తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
వికారాబాద్‌లో పోరు యాత్ర సభ
నవతెలంగాణ-వికారాబాద్
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు దేశవ్యాప్త ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని లేబర్ అడ్డా వద్ద ప్రజాసంఘాల పోరు యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర జిల్లాలోని వికారాబాద్, దోమ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా వికారాబాద్‌లో ప్రజాసంఘాల నాయకులు ఆర్.మహిపాల్ అధ్యక్షతన సభ నిర్వహించారు. సాగర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడుదారులకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు.
అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు, విద్యుత్ చట్ట సవరణ చట్టం, విత్తన బిల్లు, వీబీ జీ రామ్ జీ చట్టం, బీమా రంగానికి వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి తదితర వాటిని తీసుకొచ్చిందన్నారు. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త పోరు జాతలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ, ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ పాల్గొనా లన్నారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, అధ్యక్షులు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శమయ్య, ఉపాధ్యక్షులు మహిపాల్, జిల్లా కోశాధికారి బుస చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.



