Friday, November 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపకోడీలు…పకోడీలోయ్..!

పకోడీలు…పకోడీలోయ్..!

- Advertisement -

”నమస్తే సదావత్సలే మాతృభూమే!
త్వయా హిందుభూమే
సుఖమ్‌ వర్థితోహమ్‌” టీవీలో వస్తున్న ప్రార్థనా గీతాన్ని తన్మయుడై వింటున్నాడు బాబాయ్. అది భవిష్యత్‌ జాతీయ గీతమని ఆయన బలమైన అభిప్రాయం. అప్పుడెప్పుడో జాతీయోద్యమ సందర్భంగా ”పంజాబ, సింధు, గుజరాత, మరాఠా” అని రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాస్తే చెల్లుబాటైంది. కానీ, నేడా సింధు పాకిస్తాన్‌లోకి పాయే. పంజాబోళ్లేమో ఎప్పుడూ రైతుల్నేసుకుని రోడ్ల మీదే ఉంటారు. అయితే, గుజరాత్‌ మన పుణ్యభూమి కాగా, మరాఠాలు మన ఛత్రపతి వారసులు. పోతే సమస్యల్లా ఈ ద్రావిడుల్తోనేనని వింధ్య పర్వతాలావల గుప్పుమంటోంది. ఓ పిల్లకాకి సనాతన ధర్మాన్ని తిడతాడు. ఇంకో అడ్డపంచ పెద్దాయన అర్థం లేని మాటలు మాట్లాడతాడు. రాష్ట్రాలంటాడు, వాటికి హక్కులంటాడు.

అందుకే, ఈ గొడవంతా లేకుండా ఇంగ్లీషోడున్నపుడు రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యమంతా మ్యాప్‌లో ఒకటే రంగుండేది కదా! ఆ విధంగానే వాయువ్యాన బెలూచిస్థాన్‌ నుండి ఈశాన్య బర్మా వరకు కాషాయ రంగుండాలి. ఇక తిరంగాల్లేవు, ద్విరంగాల్లేవు. ఒకే రంగే. అది కాషాయ రంగే! అధినేత విజన్‌ ప్రకారం 2026 విజయదశమి నాటికే ఈ స్వప్నం సాకారమైయుండాలి. కాలేదు కాబట్టి 2047 ఆగస్టు 15 వరకు పొడిగించారు. ఆయన కుండలి ప్రకారం కర్కాటక (ఎండ్రకాయ) లగం ఐదు ఘడియకల్లా అనుకున్న కల సాకారం కావాలి అనుకుంటూ జింక చర్మం ఆసనం మెల్లిగా పరుచుకుని సెటిల్‌ అయ్యే సమయానికి అబ్బాయి ప్రవేశించాడు. దాంతో ఇహ లోకంలోకి వచ్చాడు బాబాయి.

బాబాయి : ఏరా అబ్బాయ్! ఎక్కడున్నాం మనం? అన్నాడు.
అబ్బాయి : (ఇక్కడే ఉన్నాం! అందామనుకున్నాడు. దాన్లోని శ్లేష అర్థమైతే బాబాయి కరుస్తాడని వెనక్కి తగ్గాడు) జనం లేవు, ఓట్లు లేవు! అన్నావ్‌!
బాబాయి : నేను చెప్పింది అలా అర్థమైందిరా సన్నాసీ! ఇప్పటివరకు ఈ ప్రపంచకంలో భరత వర్షాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్యమనేదెందుకు అనుకున్నావ్‌?! కచ్చితంగా ప్రతి ఐదేండ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయిక్కడ. వంద కోట్ల జనం బారులు తీరి మరీ ఓట్లేసే దేశం ఇంకోటి లేదని ఆంటోనియో గుట్టెరస్‌ కూడా తెగ ముచ్చటపడ్తున్న దేశం మనది. ఇక అలాంటి కష్టాలు మన ప్రజలకి రాకూడదని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నిటికంటే కీలకమైందీ, నీ మట్టిబుర్రకు తట్టనిది యంత్రాల వినియోగానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం, యంత్రాలంటే ఈవీఎమ్‌లనుకునేవురోరు! ఐదేండ్లకొకసారి కొందరికి క్వార్టరూ, ఇంకొందరికి హాఫో, ఫుల్లో పోయిస్తే ఓట్లేసే యంత్రం అవసరం ఇక ఉండదు. చేసిన శుష్క వాగ్దానాల అమలు కోసం ‘కుబేరుల’ను ఆశ్రయించాల్సిన పనిలేదు. వారి ముందు చేతులు కట్టుకుని నిలబడక్కర్లేదు. వారికోసం పనంటావా, ‘చట్టం తన పని తాను చేసుకు పోతుంద’న్నట్టు, వేలంలో పాట పాడుకున్నవారు వారిపని వారు చేసుకుపోతారు! అన్ని పార్టీలు అగ్ని పునీత సీతల్లాగ శ్వేతాంబరధారులై నిలుస్తారు! దేశం సస్యశ్యామలమవుతుంది (పోతులూరి వీరబ్రహ్మంలా ఫోజు పెట్టాడు బాబాయి)
అబ్బాయి : జడివాన ఆగిన తర్వాత మెల్లిగా పావురం పిల్ల నోరిప్పి ‘ఇంతకీ జనానికి ఏం ఉపయోగం బాబాయ్?’ అనడిగింది.
బాబాయి : ‘రామాయణమంతా విని రాముడికి సీతేమవుతుందని అడుగుతావేంట్రా పిచ్చినా కొడకా!?’ కోపంగా అరిచాడు.

అబ్బాయి : ఆ.. ఆ.. అర్థమైంది, అర్థమైందిలే! అప్పుడేదో షాకులో ఉండి సరిగా ఫాలో కాలేకపోయా. కొలువుల కతేంది బాబాయ్? నువ్వేమీ చెప్పలేదు.
బాబాయి : వెటకారంగా ఓ నవ్వు నవ్వి, వీడికి ప్రాక్టికల్‌గానే చూపించాలనుకున్నాడు. సికింద్రాబాద్‌ గోరఖ్‌పూర్‌ రైలెక్కారిద్దరూ! దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి వాడి యక్ష ప్రశ్నలను ఆపాలి. రెండు స్వయంగా బుల్డోజర్‌ రాజ్యంలో కాలు మోపి వస్తే పుణ్యం, పురుషార్థం – రెండు దక్కుతాయి. రైలు దిగగానే చుట్టూ బోలెడన్ని పకోడీలు, మిర్చి, బజ్జీలు తయారు చేసే చిన్న చిన్న హోటల్స్‌ ఉన్నాయి. చాలామంది తెలుగు మాట్లాడుతూ ఉండటం వల్ల ఇద్దరూ అటు పరిగెత్తారు. ఉస్మానియాలో ఎమ్మెస్సీ చేసినోడు, హెచ్‌యూసీలో ఎంబీఏ చేసిన వాడు – ఇద్దరూ కలిసి వారి, వారి పొలాలమ్మి, ఆ డబ్బుతో అక్కడ దుకాణం పెట్టారు. గుంటూరు నుండి మిరపకాయలు తెప్పించి మిర్చి బజ్జీ చేయడంతో వారి హోటల్‌ మంచి సందడిగా ఉంది. ఎంత ప్రధానమంత్రి చెప్పినా ఇంత చదువూ చదివి హైదరాబాద్‌లో పకోడీల షాపు పెట్టడం నామోషీగా ఫీల్‌ అయ్యారు. కుంభమేళల్లాంటి జాతర్లు బాగా జరుగుతాయి కాబట్టి ఉత్తరప్రదేశ్‌ అయితే ఎంతో కొంత ఆదాయమొస్తుందని భావించారు. బానే వస్తున్నట్టుంది. మంచి ఊపులో ఉన్నారు. పైగా, స్టార్టప్‌లకు ఈ ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇస్తోంది. వేరే రాష్ట్రం నుండి దిగుమతి చేసుకునే సరుకుపై మొన్ననే జీఎస్టీ రద్దు చేశారు.

‘యోగి’గారి దయ వల్లనే పకోడీలు, మిర్చి బజ్జీలు అమ్ముకునే ‘బిజినెస్‌’ను కూడా స్టార్టప్‌ల జాబితాలో చేర్చారని అక్కడ చాలా ప్రచారం. ఆయనకు చాలా రుణపడి వున్నామని మన పిచ్చివాళ్లు అనుకున్నా, బేసిక్‌గా యూపీ నిండా ఇలాంటి పకోడీలమ్మే షాపుల్లో డాక్టర్లు (వ్యాపమ్‌ స్కామ్‌ ఫేమ్‌) ఇంజినీర్లు లాంటి బాపతంతా ఎప్పట్నించో వున్నారు. పెద్దాయన ఏకంగా దావోస్‌లోనే 2018లో పకోడీలు చేయడం కూడా ఉపాధే అని ధైర్యంగా ప్రపంచ దేశాధినేతల ముందు, సీఈఓల ముందు అనడానికి కారణమదే! గుంటూరు మిరప కాయలకు థాంక్స్‌ చెప్పాలి. ఆ మిర్చి బజ్జీల కారం మందుల్లోకి బాగా ఉపయోగపడిందని వేరే చెప్పాలా? 2024 – 25లో యూపీ ఎక్సైజ్‌ ఆదాయం రూ.51వేల కోట్లు. ఆశ్చర్యమేమంట ఒక్క జనవరి – ఆగస్టు నెలల్లోనే రూ. 22,337 కోట్ల నుండి ఆ స్థాయికి చేరింది! సుమారు 45 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు దేశ, విదేశాల్నుండి పోగయిన తర్వాత ఆ మాత్రం ఆదాయం రాకపోతే ఎలా అనేది కొందరి వితండ వాదన!

ఇవన్నీ చూసిన తర్వాత కొంత దిగాలుగా బాబాయి, ఒకింత హుషారుగా అబ్బాయి రిటర్న్‌ జర్నీకి సమాయత్త మయ్యారు. ఆ హిందీ గోలపోయి సికిందరాబాద్‌లో కాలుమోపి ఇద్దరూ ప్రశాంతంగా జూబ్లీహిల్స్‌కి క్యాబ్‌ బుక్‌ చేసుకుని పోతున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వచ్చేసరికి స్టైల్‌గా, టక్‌ చేసుకుని టై కట్టుకుని ఓ ముప్పయ్యేండ్ల అధునాతన డింభకుడు, మరో మోడర్న్‌ బండి మీద (బహుశా న్యూయార్క్‌ నుండి దిగుమతి చేసుకున్నట్టున్నాడు) ”పొటాటోస్‌, టొమాటోస్‌, కొరియాండర్‌ లీవ్స్‌ (కోత్‌మీర్‌ కట్టలు) స్పినాచ్‌ (పాలకూర) కరీ లీవ్స్‌ (కలేమాకు)” అని బోర్డు తగిలించి చిన్నగా నెట్టుకెళ్తున్నాడు. ఉద్యోగం ఊడిన హైటెక్‌సిటీ ఉద్యోగో, మెడికల్‌ రిప్రజెంటేటివో అనుకున్నాడు అబ్బాయి. ఆ మాటే బాబాయినడిగాడు. వాడ్నే అడగమన్నాడు.
అబ్బాయి : వ్వాట్‌ బాస్స్‌! మీ పర్సనల్‌ మేనేజర్‌ (పీఎం) బాధితుడివా? అన్నాడు.
చి/నిరుద్యోగి : మన ప్రధానమంత్రి (పీఎం) బాధితుడ్ని అన్నాడు.
బాబాయి మొహం కందగడ్డలా మారింది దాంతో!

ఇట్లు
నారదరావ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -