నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడో దశ ఎన్నికలు 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో మిగిలిన 3,752 సర్పంచి స్థానాలకు గాను 12,652 మంది పోటీ పడుతున్నారు.
36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా 116కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఉండటంతో మిగిలిన 28,410 వార్డులకు 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షింకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.



