ఎస్‌టీఎఫ్‌ఐ కేంద్ర కమిటీ నిర్ణయం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై జనవరి 29న పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్టు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) తెలిపింది. ఎస్‌టీఎఫ్‌ఐ కేంద్ర కార్యదర్శి వర్గం, కేంద్ర కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో ఢిల్లీలోని ఫరీదాబాద్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు సీఎన్ భార్తి అధ్యక్షతన జరిగాయి. జాతీయ విద్యా విధానం రద్దు, పాతపెన్షన్ పునరుద్ధరణ, టెట్ నుంచి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వా లని కోరుతూ 2026 జనవరి 29న పార్లమెంటు మార్చ్ మహా ధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎన్ భార్తి, చావ రవి తెలిపారు. కేంద్ర పాలకులు కార్పొరేటీ కరణ, వ్యాపారీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్నారని, పేదలను చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. అశాస్త్రీయ అంశాలతో కూడిన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యారంగ బాధ్యత ప్రభుత్వమే చూడా లని, కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను తక్షణం మానుకోవాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి అమలులో ఉన్న నూతన పెన్షన్ విధానం కార్పొ రేట్లకు లాభం తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ ఉన్న యూపీఎస్, జీపీఎస్, సీపీఎస్ లాంటి స్కీమ్స్ తమకు అంగీకారం కాదని స్పష్టం చేశారు. తక్షణమే పాతపెన్షన్‌ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ముందు నియామకమైన ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాలనే సుప్రీంకోర్టు తీర్పు అప్రజాస్వా మికం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై కోర్టులో ఎస్‌టీఎఫ్‌ఐ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని, కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు 2025 నవంబర్ 25న ప్రధాన మంత్రి కార్యాలయానికి అన్ని జిల్లా యూనిట్స్ నుంచి వినతిపత్రాలు మెయిల్ చేయాలని పిలుపు ఇచ్చారు.
నవంబర్ నెలాఖరులోగా అధికార, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి టెట్ మినహాయింపు అంశాన్ని పార్లమెంటులో చర్చిం చాలని కోరతామన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జిల్లా కేంద్రాల్లోనూ, జనవరి 5న రాష్ట్ర కేంద్రాల్లోనూ ధర్నాలు చేయాలని నిర్ణయించామని అన్నారు. త్వరలోనే జాతీయ స్థాయిలో సోదర ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టెట్‌పై ఐక్య కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. డిసెంబర్ 10న ”మానవ హక్కులన్నీ మహిళా హక్కులే” అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని నిర్వహించాలని, సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని జనవరి 3న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌టీఎఫ్‌ఐ అధ్యక్షుడు సీఎన్ భారతి, ప్రధాన కార్యదర్శి చావ రవి తదితర ఆఫీసు బేరర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, కార్యదర్శి అరుణ కుమారి, తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, ఉపాధ్యక్షులు సీహెచ్ దుర్గా భవాని, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు.



