సిన పరిశోధనల్ని ప్రొఫెసర్‌ పి.సి.రాయ్ ఒక రసాయనిక శాస్త్రవేత్తగా ఒంటిచేత్తో చేసి చూపించాడు. భారత దేశం వంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, ఖరీదైన మందులను దిగుమతి చేసుకోవడాన్ని చూసి భరించలేక పోయాడు. ఆయనలోని ఆర్ధికవేత్త, మానవవాది బయటికి వచ్చాడు. ఆ దిశలో తన పరిశోధనలు కొనసాగాలని కార్యరంగంలోకి దూకాడు.
మొదట జంతు కళేబరాల్లోంచి ఎముకలు తీసి, వాటిలోంచి మందుల తయారీకి కావల్సిన మూలకాల్ని తయారు చేశాడు. ఇది జనానికి మింగుడు పడలేదు. కాని, దిగుమతి చేసుకున్న విదేశీ మందుల కన్నా ఈ స్వదేశీ మందులే బాగా పని చేస్తున్నాయని అటు వైద్యులు, ఇటు సామాన్య ప్రజలు గుర్తించారు. 1896లో పి.సి. రాయ్ కనుగొన్న రసాయనిక మూలకం మెర్యురస్‌ నైట్రేట్‌ గురించిన పరిశోధన పత్రాలు ఇటు ఇంగ్లాండ్‌లోనూ అటు జర్మనీలోనూ అచ్చయ్యాయి. దాంతో సర్‌ హెన్రీ రస్నేతో పాటు ప్రపంచ శాస్త్రవేత్తలంతా అబ్బురపడ్డారు. వసతులు సరిగా లేని భారతదేశం నుండి ఇంతటి పరిశోధన వెలువడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాటి బెంగాల్‌లోని రాయ్త్‌-కాటి పర్‌లో ప్రఫుల్ల చంద్రరారు 1861 ఆగష్టు 2న జన్మించాడు. ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌లో ఉంది. తండ్రి హరీష్‌చంద్ర చౌదరి తల్లి భువన మోహినీ దేవి. పి.సి.రాయ్ బాల్యం నుండి సైన్సు- సాహిత్యం ఇష్టపడేవాడు. మెట్రో పాలిటన్‌ ఇనిస్టిట్యూట్‌ కాలేజిలో చదివాడు. (1880) ఈ సంస్థ ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ నెలకొల్పింది. తండ్రి ఆస్తిపరుడేమీ కాకపోయినా, కొడుకు బాగా చదువుకుని గొప్పవాడు కావాలని కలలు కనేవాడు. తండ్రి కలలను అర్థం చేసుకున్న పి.సి.రాయ్, భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు శాస్త్రాలు అభ్యసించాడు కళాశాలలో చురుకైన విద్యార్థిగా గుర్తింపబడడంతో పాటు – తండ్రిపై భారం పడకుండా, బ్రిటన్‌లోని ఎడింబరో యూనివర్సిటీ గిల్‌ క్రైస్ట్‌ స్కాలర్‌షిప్‌ సంపాదించాడు. ఆ రోజుల్లో ఈ స్కాలర్‌షిప్‌ భారతదేశం నుండి ఇద్దరికే వచ్చింది. ఒకరు ప్రఫుల్ల చంద్ర అయితే, మరొకరు బహద్దూర్‌ జీ.
బొంబాయికి చెందిన పార్సీ విద్యార్థి! 1882లో ఇంగ్లాండ్‌ వెళుతు న్నప్పుడు ప్రఫుల్ల చంద్రకు ఓడలో ద్వారకానాథ్‌ రాయ్ పరిచయ మయ్యాడు. ఆయన అప్పుడు వైద్యశాస్త్రం చదవడానికి వెళుతున్న విద్యార్థి. ప్రఫుల్ల చంద్ర ఎడింబరో విశ్వవిద్యాల యానికి చేరేనాటికి అక్కడే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జగదీశ్‌ చంద్రబోస్‌ విద్యార్థిగా ఉన్నాడు. జగదీశ్‌ చంద్రబోస్‌ మెజిస్ట్రేట్‌ కొడుకు. ఖరీదైన కేంబ్రిడ్స్‌ చదువును భరించగలిగాడు. ప్రఫుల్లచంద్ర పేదరికంలో నుంచి వచ్చినవాడు. పైగా స్కాలర్‌షిప్‌పై వెళ్లినవాడు. ఎలాగైతే నేం ఇద్దరు మహనీయులు బ్రిటన్‌లో కలిసి గొప్ప స్నేహితులయ్యారు. వైజ్ఞానికంగా మాతృదేశానికి ఎనలేని సేవలు అందించారు. కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించి పెట్టారు. తర్వాత కాలంలో ఇద్దరూ బ్రిటిష్‌ ప్రభుత్వంతో ‘సర్‌’ బిరుదు సాధించుకొచ్చారు. పరాయి పాలనలో ఉంటూ కూడా, దేశ గౌరవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయారు. ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయమిది!
డాక్టరేట్‌ సాధించి, స్వదేశం తిరిగివచ్చిన పి.సి.రాయ్, ఉద్యోగం లేక ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. బ్రిటీష్‌ అధికారుల పక్షపాతానికి, నిర్లక్ష్యానికి గురై ‘నిరుద్యోగ జీనియస్‌’గా కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. చివరకు ప్రొవెన్షియల్‌ సర్వీసెస్‌లలో నెలకు రెండు వందల యాభై జీతం మీద అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో స్థిరపడాల్సి వచ్చింది. కానీ, అనతి కాలంలోనే ప్రొఫెసర్‌గా, రీసర్చెర్‌గా ఎవరూ ఊహించనంతగా రాయ్ ఎదిగిపోయాడు. ఎన్నో స్వదేశీ, విదేశీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ప్రఫుల్ల చంద్ర – మాతృభాషల్లో బోధన జరగాలన్న” ఆలో చనను తొలిసారిగా ప్రవేశపెట్టాడు. స్వాతంత్య్రం రాకముందే, దేశంలో జరగాల్సిన ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలికాడు. ఆలోచిస్తే అది ఎంత విప్లవాత్మకమైన సూచనో అర్థం అవుతుంది.
1888-1916 మధ్య కాలంలో 28 ఏండ్లు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజిలో కెమిస్ట్రీ, డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన పి.సి.రాయ్ మళ్లీ ఇక్కడ కొంతకాలం సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌తో కలిసి పనిచేశాడు. అయితే ఆయన ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉండేవాడు. ఆ రోజుల్లో ప్రఫుల్ల చంద్ర తన ఇంటినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. కసాయివాడి దగ్గర పశువుల ఎముకలు కొనుక్కుని వచ్చి, తన ఇంటి ఆవరణలో ఒక గోతిలో వేస్తూ ఉండేవాడు. ఆ ఎముకలు కాల్చి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈ పిచ్చి ప్రొఫెసర్‌ పనులేమిటని చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయేవారు. ఒక్కోసారి భయకంపితులయ్యేవారు. ఎందుకంటే, ఆయన పశువుల ఎముకల్ని కాలుస్తూ ఉండేవాడు. కొంతమంది దుర్వాసన భరించలేక, మరి కొంతమంది మండే ఎముకల్ని చూసి భయపడి, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండేవారు. పి.సి.రాయ్ తన ప్రయోగాలు కొనసాగిస్తుండగా పోలీసులు రావడం, బెదిరించి ఆపు చేయించడం జరుగుతూ ఉండేది. అలా చుట్టుండే సమాజం – పోలీసుల బాధపడలేక విసిగిపోయి ఉన్నప్పుడు ఒక మిత్రుడు వచ్చి-ఊరిబయట నిర్జన ప్రదేశంలో ఒక స్థలాన్ని చూపించాడు. అందుకు తగిన సహ కారం అందించాడు. ఇకనేం రాయ్ తన మకాం ఊరి బయటికి మార్చాడు. ప్రయోగాలు కొనసాగించి చివరకు విజయం సాధించాడు.
సమాజాన్ని ముందుకు నడిపించాలనుకున్న ఏవ్యక్తి అయినా, మొదట సమాజం విసిరే రాళ్లను భరించాలి – ఆ విషయం ఆయనకు అనుభవం మీద తెలిసొచ్చింది! చుట్టు పక్కల ప్రజలు, పోలీసులే కాదు తర్వాత కాలంలో మున్సిపల్‌ అధికారులు కూడా రంగ ప్రవేశం చేసి – అందరికందరూ ఆయన్ను చంపుకుతిన్నారు. తను మాంత్రికుడిని కాదని, ఒక పరిశోధకుడిననీ – ఇవన్నీ తను హత్యచేసి చంపిన మనుషుల ఎముకలు కావని, కొనుక్కుని వచ్చిన పశువుల ఎముకలనీ ప్రపుల్ల చంద్ర నిరంతరం అందరికీ అన్ని చోట్లా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఎవరెన్ని బాధలు పెట్టినా, ఎవరెంతగా హింసించినా ఆయన తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు, ఆయన చేయాలనుకున్న పరిశోధనలు ఆపలేదు. అందుకే నేను ప్రతిచోట ఒక విషయం పదేపదే చెపుతుంటాను. జీవితాల్ని త్యాగం చేసి, సమాజ ఉద్దరణకు కృషిచేసిన శాస్త్రవేత్తల్ని మానవవాదులుగా మొదట గుర్తించండని! వారి వైజ్ఞానిక కృషి గురించి విద్యాలయాల్లో బోధిస్తారు కానీ, వారి వ్యక్తిగత జీవితం గురించి, వారి త్యాగాల గురించి కూడా అన్ని స్థాయిల్లో విద్యార్థులకు బోధిస్తూ ఉండాలి. అది యువతీయువకుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రఫుల్ల చంద్రరాయ్ చేసిన పరిశోధనలు ఏవంటే- ఆయన ఎముకల బూడిదకు సట్ఫారిక్‌ ఆమ్లం కలిపేవాడు. వచ్చిన సున్నపు – సూపర్‌ ఫాస్ఫేటోకు సోడా కలిపేవాడు. దానితో సోడా ఫాస్ఫేట్‌ వచ్చేది. దాన్ని ఒక పెద్ద బేసిన్‌లో ఉంచి మరగబెడితే ఫాస్ఫేట్‌ క్రిస్టల్స్‌ ఏర్పడేవి. ఆ క్రిస్టల్స్‌లో ఒక చిన్న భాగాన్ని యువకుడైన ప్రఫుల్ల చంద్ర చప్పరించి చూశాడు. వృధాగా పోయే పశువుల ఎముకల నుండి వైద్య పరమైన ఒక రసాయనిక మూలకం తయారయ్యిందని కనుగొన్నాడు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే మందుల కన్నా, దీన్ని ఇక్కడ తక్కువ ధరలో తయారు చేసుకోవచ్చని గుర్తించిన రాయ్, దానితో ఒక టానిక్‌ తయారు చేశాడు. తనకు పరిచయమున్న ఒకరిద్దరు డాక్టర్లకు ఇచ్చి పరిశీలించామన్నాడు. అంతే ఆ టానిక్‌ బాగా పనిచేస్తోందని వారు ధృవీకరించారు. అతి కొద్ది సమయంలోనే విషయం బెంగాల్‌ అంతా తెలిసిపోయింది. పి.సి.రాయ్ తయారు చేసిన టానిక్‌కు ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చింది. ఆవిధంగా ఒక రసాయనిక శాస్త్ర పరిశోధన – పరిశ్రమగా మారింది. అది ”బెంగాల్‌ కెమికల్‌ అండ్‌ ఫార్మా సుటికల్‌ వర్క్స్‌”గా రూపుదిద్దుకుంది. తర్వాత కాలంలో దేశంలోనే అది, అతి పెద్ద కెమికల్‌ ఫర్మ్‌గా మారింది. రసాయనిక శాస్త్రానికీ పారిశ్రామిక రంగానికి ప్రఫుల్ల చంద్రరాయ్ ఆద్యుడయ్యింది అందుకే!
ఒక వైపు కాలేజిలో బోధన, మరోవైపు పరిశోధన. ఇంకోవైపు బెంగాల్‌ ఫార్మా సూటికల్‌ ఫర్మ్‌ – ఇవన్నీ కాకుండా రచనలు చేయడం – అసలు ఊపిరి మెసలని పరిస్థి తుల్లో అన్నింటినీ కాదని స్వాతంత్య్రోద్యమంలోకి దూకడం-మరొక మలుపు! అప్పుడే ఆయన ఒకమాట చెప్పాడు. ”సైన్స్‌ కెన్‌ వెయిట్‌- స్వరాజ్‌ కెనాంట్‌” అని. ”సైన్స్‌ పరిశో ధనల్ని ఆపొచ్చు- కానీ స్వరాజ్యాన్ని సాధించుకోవడం ఆపలేం” అని అర్థం! ఆ రోజుల్లో ఆయనకు ప్రొఫెసర్‌గా లభించే ఎనిమిది వందల నెల జీతంలో కేవలం నలభై రూపాయలు తన ఖర్చులకు ఉంచుకుని, మిగతా డబ్బు సమాజాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఖర్చు చేసిన మహాత్ముడాయన. ఆయనది ఎంత గొప్ప వ్యక్తిత్వమో, ఎంతటి నిరాడంబర జీవితమో మన యువతీ యువకులకు చెపుతూ ఉండాలి. బ్రిటన్‌ నుండి తిరిగొచ్చాక సూటు బూటు వదిలేసి, సాధారణ భారతీయ పౌరుడి లాగా గడిపాడు. రారు వ్యక్తిత్వం గురించి గోపాల కృష్ణ గోఖలే ద్వారా తెలుసుకున్న మహాత్మా గాంధీజీ కంటే కూడా ఆయన ఇంకా…ఇంకా సాదాసీదా జీవితం గడిపేవాడు. విద్యార్థులకే కాదు సమాజంలో అందరికీ ‘ఆచార్యుడ’ని కితాబిచ్చాడు గాంధీ! ఆయన దేశభక్తినీ, త్యాగ నిరతిని, జ్ఞానపిపాసను శ్లాఘించాడు. శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త – అని కూడా గాంధీజీ ప్రశంసించాడు.
బెంగాలీలోనూ, ఇంగ్లీషులోనూ అనేక రచనలు చేసిన పి.సి. రాయ్, ”ఒక బెంగాల్‌ రసాయనిక శాస్త్ర వేత్త జీవితమూ – ప్రయోగము” శీర్షిక తన ఆత్మకథ రాసుకున్నాడు. అందులో ఒకచోట ఆయన తన కొర్రెను వెలిబుచ్చాడు. అదేమిటంటే – ”మళ్లీ తను ఈ దేశంలోనే రసా యన శాస్త్రవేత్తగా పుట్టి, ఇప్పుడు చేయలేని పరిశోధనలు మరిన్ని చేసి, ఈ దేశ ప్రజలకు వైజ్ఞానికంగా సేవచేయాలని ఉందని!” రాసుకున్నాడు. ఈ దేశం పట్ల దేశప్రజల పట్ల ఆయనకున్న గాఢమైన, లోతైన ప్రేమను ఆవిధంగా వ్యక్తం చేసుకు న్నాడు. బ్రహ్మచారిగా ఉండి, తన సర్వస్వం దేశానికి అర్పించిన దేశభక్తుడు. నిజానికీ ఆయన జీవితంలో ఉన్న కోణాలన్నింటినీ ఒక చిన్నవ్యాసంలో చెప్పలేం. అయినా ఆకాశాన్ని అద్దంలో చూపిన విధంగా ఆ మహనీయుడి గురించి ఈ నాలుగు మాటలు.
– వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -